బంగారం తవ్వుకో… అమ్ముకో

Gold Mining Legal for everyone in venezuela
  • ఎవరైనా బంగారం తవ్వుకోవచ్చు
  • శక్తిని బట్టి ఎంతైనా తవ్వుకోవచ్చు
  • మరి.. ఆ బంగారం కొనేదెవ్వరు?
  • ఎవరైనా ఎంతైనా.. తవ్వుకునే అవకాశం
  • జనానికి ప్రభుత్వం ఇచ్చిన బంపర్ ఆఫర్
  • మామూలుగా వచ్చే దాని కన్నా 20 రెట్లు ఎక్కువ సంపాదిస్తున్నారు

Gold Mining Legal for everyone in venezuelaవెనెజులా దేశంలో అస్థిరత్వం రాజ్యమేలుతోంది. రాజకీయ సంక్షోభం ముదిరింది. ఆ దేశ కరెన్సీకి అంతర్జాతీయ మార్కె ట్లలో విలువ లేని పరిస్థితి. ఏ దేశంతోనూ వాణిజ్యం జరగని దారుణ స్థితి. ఏ దేశమూ వెనెజులాతో వ్యాపారం చేయొద్దని అమెరికా విధించిన ఆంక్షలతో ఆ దేశానికి సంకట పరిస్థితులు తలెత్తాయి. అందుకే వాళ్ల కరెన్సీ బొలీవర్ విలువ దారుణంగా పడిపోయింది. దేశంలో ద్రవ్యోల్బణం హద్దు దాటిపోయింది. డాలర్ నిల్వలు పడిపోయాయి. బయటి దేశాలతో వ్యాపారం చేసే మార్గాలు మూసుకుపోయాయి. ఆ సంక్షోభం నుంచి బయటపడాలని భావించిన వెనెజులా అధ్యక్షుడు నికోలస్ మదురో.. ‘విచ్చలవిడిగా బంగారం తవ్వండి.. మాకు అమ్మండి’ అంటూ జనానికి పెద్ద ఆఫర్ ఇచ్చారు.

2016 నుంచి ఇప్పటిదాకా జనం నుంచి ఆ దేశ ప్రభుత్వం కొన్న బంగారం 17 టన్నులు అంటే నమ్ముతారా దాని విలువ దాదాపు ₹4600 కోట్లు (65 కోట్ల డాలర్లు). ఇది ఆ దేశ సెంట్రల్​ బ్యాంకు చెబుతున్న లెక్కలే. ఆ బంగారాన్నే బయటి దేశాలకు అమ్ముకుంటూ వెనెజులా ఇప్పుడు కాలం వెళ్లదీస్తోంది. అయినా, కూడా ఆ దేశాన్ని ఎలాగైనా సరే ఆపాలని ట్రంప్ కంకణం కట్టుకున్నట్టున్నారు. ఏ దేశమూ వెనెజులాతో బంగారం వ్యాపారం చేయొద్దంటూ ఆయన తెగని ఆంక్షలు పెడుతున్నారు. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ లో వెనెజులాకు సుమారు ₹8491 కోట్ల బంగారు నిల్వలున్నాయి. వాటినీ విడుదల చేయొద్దంటూ బ్రిటన్​ మెడపై కత్తి వేలాడదీశారాయన. ఇతర విదేశీ కొనుగోలుదారులకూ ఆ హెచ్చరికలు పంపారు. ఇటు అమెరికా ఆంక్షలతో ఆ దేశ చమురు వాణిజ్యం పైనా పెద్ద ప్రభావమే పడింది. కనీసం అప్పులు కూడా పుట్టని దీనస్థితికి చేరింది. అందుకే సంఘటితంగా ఉన్న మైనింగ్ రంగాన్ని జాతీయం చేసేశారు. నిబంధనలనూ ఎత్తి పారేశారు.

లా కులేబ్రాతో మొదలు…

బంగారం తవ్వకానికి బాటలు లా కులేబ్రాతో మొదలవుతాయి. దక్షిణ వెనెజులాలోని ఓ మారుమూల అటవీ ప్రాంతమది. ఒకప్పుడు అక్కడ భారీగా మైనింగ్​ జరిగేది. ఇప్పుడూ జరుగుతోంది. కానీ, అప్పుడది సక్రమం. ఇప్పుడు అక్రమం. తవ్విన మట్టిని తీసుకుని ఎల్​ కలావోకు బాట పడతారు. అక్కడ రిఫైనరీలకు వాటిని అమ్ముతారు. అందులో చాలా వరకు అక్రమ మార్గాల్లో నడుస్తున్న రిఫైనరీలే. కొందరు విరిగిపోయిన షెడ్లలో రిఫైనరీలను నడిపిస్తున్నారంటే బంగారం వ్యాపారానికి ఎంత డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. దాన్ని అమ్మి మామూలు పనికి వచ్చేదానికన్నా 20 రెట్లు ఎక్కువగా సంపాదిస్తున్నారు మైనర్లు. మట్టి నుంచి వేరు చేసిన బంగారాన్ని సెంట్రల్​ బ్యాంకుకు అమ్ముతున్నాయి రిఫైనరీలు. దానిని ప్రభుత్వ అధీనంలోని మినర్వన్​ అనే మైనింగ్​ కంపెనీలో రిఫైన్​ చేస్తారు. ఆ తర్వాత శుద్ధి చేసిన బంగారాన్ని సెంట్రల్​ బ్యాంకు లాకర్లకు తరలిస్తారు. అయినా కూడా ఆ బంగారం నిల్వలు ఎప్పటికప్పుడు తగ్గిపోతూనే ఉన్నాయని అధికారులు చెబుతున్నారు.

జబ్బులు.. లూటీలు…

కూలీలు అంత కష్టపడినా మరో కష్టమూ వెంటాడుతోంది. అదే జబ్బులు.. దారి మధ్యలో లూటీలు. అడవి దోమలతో మలేరియా విజృంభిస్తోంది. వందల సంఖ్యలో జనం దాని బారిన పడుతున్నారు. అది ఒకెత్తయితే, గంటల కొద్దీ శ్రమించి తవ్విన బంగారం మట్టిని దారి మధ్యలో దొంగలు దోచుకెళ్లిపోతుంటారని జోస్ ఔలర్ అనే ఓ కుర్రాడు చెబుతున్నాడు. తనకు 5 సార్లు మలేరియా సోకిందన్నాడు. మైనింగ్​ ప్రమాదాలు సర్వసాధారణం. ఆ ప్రాంతాన్ని రక్షించేందుకు పంపిన ఆర్మీ కూడా మైనర్ల పట్ల కిరాతకంగా వ్యవహరిస్తున్న సందర్భాలు కోకొల్లలు. బంగారం తవ్వకాలప్పుడు సైన్యం వారిపై కాల్పులు జరుపుతోంది.

కొంటున్నది టర్కీ ఒక్కటే..

అమెరికా ఆంక్షలు విధించడంతో వెనెజులా నుంచి బంగారం కొనడానికి ఏ దేశమూ ముందుకు రావట్లేదు. ఈ కఠినమైన టైంలోనే టర్కీ తానున్నానంటూ వెనెజులాకు స్నేహ హస్తం అందించింది. టర్కీ అధ్యక్షుడు రెసెప్ ఎర్డోగాన్ కీలకమైన సాయం చేస్తున్నారు. అయినా కూడా అది అనధికారికంగానే చేస్తున్నారు. అమ్ముతున్న బంగారంలో ఎక్కువ శాతం టర్కీ రిఫైనరీలకే వెనెజులా అమ్ముతోంది. దాంతో వచ్చిన డబ్బులో కొంత భాగాన్ని అక్కడి ఆహార వస్తువులను కొనేందుకు ఖర్చు చేస్తోంది. అందులో ముఖ్యంగా టర్కీ పాస్తా, పాల పౌడర్ వంటివే ఎక్కువ. ఫుడ్ సబ్సిడీ ప్రోగ్రాంలో వెనెజులా వాటిని చేర్చింది. సబ్సిడీతో జనానికి అందిస్తోంది. గత ఏడాదితో పోలిస్తే టర్కీతో వెనెజులా వాణిజ్య బంధం ఎనిమిది రెట్లు పెరిగింది. 2016లో రాజధాని కరాకస్ నుంచి ఇస్తాంబుల్​కు డైరెక్ట్​ ఫ్లైట్ వేసింది వెనెజులా. అందులో జనం కన్నా ఎక్కువగా వెళ్లేది బంగారమే. 2018 కొత్త సంవత్సరం తొలి రోజునే సుమారు ₹254 కోట్ల విలువైన బంగారాన్ని పంపించింది సెంట్రల్​ బ్యాంక్ . గత ఏడాది దాదాపు ₹6354 కోట్ల విలువైన బంగారాన్ని టర్కీకి అమ్మింది. ఇస్తాంబుల్​ గోల్డ్​ రిఫైనరీ (ఐజీఆర్), సర్దేస్ కియమెత్లి మండేలే వంటి కంపెనీలకు బంగారాన్నివిక్రయిస్తోంది. అయితే, తాము వెనెజులా నుంచి ఏ బంగారమూ కొనట్లేదని ఐజీఆర్‌‌ చెప్పడం గమనార్హం.

Latest Updates