రోల్స్​రాయ్స్ కారును గోల్డెన్​ ట్యాక్సీగా…

రాజసం, దర్జా, లగ్జరీ.. ఒక్కటేమిటి అన్నింటికీ కార్లలో కేరాఫ్​ రోల్స్​రాయ్స్​. కుబేరులకు తప్ప మామూలు మనిషికి అందుబాటులో ఉండని అత్యంత లగ్జరీ కారది. అలాంటి కారు ‘ట్యాక్సీ’ అంటే ఊహించుకోగలరా? అసలు అది ట్యాక్సీ అవుతుందంటే నమ్మగలరా? కానీ, కేరళలో రోల్స్​రాయ్స్​ గోల్డెన్​ ట్యాక్సీని చూసేయొచ్చు. అవును, కేరళలోని ఆక్సిజన్​ రిసార్ట్స్​ ఓనర్​ బాబీ చెమ్మనూర్​ అనే వ్యక్తి రోల్స్​రాయ్స్​ ఫాంటమ్​ కారును ట్యాక్సీలా మార్చేశారు. అందులో ఒక్కసారైనా ఎక్కాలనుకునే ఓ మామూలు మనిషి కలను తీర్చడానికే ఈ ఏర్పాటంట. రెండు రోజుల పాటు తన రిసార్ట్​లో ఉండేవాళ్ల కోసం ఈ సర్వీస్​ను ప్రారంభించాడట. రిసార్ట్​కు వచ్చేటప్పుడు పికప్​ చేసుకోవడంతో పాటు, ఇంటి దగ్గర దిగబెట్టడానికి ఈ కార్​నే వాడతారట. అయితే, అది కూడా బాగా కాస్లీనే అనుకోండి. అందులో ట్రిప్​ను ఎంజాయ్​ చేయాలంటే రూ.25 వేలు కార్డులో నుంచి గీకాల్సిందే. అవును మరి, అంత లగ్జరీ కార్​లో ట్రిప్​ అంటే మామూలు మాటలు కాదు కదా. ఇండియాలో రోల్స్​ రాయ్స్​ ఫాంటమ్​ ఎక్స్​ షో రూం ధర దాదాపు రూ.9.5 కోట్లు. ఇప్పుడు అసలు విషయమేంటంటే, ఫొటోలో చూస్తున్నారు కదా.. ఓ ట్రక్కుపై యెల్లో ప్లేట్​ ఉన్న గోల్డెన్​ రోల్స్​రాయ్స్​ను తీసుకెళుతున్న ఫొటోను శిరీష్​ చంద్రన్​ అనే ఓ ట్విట్టర్​ యూజర్​ పోస్ట్​ చేశారు. ఆ ఫొటో కాస్తా వైరల్​ అయింది. రోల్స్​ రాయ్స్​ ట్యాక్సీని చూసి నెటిజన్లు షాకయ్యారు. అంతేకాదు, బప్పీ లహరి కారా ఏంటి అంటూ సెటైర్లు సంధించారు.

Latest Updates