విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఫీజు లేకుండా చదువంతా ఫ్రీ..

ఫ్రీ కోచింగ్‍ అందిస్తున్న ప్రభుత్వ ఛానల్స్, వెబ్‍సైట్స్, యాప్స్​

గ్రామీణ, నిరుపేద యువతకు విద్య, ఉద్యోగ సమాచారాన్ని ఉచితంగా అందించేందుకు కేంద్ర  రాష్ట్రప్రభుత్వాల్లో పలు ఛానళ్లు, వెబ్‌‌‌‌సైట్స్, మొబైల్​ యాప్స్‌‌‌‌ అందుబాటులో ఉన్నాయి. వీటిలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వయంప్రభ, మన రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన టి‌‌‌‌–శాట్‍ నెట్‍వర్క్, డిస్క్ వెబ్‍సైట్లు ముఖ్యమైనవి. వీటితో పాటు ఏపీలో మన టీవీ అమరావతి పేరుతో ఎడ్యుకేషన్‍ కంటెంట్ అందిస్తున్న టెలివిజన్‍, యూట్యూబ్‍ ఛానల్‍ ఉంది. వీటి ద్వారా అకడమిక్‍, పోటీ పరీక్షలకు నిపుణులు అందించే వీడియోలు, మెటీరియల్‍ను ఎప్పుడైనా, ఎక్కడైనా ఫ్రీగా చదువుకోవచ్చు.

స్వయంప్రభ

ఇది 32 డీటీహెచ్ ఛానెళ్ల ద్వారా ఉచితంగా ఎడ్యుకేషనల్ కంటెంట్‌‌‌‌ అందిస్తున్న ప్లాట్‍ఫాం. అన్ని వర్గాల వారికి నాణ్యమైన విద్యనందించేందుకు దూరదర్శన్ టెలివిజన్‌‌‌‌తో సంయుక్త భాగస్వామ్యంలో దీనిని ప్రారంభించారు. కరిక్యులం ఆధారంగా బోధన సాగే ఈ ఛానళ్లను జీశాట్-15 ఉపగ్రహంతో అనుసంధానించి రోజూ నాలుగు గంటల పాటు ప్రసారం చేస్తారు. విద్యార్థులు ఏ సమయంలోనైనా వినేలా అన్ని సబ్జెక్టులను రోజూ నాలుగు సార్లు పున:ప్రసారం చేస్తారు. దీనికి కావాల్సిన కంటెంట్‍ను ఎన్‌‌‌‌పీటీఈఎల్, ఐఐటీలు, యూజీసీ, ఎన్‌‌‌‌సీఈఆర్‌‌‌‌‌‌‌‌టీ, ఎన్ఐవోఎస్ వంటి సంస్థలు అందిస్తాయి. డిగ్రీ, పీజీ స్థాయిలోని ఆర్ట్స్, సైన్స్, కామర్స్, ఫైన్‌‌‌‌ఆర్ట్స్, సోషల్ సైన్సెస్, హ్యుమానిటీస్, ఇంజినీరింగ్, టెక్నాలజీ, లా, మెడిసిన్, అగ్రికల్చరల్ వంటి సబ్జెక్టుల కంటెంట్‍ను అందిస్తారు. స్వయంప్రభ వెబ్‌‌‌‌సైట్‌‌‌‌లో ఒక వారం షెడ్యూల్‌‌‌‌ను ముందుగానే ప్రకటిస్తారు. ప్రసారం పూర్తయిన వీడియోలు యూట్యూబ్‌‌‌‌లో కూడా అందుబాటులో ఉంటాయి.

వెబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌సైట్​: www.swayamprabha.gov.in

డిస్క్

అకడమిక్‍, ఎంట్రన్స్ పరీక్షలకు సిద్ధమయ్యే ఇంటర్‍ విద్యార్థుల కోసం ఇంటర్మీడియట్‍ బోర్డు ప్రత్యేకంగా రూపొందించిన వెబ్‍సైట్‍, మొబైల్‍ యాప్‍ DISK (Digital Study Kit). ఇందులో అన్ని సబ్జెక్టులకు సంబంధించి పుస్తకాలు, వీడియోలు, సినాప్సిస్‍, మల్టిపుల్‍ చాయిస్‍, డిస్ర్కిప్టివ్, చాప్టర్‍వైజ్‍ ప్రశ్నలు తెలుగు, ఇంగ్లిష్‍ మీడియంలో ఉంటాయి. వీటిని డౌన్లోడ్‍ చేసుకొని చదువుకోవచ్చు. వీటితో పాటు ఎంసెట్‍, నీట్‍, జేఈఈ, సీఏ సీపీటీ, వంటి ఎంట్రన్స్ పరీక్షలకు మెటీరియల్‍ను చదువుకోవడంతో పాటు అన్‍లిమిటెడ్‍ ప్రాక్టీస్‍ టెస్టులు సాధన చేయవచ్చు. ఏ సబ్జెక్టులోనైనా సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. తెలుగు, ఇంగ్లిష్‍ మీడియంలో ఇంటర్‍ చదువుతున్న ఎవరైనా ఈ వెబ్‍సైట్‍ను వినియోగించుకోవచ్చు. ఇందులో ఉండే దాదాపు 6 వేల హై క్వాలిటీ వీడియోలు వినడం వల్ల తరగతిలోనే విన్న భావన కలుగుతుంది. మొత్తం 1700 పుస్తకాలను చదువుకోవచ్చు. 70 వేలకు పైగా మల్టిపుల్‍ చాయిస్‍ ప్రశ్నలతో పాటు దాదాపు లక్ష ప్రశ్నలు డిస్ర్కిప్టివ్‍ ఫార్మాట్‍లో ఉంటాయి. ఇందులో కొంత కంటెంట్‍ ఉచితం కాగా పూర్తిగా వినియోగించుకోవాలంటే 325 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది.

వెబ్‍సైట్‍: www.diskonline.in

మన టీవీ అమరావతి

ఇస్రో సహాయంతో ఆంధ్రప్రదేశ్‍ ప్రభుత్వానికి చెందిన డిపార్ట్‌‌‌‌మెంట్ ఆఫ్‍ ఇన్ఫర్మేషన్‍ టెక్నాలజీ, ఎలక్ర్టానిక్స్ అండ్‍ కమ్యూనికేషన్స్ మన టీవీ1, మన టీవీ2 అనే రెండు టెలివిజన్‍ ఛానళ్లను నిర్వహిస్తోంది. వీటి ద్వారా ఎడ్యుకేషన్‍, మహిళాభివృద్ధి, ఈ గవర్నెన్స్, గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం, ప్రభుత్వ పథకాలు, స్వయం సహాయక సంఘాల కార్యక్రమాలు ప్రసారం చేస్తారు. ఇందులో ఏపీ డీఎస్సీ, గ్రూప్స్ వంటి పోటీ పరీక్షలు, డిగ్రీ, ఇంటర్‍ వంటి అకడమిక్‍ పరీక్షలు, ఫోటోషాప్‍ వంటి డిజైనింగ్‍ కోర్సులకు దాదాపు 2 వేల వీడియో లెక్చర్స్ అందుబాటులో ఉన్నాయి. కామర్స్, బయాలజీ, మ్యాథమెటిక్స్, హిస్టరీ సబ్జెక్టులున్నాయి.

వెబ్‍సైట్‍: www.sapnet.gov.in

టి‌‌‌‌–శాట్‍ నెట్‍వర్క్

అందుబాటులో ఉండే టెక్నాలజీని ఉపయోగించుకొని విద్యార్థులకు అన్ని రకాల విద్య, ఉద్యోగ సమాచారాన్ని ఉచితంగా అందించడానికి SoFTNET (Society for Telangana State Network) అనే శాటిలైట్‍ చానల్స్ నెట్‍వర్క్ ను తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. డిపార్ట్ మెంట్ ఆఫ్‍ ఇన్ఫర్మేషన్‍ టెక్నాలజీ, ఎలక్ర్టానిక్స్ అండ్‍ కమ్యూనికేషన్స్ కింద నడిచే టి–శాట్‍ నెట్‍వర్క్ జీశాట్‍ 8 శాటిలైట్‍ ద్వారా 4 టెలివిజన్‍ ఛానళ్లను ప్రసారం చేస్తుంది. వీటిలో ‘‘టి–శాట్‍ నిపుణ, టి–శాట్‍ విద్య”(పూర్వం మనటీవీ) అనే రెండు ఛానళ్ల ద్వారా విద్య ఉద్యోగ సమాచారంతో పాటు వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి, టెలీ మెడిసిన్‍, ఈ పరిపాలన వంటి సేవలను అందిస్తోంది.

ఆడియో, విజువల్‍ మీడియా ద్వారా రాష్ర్టంలో పోటీ పరీక్షలకు ప్రిపేరయ్యే వారికి ఉచిత కోచింగ్‍, గైడెన్స్ ఇవ్వడం దీని ముఖ్య ఉద్దేశం. వీటికి టెలివిజన్‍ తో పాటు యూట్యూబ్‍లో దాదాపు 6 వేల వీడియోలు అందుబాటులో ఉన్నాయి. గ్రూప్స్, టీఆర్‍టీ, పంచాయతీ సెక్రెటరీ, పోలీస్‍, ఫారెస్ట్, రైల్వే, బ్యాంక్స్, ఎస్సెస్సీ వంటి పోటీ పరీక్షలతో పాటు ఆరు నుంచి పదోతరగతి, ఇంటర్‍, డిగ్రీ కోర్సుల్లో అన్ని సబ్జెక్టులకు కమీషనరేట్‍ ఆఫ్‍ కాలేజియేట్‍ ఎడ్యుకేషన్‍, స్కూల్‍ ఎడ్యుకేషన్ విభాగాల ఆధ్వర్యంలో సబ్జెక్టుల వారీగా వీడియోలున్నాయి. వీటిని ఉచితంగా డిస్టెన్స్ విధానంలో చదువుకోవచ్చు. టీవీలో మిస్‍ అయినా యూట్యూబ్‍, వెబ్‍సైట్‍, మొబైల్‍ యాప్‍ లేదా యూప్‍టీవీ వంటి ఇతర వెబ్‍ చానల్స్‌‌‌‌లోనూ వీక్షించవచ్చు.

సబ్జెక్టులివే

జనరల్‍ స్టడీస్‍: చరిత్ర, ఎకానమీ, జియోగ్రఫీ, పాలిటీ, కరెంట్‍ అఫైర్స్, ఫిజిక్స్, కెమిస్ర్టీ, బయాలజీ, సైన్స్ అండ్‍ టెక్నాలజీ, కరెంట్‍ అఫైర్స్, ప్రభుత్వ పథకాలు, ఎన్విరాన్‍మెంట్‍ వంటి సబ్జెక్టులకు దాదాపు 3 వేల వీడియోల్లో మెటీరియల్‍ ఉంది.

బ్యాంక్స్, ఎస్సెస్సీ, రైల్వే: మెంటల్‍ ఎబిలిటీ, రీజనింగ్‍, ఆరిథ్‍మెటిక్‍, ఇంగ్లిష్‍, సబ్జెక్టులకు మెటీరియల్​.

టీఆర్టీ సబ్జెక్టులు: పర్‍స్పెక్టివ్స్ ఇన్‍ ఎడ్యుకేషన్‍, చైల్డ్ సైకాలజీ, సబ్జెక్టుల వారీ కంటెంట్‍, మెథడాలజీ, హిందీ, ఉర్దూ సబ్జెక్టుల్లో దాదాపు 2500 వీడియోలు.

ఎంట్రన్స్ టెస్టులు: బోటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ర్టీ, మ్యాథమెటిక్స్ ఫర్‍ నీట్‍ అండ్‍ జేఈఈ లో 1200 వీడియోలు.

స్కిల్‍ ఎన్‍హాన్స్‌‌‌‌మెంట్‍: సాఫ్ట్ స్కిల్స్, పర్సనాలిటీ డెవలప్‍మెంట్ వీడియో లెక్చర్స్​.

వెబ్‍సైట్‍: www.softnet.telangana.gov.in

Latest Updates