మందు బాబుల‌కు గుడ్ న్యూస్.. కాసేప‌టికే బ్యాడ్ న్యూస్

మందు బాబుల‌కు గుడ్ న్యూస్ లాంటి వార్త కాసేపు వాట్సాప్ గ్రూపుల్లో హ‌ల్ చ‌ల్ చేసింది. రేప‌ట్నుంచి(మార్చి-29) వైన్స్ షాపులు ఓపెన్ అవుతాయ‌నే న్యూస్ య‌మ స్పీడుగా చ‌క్క‌ర్లు కొట్టింది. దీంతో అమ్మ‌య్యా రేప‌ట్నుంచి ఎంచ‌క్కా చుక్కేసి ఇంట్లోనే ప‌డుకోవ‌చ్చ‌నుకున్నారు మ‌ద్యం ప్రియులు. తెలంగాణ స‌ర్కార్ లొగోతో అచ్చం ఆబ్కారీ శాఖ‌ విడుద‌ల చేసిన‌ట్లుగా ఉన్న ఫొటో చూసిన‌వారంతా నిజ‌మే అనుకున్నారట‌. స‌ర్కారుకు ఆదాయం వ‌చ్చేది లిక్క‌ర్ నుంచే క‌దా.. అందుకోస‌మే వైన్స్ ఓపెన్ చేస్తారేమో అనుకున్నారట‌. అందులోనూ సోష‌ల్ డిస్టెన్స్ పాటిస్దూ.. మ‌ధ్యాహ్నం 2 నుంచి 5-30 గంట‌ల వ‌ర‌కే తెరిచి ఉంటాయ‌ని ఉండ‌టంతో అంతా నిజ‌మే అనుకున్నారట‌. మ‌ద్యానికి అల‌వాటై ఓ వ్య‌క్తి మ‌ర‌ణించిన‌ట్లు కూడా వార్త‌లొచ్చిన‌ క్ర‌మంలో.. వైన్ షాప్స్ ఓపెన్ చేస్తున్నార‌ని వంద‌కి వంద శాతం న‌మ్మారట‌ ప్ర‌జ‌లు. మందు బాబులైతే ఆనందంతో వాట్సాప్ గ్రూపుల్లో య‌మ షేరింగ్ చేసిన‌ట్లు తెలుస్తోంది.

అయితే.. ఇది అవాస్త‌వ‌మ‌ని ఆబ్కారీ శాఖ తెల‌ప‌డంతో.. మందు బాబుల‌కు ఒక్క సారిగా తాగిందంతా దిగిపోయిన‌ట్ల‌య్యిందట‌. వెంట‌నే ఇది ఫేక్ అని ఉత్త‌ర్వు ఫోటో చ‌క్క‌ర్లు కొట్టడంతో అంతా అయోమ‌యం అవుతున్నార‌ట‌. మద్యం దుకాణాలు తెరుస్తారని నకిలీ ఉత్తర్వులు కొంద‌రు వాట్సాప్ గ్రూపుల్లో సర్క్యులేట్ చేస్తున్నార‌ని.. దీనిపై ఆబ్కారీ శాఖ‌ ఫోర్జరీ చర్యలకు సిద్ధ‌మైన‌ట్లు కూడా తెలుస్తోంది. దీంతో మ‌ద్యం ప్రియుల‌కు వైన్స్ తెరిచే న్యూస్ కాసేపే కిక్కిచ్చింది పాపం అంటూ వాట్సాప్ గ్రూపుల్లో సెటైర్లు వేసుకుంటున్నారట‌. ఓ వైపు ఫేక్ న్యూస్ గ్రూపుల్లో పోస్ట్ చేయ‌వ‌ద్ద‌ని ఎంత చెబుతున్నా ప‌నికి మాలిన వెద‌వ‌లు.. చివ‌ర‌కు ప్ర‌భుత్వాన్ని కూడా ఆట‌ప‌ట్టిస్తున్నార‌ని మ‌రికొంత మంది సీరియ‌స్ అవుతున్నట్లు స‌మాచారం.

Latest Updates