మీ రాజకీయ తగాదాలకు కోర్టును వాడుకోకండి: చీఫ్ జ‌స్టిస్ బోబ్డే

రాజకీయ వర్గాలకు ఏవైనా తగాదాలుంటే.. ఏదో ఒక టీవీ ఛానల్ కి వెళ్లి పరిష్కరించుకుంటే మంచిది అని.. అంతేకానీ ఆ గొడవల కోసం కోర్టుకు రాకూడదని సుప్రీం ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ఐ బొబ్డే  అన్నారు.

పశ్చిమ బెంగాల్‌లో జరిగిన రాజకీయ హత్యలపై బీజేపీ తరపున ఆ పార్టీ అధికార ప్రతినిధి గౌరవ్ బన్సాల్ ఓ పిల్ దాఖలు చేశారు. సీనియర్ లాయర్  గౌరవ్ భాటియా ఆ పిల్ ను సోమవారం కోర్టుకు సమర్పించారు.  తృణమూల్ కాంగ్రెస్ నేతృత్వంలోని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కపిల్ సిబల్.. ఈ పిటిషన్ పై అభ్యంతరం తెలుపుతూ…’ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం కోసం రాజకీయ పార్టీలు వేసిన పిటిషన్లను కోర్టు పరిశీలించాలి’ అని ఆ పిటిషన్ లో పేర్కొనడాన్ని తప్పుపట్టారు.

చీఫ్ జస్టీస్ దీనిపై మాట్లాడుతూ, “రాజకీయ తగాదాలను పరిష్కరించడానికి ఇరు రాజకీయ వర్గాలు  కోర్టును ఒక వేదికగా ఉపయోగిస్తున్నాయని మాకు బాగా తెలుసు. మీరిద్దరూ ఒక టీవీ ఛానెల్‌కు వెళ్లి అక్కడ ఈ తగాదాలను పరిష్కరించుకుంటే మంచిది” అని అన్నారు.

కోర్టులో రాజకీయ ప్రకటనలు చేసినందుకు గాను ఇద్దరు లాయర్లు కపిల్ సిబల్, గౌరవ్ భాటియా లను ధర్మాసనం తప్పుబట్టింది.

Latest Updates