నమ్మక ద్రోహి : 7 కిలోల బంగారంతో పరారైన వ్యక్తి అరెస్ట్

హైదరాబాద్ :  బంగారం తీసుకున్నాక వ్యాపారికి 2, 3 రోజుల్లో డబ్బులు ఇస్తూ.. నమ్మకం కలిగించాడు ఓ జ్యువెల్లరీ యజమాని. ఈ క్రమంలోనే బంగారం తీసుకోవడం పెంచుకుంటూ వచ్చాడు.  ఆ తర్వాత 7 కిలోల గోల్డ్ తీసుకుని పత్తా లేకుండా చెక్కేశాడు. ఈ సంఘటన నాలుగు నెలల కిందట హైదరాబాద్ లో జరుగగా..మంగళవారం ఆ కిలాడీ గజదొంగను పోలీసులు పట్టుకున్నారు.

పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

గుజరాత్ అహ్మదాబాద్ కు చెందిన యోగేష్ సహాని..రెండేళ్లుగా సికింద్రాబాద్ మొండా మార్కెట్ దగ్గర ఓ నగల దుకాణం నిర్వహిస్తుండేవాడు. స్థానికంగా ఉండే జ్యువెలరీ షాప్ యజమానుల నుండి బంగారం  కొనుగోలు చేస్తూ… మూడు రోజుల తర్వాత డబ్బులు చెల్లిస్తూ నమ్మకంగా ఉండేవాడు. ఈ జనవరిలో ఇదే విధంగా బంగారం ట్రేడింగ్ చెయ్యడం కోసమని నగరంలోని వివిధ షాపుల నుండి 2 కోట్ల 50 లక్షలు విలువ చేసే  ఏడు కిలోల బంగారాన్ని తీసుకొని పరారయ్యాడు.

బంగారం తీసుకెళ్లి రోజులు గడిచాయి. యోగేష్ సహాని కనిపించకపోవడంతో బాధితులు  పోలీసులను ఆశ్రయించారు. నాలుగు నెలల తర్వాత అతని స్వస్థలం అహ్మదాబాద్ లో ఉన్నట్లు సమాచారం రావడంతో..  అతన్ని వలపన్ని అరెస్ట్ చేశారు. 60 తులాలు బంగారం స్వాదీనం చేసి, నాంపల్లి కోర్టులో హాజరుపరిచినట్లు  పోలీసులు తెలిపారు.

Latest Updates