మేక చావు..రూ.3కోట్ల నష్టం

బొగ్గు నిక్షేపాల్ని వెలికితీసే ఓ సంస్థ గోటితో పోయేదాన్ని గొడ్డలిదాకా తెచ్చుకొని అక్షరాల రూ.3కోట్లు నష్టపోయింది. ఆ మూడుకోట్ల నష్టం బొగ్గు ఉత్పత్తి ఆగిపోయినందుకు కాదు. ఓ మేక చనిపోయినందుకు. అదేంటి మేక చనిపోతే రూ.3కోట్ల నష్టం ఎలా వస్తుందనే అనుమానం రావొచ్చు. అందుకు కారణం లేకపోలేదు.

మేకే మా ప్రాణం

ఒడిశాకు చెందిన మహానంది కోల్ ఫీల్డ్ లిమిటెడ్ సంస్థ స్థానికంగా ఉండే బొగ్గు నిక్షేపాలను వెలికితీసి రైల్వే వ్యాగన్లకు బొగ్గును సరఫరా చేస్తుంది.  ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 1న సదరు సంస్థ బొగ్గు నిక్షేపాల్ని తరలిస్తున్న రైల్వే ట్రక్ ను ఢీకొని ఓ మేక మృతి చెందింది.

అంతే ఆ మేక మృతి పట్ల ఆగ్రహం వ్యక్తం చేసిన యజమాని, స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. మృతి చెందిన మేక రూ.60వేలు ఉంటుందని, తక్షణమే నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. దీంతో వారిని అడ్డుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగి వారిని చెదరగొట్టే  ప్రయత్నం చేశారు. ఆందోళనతో మూడున్నర గంటల పాటు బొగ్గు రవాణా నిలిచిపోవడంతో మహానంది కోల్ ఫీల్డ్ లిమిటెడ్ సంస్థ కు రూ.1.4 కోట్ల నష్టం వాటిల్లింది. అంతేకాదు రవాణా ఆలస్యం కావడంతో రూ.1.28కోట్లు, బొగ్గు ఉత్పత్తి నిలిచిపోవడంతో రూ.46లక్షలు నష్టపోవాల్సి వచ్చింది. అయితే చావుదప్పి కన్నులొట్టపోయింది అన్న చందంగా భారీ ఎత్తున నష్టం రావడంతో బొగ్గు ఉత్పత్తి, రవాణాకు విఘూతం కలిగించిన ఆందోళన కారులపై చర్యలు తీసుకోవాలని సంస్థ ప్రతినిధులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Latest Updates