సర్వే రిపోర్ట్ : భద్రాచలం దగ్గర పెట్రోలియం ఉన్నట్లు గుర్తింపు

భద్రాచలం : గోదావరి లోయలో పెట్రోలియం, సహజవాయువులు ఉన్నట్లు ఓఎన్ సీ గుర్తించింది. ఇంధన నిక్షేపాలు అపారంగా ఉన్నట్లుగా వారి సర్వేలో తేలింది. తెలంగాణ- ఆంధ్రా సరిహద్దుల్లో ఇటీవల ఓఎన్ సీ సర్వే ప్రారంభించింది. జిల్లాలోని మణుగూరు, చర్ల, దుమ్ముగూడెం, ఖమ్మం జిల్లాలోని పెనుబల్లి మండలాల్లో పెట్రోలియం, వాయు నిక్షేపాలు ఉన్నట్లు గుర్తించాక ఈ సర్వేకు శ్రీకారం చుట్టారు. కంప్యూటర్ పరిజ్ఞానంతో శబ్ద తరంగాలను భూమి పొరల్లోకి పంపించి అధ్యయనం చేస్తున్నారు. ఇంకోవైపు శాస్త్రవేత్తల పర్యవేక్షణలో భూమిలో తవ్వకాలు జరుపుతున్నారు.

వీటి ఫలితాలు ఆరు నెలల తర్వాత వస్తాయి. రెండు రాష్ట్రాల సరిహద్దుల్లోని పోలవరం విలీన మండలాలైన పశ్చిమ గోదావరి జిల్లా కుక్కునూరు, తూర్పు గోదావరి జిల్లా ఎటపాక, తెలంగాణలోని దుమ్ముగూడెం మండలాల్లో గోదావరి ఇసుక పొరల్లో కూడా ఈ సర్వే సాగుతోంది. గోదావరి పరివాహక ప్రాంతంలో అపారమైన నిక్షేపాలు ఉన్నట్లుగా ఏనాడో గుర్తించారు.  సింగరేణి సంస్థ 1970కి ముందే గోదావరిలో బొగ్గు నిక్షేపాలు ఉన్నట్లుగా గుర్తించింది. భద్రాచలం డివిజన్లోని చర్లలో గ్రేడ్‍-1 బొగ్గు ఉన్నట్లుగా నివేదికలు వచ్చాయి. తాజాగా ఓఎన్ సీ సర్వేతో చమురు, సహజ వాయువులు ఉన్నట్లుగా స్పష్టం అవుతోంది. మూడు జిల్లాల్లో సర్వే భద్రాద్రికొత్తగూడెం, ఖమ్మం , వరంగల్‍ జిల్లాల్లో చమురు, గ్యాస్‍ నిల్వల కోసం ఓఎన్ సీ ముమ్మరంగా సర్వే చేస్తోంది. GPS ఆధారంగా అన్వేషణ జరుపుతున్నారు.

ముందుగా GPS కోఆర్డినేషన్ తో సర్వే పనులు పూర్తి చేశారు. ఎక్కడె క్కడ అన్వేషణకు వీలుందో అక్కడ గుర్తులు పెట్టుకున్నారు. జియోలాజికల్‍ అధికారులు ఒక రిపోర్టు తయారు చేసి ఆ సంస్థకు ఇచ్చారు. ఈ రిపోర్టు ఆధారంగా ఓఎన్ సీ గత కొన్ని రోజులుగా వందల యంత్రాలు, కూలీల సాయంతో ముమ్మరంగా చమురు, గ్యాస్‍ కోసం వేట మొదలుపెట్టింది.  ఇవి లభ్యమైతే ఈ ప్రాంతవాసులకు ఉపాధి దొరికి, అభివృద్ధి చెందుతుందని అధికారులు చెబుతుండటంతో గిరిపుత్రుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. మొదటి దశ సర్వేలో భాగంగా అధికారులు వాగులు, వంకలు, గోదావరి నది, అడవులపై దృష్టి పెట్టారు. ఉపగ్రహ చాయాచిత్రం ఆధారంగా ఆ ప్రాంతానికి చేరుకుని కిలోమీటర్ల కొద్ది పొడవైన వైర్లు పరిచి వాటినన్నింటిని అనుసంధానిస్తున్నారు. కంప్యూటర్‍ సాయంతో ఈ వైర్ల ద్వారా శబ్ద తరంగాలను భూమిలోకి పంపించి అధ్యయనం చేస్తున్నారు. శాస్త్రవేత్తల రిపోర్టు ఆధారంగా ఒక్కోచోట వందల అడుగుల లోతు వరకు తవ్వకాలు జరుపుతున్నారు. మొదటి దశ సర్వే పనులను టూడీ సెస్మిక్‍ పనులుగా ఓఎన్ సీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ కీలకమైన ఘట్టం పూర్తయితే ఈ ప్రాంతంపై ఒక అంచనాకు వస్తారు. ఇప్పటికే కృష్ణా బేసిన్ లో గ్యాస్​, చమురును వెలికితీస్తున్న ఓఎన్ సీ ఇక గోదావరి లోయలో కూడా తవ్వేందుకు ప్రణాళికలు రచిస్తోంది.

Latest Updates