బంగారం వ్యాపారుల డిస్కౌంట్ల బాట

ఎవరూ ఊహించని రీతిలో గోల్డ్‌‌పై దిగుమతి సుంకం పెంచుతున్నట్టు నిర్మలా సీతారామన్ బడ్జెట్‌‌లో వెల్లడించగానే…దేశీయంగా బంగారం ధరలు రికార్డు స్థాయిలో పెరిగాయి. దీంతో డిమాండ్ దెబ్బతిన్నది. డిమాండ్ పడిపోయిన నేపథ్యంలో, డీలర్లు ఇక తప్పనిసరి పరిస్థితుల్లో డిస్కౌంట్ల బాట పట్టారు. సుమారు మూడేళ్ల గరిష్ట స్థాయిలో డిస్కౌంట్లను ఆఫర్ చేస్తూ.. బంగారం కొనుగోలుదారుల్ని ఆకర్షిస్తున్నారు డీలర్లు . చైనా తర్వాత ప్రపంచంలో అత్యధికంగా బంగారాన్ని ఉపయోగించే దేశం మనదే. తొలిసారి ఒక ఔన్స్‌‌కు 30 డాలర్ల వరకు అంటే రూ.2,053 వరకు డిస్కౌంట్లను బంగారం వర్తకులు ఇస్తున్నట్టు తెలిసింది. ఈ డిస్కౌంట్లు 2016 ఆగస్ట్‌‌ నాటి స్థాయిలకు అత్యధికం. నిర్మలా సీతారామన్ తన తొలి బడ్జెట్‌‌లో గోల్డ్, విలువైన మెటల్స్‌‌పై 10 శాతంగా ఉన్న దిగుమతి సుంకాన్ని 12.5 శాతానికి పెంచుతున్నట్టు ప్రకటించారు. ఈ నిర్ణయాన్ని గోల్డ్ ఇండస్ట్రీ అసలు జీర్ణించుకోలే కపోతోంది. దిగుమతి సుంకం పెంపుతో రిటైల్ డిమాండ్ దెబ్బతింటుందని, స్మగ్లింగ్ పెరుగుతుందని ఇండస్ట్రీ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. డ్యూటీ పెంపు అన్నది ప్రతి ఒక్కరికీ సర్‌‌‌‌ప్రైజింగ్‌‌గా ఉందని ముంబైకి చెందిన గోల్డ్ హోల్ సేలర్ అశోక్ జైన్ అన్నారు. 30 డాలర్ల డిస్కౌంట్లను ఆఫర్ చేసిన తర్వాత కూడా ధరలు అత్యధికంగానే ఉన్నాయని, ప్రజలు ఎవరూ బంగారం కొనడానికి ముందుకు రావడం లేదన్నారు. బడ్జెట్ ప్రకటన తర్వాత గోల్డ్ ఫ్యూచర్స్ 2 శాతానికి పైగా పెరిగి 10 గ్రాములకు రూ.35,100 వద్ద రికార్డు స్థాయిలకు చేరుకున్నాయి. దీంతో స్థానికంగా ధరలు కూడా పెరిగాయి. దిగుమతి సుంకాలను తగ్గిస్తారనే అంచనాలతో చాలా మంది జ్యూయల్లర్స్ బంగారాన్ని కొనలేదని ముంబైకి చెందిన ఓ బ్యాంక్ డీలర్ చెప్పారు. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఆందోళనలో ఉన్నారని, పాత ఇన్వెంటరీని భారీ డిస్కౌంట్లలో అందుబాటులోకి తెచ్చినట్టు పేర్కొన్నారు. కానీ డిమాండ్ చాలా బలహీనంగా ఉన్నట్టు వెల్లడించారు. ఇతర ఆసియన్ హబ్స్‌‌లో కూడా డిమాండ్ సరిగ్గా లేదు. ధరలు అధికంగా ఉండటంతో ఈ వారం గోల్డ్‌‌ డిమాండ్ చాలా తక్కువగా ఉందని సింగపూర్‌‌‌‌లోని డీలర్ గోల్డ్‌‌సిల్వర్ సెంట్రల్ ఎండీ బ్రెయిన్ ల్యాన్ అన్నారు. ఈ ధరల వద్ద చాలా మంది కస్టమర్లు బంగారాన్ని అమ్మి క్యాష్ చేసుకుంటున్నట్టు కూడా తెలిసింది.

వ్యాపారాలు ఇతర దేశాలకు వెళ్తాయ్….

గోల్డ్, ఇతర విలువైన మెటల్స్‌‌పై దిగుమతి సుంకాల పెంపుపై జెమ్స్ అండ్ జుయల్లరీ ఎక్స్‌‌పోర్టర్స్‌‌ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో వ్యాపారాలు ఇతర దేశాలకు తరలి వెళ్తాయని పేర్కొన్నారు. ఎగుమతులు తగ్గి, ఉద్యోగాలు పోయి ఇప్పటికే ఈ సెక్టార్ చాలా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోందని జెమ్స్ అండ్ జుయల్లరీ ఎక్స్‌‌పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్(జీజేఈపీసీ) ఛైర్మన్ ప్రమోద్ అగర్వాల్ అన్నారు. దిగుమతి సుంకాల పెంపుతో ఇండస్ట్రీ చాలా నిరాశ వ్యక్తం చేస్తున్నట్టు పేర్కొన్నారు. అంతేకాక వ్యాపారాలు విదేశాలకు తరలిపోతాయని, విదేశీ టూరిస్ట్‌‌లు ఇక్కడ జ్యూయలరీ కొనడం ఆపివేస్తారని చెప్పారు. పెద్ద పెద్ద డైమండ్ల ప్రాసెసింగ్ కూడా చైనా, వియత్నం వంటి పోటీ దేశాలకు తరలి వెళ్తుందని అన్నారు. ఈ నిర్ణయంపై ప్రభుత్వం రివ్యూ చేపట్టాలని కోరారు.ఈ నిర్ణయంతో గోల్డ్ స్మగ్లింగ్ పెరిగే అవకాశాలున్నాయని కూడా ఇండస్ట్రీ నిపుణులు అంచనావేస్తున్నారు. 2‌‌018–19 కాలంలో జెమ్స్ అండ్ జుయల్లరీ ఎగుమతులు 5.32 శాతం తగ్గి 30.96 బిలియన్ డాలర్లుకు చేరాయి.