తగ్గిన బంగారం దిగుమతులు!

న్యూఢిల్లీ : ధరలు భారీగా పెరగడంతో పాటు దేశ ఆర్థిక వ్యవస్థ మందగించడంతో బంగారం దిగుమతులు నవంబర్ నెలలో కూడా తగ్గాయి. దీంతో వరుసగా ఐదవ నెలలో కూడా పసిడి దిగుమతులు తగ్గినట్టయ్యింది. ఇన్ బౌండ్ రవాణా( వ్యాపారాల కోసం చేసుకునే దిగుమతులు) గతేడాది నవంబర్‌తో పోలిస్తే ఈ నవంబర్‌లో 19 శాతం తగ్గి 56.1 టన్నులకు చేరుకుందని, మొత్తంగా ఈ ఏడాది ప్రారంభం నుంచి నవంబర్ నెల వరకు గమనిస్తే దేశీయంగా బంగారం దిగుమతులు గతేడాది ఇదే సమయం కంటే 15 శాతం తగ్గి 597.5 టన్నులుగా నమోదైందని ఆర్థిక శాఖ అధికారి ఒకరు తెలిపారు. దేశ ఆర్థిక వ్యవస్థ స్లోడౌన్‌‌ ఎదుర్కొంటుండడంతో దేశీయంగా బంగారు నగలకు డిమాండ్ తగ్గింది. అంతేకాకుండా ఈ ఏడాదిలో ఇప్పటి వరకు బంగారం 20 శాతానికి పైగా ర్యాలీ చేయడంతో బంగారం ధరలు గరిష్టాలకు చేరుకున్నాయి. ఫలితంగా కూడా బంగారం డిమాండ్ 2016 నాటి కనిష్ట స్థాయికి పడిపోయింది. వీటితో పాటు వర్షా కాలం ఆలస్యంగా ప్రారంభమవ్వడం, పంట కోతలు ఆలస్యంగా మొదలవ్వడం వంటి కారణాలు గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై తీవ్రంగా ప్రభావం చూపాయి. దేశీయ బంగారం డిమాండ్‌లో 60 శాతానికి పైగా డిమాండ్ గ్రామీణ ప్రాంతాల నుంచే ఉండడం గమనార్హం. ‘పంట కోతలు ఆలస్యం అవ్వడం, వ్యవస్థలో మందగమనం, గ్రామీణ ప్రాంతాలలో తగ్గిన నగదు లభ్యతను తెలుపుతోంది’ అని ఇండియాట్రేడ్ డెరివేటివ్ అండ్ కమోడిటీస్, కమోడిటీ, కరెన్సీ హెడ్ హరిష్​ గలిపెల్లి అన్నారు.

దేశీయంగా వినియోగదారుల విశ్వాసం 2014 తర్వాత కనిష్ఠ స్థాయిలకు పడిపోయిందని కన్జూమర్ కాన్ఫిడెన్స్​ సర్వే శుక్రవారం పేర్కొంది. అయినప్పటికి పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం కానుండడంతో బంగారం దిగుమతులు నవంబర్ నెలలో అక్టోబర్, సెప్టెంబర్ నెలల కంటే ఎక్కువగా ఉన్నాయి. సాధారణంగా పండుగలు, పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం అవ్వడంతో ఏడాది చివరి క్వార్టర్లో బంగారం డిమాండ్ ఊపందుకుంటుంది. ‘డిసెంబర్ 15 నుంచి జనవరి 14 వరకు ఎటువంటి ప్రత్యేక రోజులు లేకపోవడంతో డిసెంబర్ నెలలో కూడా బంగారం దిగుమతులు పడిపోతాయి’ అని కామ్ ట్రెండ్జ్​ రిస్క్​ మేనేజ్మెంట్ సర్వీసెస్ డైరక్టర్ జ్ఞాన శేఖర్ త్యాగరాజన్ అన్నారు. అమెరికా‌‌‌‌‌‌‌‌‌‌-చైనా వాణిజ్య ఒప్పందంపై అనిశ్చితి పెరగడంతో పాటు, అమెరికా వడ్డీరే ట్లు, యుఎస్ అధ్యక్ష ఎన్నికలు, స్టాక్ మార్కెట్లు గరిష్ఠ స్థాయిల వద్ద ఉండడం వంటి కారణాల వలన బంగారం ధరలు ఎక్కువగానే ఉండే అవకాశం ఉందని ఆయన తెలిపారు.

Latest Updates