సినీ ఫక్కీలో బంగారం అక్రమ రవాణా

బంగారం ధర రోజురోజుకు ఎంత పెరుగుతుందో.. దాని మీద మోజు కూడా అంతే పెరుగుతుంది. మన దేశంలో బంగారం ధర విపరీతంగా పెరుగుతుండటం.. బయట దేశాలలో తక్కువ ధరకు లభిస్తుండటంతో ఎలాగైనా బంగారాన్ని దక్కించుకోవాలని అక్రమార్కులు వింత ప్రయత్నాలు చేస్తున్నారు. దానికోసం వింతవింత పద్ధతులను అవలంభిస్తున్నారు. ఈ రెండు సంఘటనలే దానికి నిదర్శనంగా నిలిచాయి.

సింగపూర్ నుంచి మదురై వచ్చిన సకుల్ హమీద్‌ అనే ఓ ప్రయాణికుడి నుంచి అక్రమంగా రవాణా చేస్తున్న బంగారాన్ని మదురై విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఎయిర్ పోర్ట్‌లో తనిఖీలు చేస్తున్న అధికారులకు హమీద్‌ అనుమానాస్పదంగా కనిపించాడు. వెంటనే అతని సూట్‌కేసును తనిఖీ చేయగా.. సూట్‌కేసును లాగే రోలర్‌లో 1100 గ్రాముల బరువున్న బంగారు కడ్డీలను గుర్తించారు. హమీద్‌ విరుదునగర్ జిల్లాకు చెందిన వాడుగా గుర్తించారు. ఆ కడ్డీల విలువ రూ. 42 లక్షలు ఉంటుందని అసిస్టెంట్ కస్టమ్స్ కమిషనర్ వెంకటేష్ బాబు తెలిపారు.

అదేవిధంగా.. మస్కట్ నుంచి చెన్నైకి వచ్చిన విమానంలో 3 కేజీల 365 గ్రాముల బంగారు బిస్కెట్లను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మస్కట్ నుంచి చెన్నైకి వచ్చిన విమానం టెర్మినల్‌లో ఆగిన తర్వాత ప్రయాణికులందరూ వెళ్లిపోయారు. ఆ తర్వాత విమానాన్ని శుభ్రపరచడానికి సిబ్బంది అక్కడికి వచ్చారు. ఆ సమయంలో, విమానం రెక్క కింద ఏదో బాక్స్ ఉన్నట్లు సిబ్బంది గుర్తించారు. వెంటనే అధికారులకు తెలియచేయగా వారు వచ్చి ఆ పెట్టెను తీసి చూశారు. అందులో అక్రమంగా తీసుకొచ్చిన 3.365 గ్రాముల బంగారు బిస్కెట్లను అధికారులు గుర్తించారు. వాటి విలువ రూ. 1 కోటి 33 లక్షలు ఉంటుందని అధికారులు తేల్చారు. అయితే బంగారాన్ని అక్రమంగా రవాణా చేసింది ఎవరు? అనే విషయంపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ను ఫాలో అవ్వండి

Latest Updates