మీది నుండి రైలు దూసుకెళ్లినా.. ఇంజిన్ పట్టుకుని ప్రాణాలతో బయటపడ్డ బుడతడు

హర్యానా : రైలు కింద పడిన రెండేళ్ల ఓ బుడతడు క్షేమంగా తప్పించుకుని మృత్యుంజయుడిగా నిలిచాడు. తన మీదినుంచి రైలు దూసుకెళ్లినా ఒంటి మీద చిన్న గీత కూడా పడకుండా క్షేమంగా బయటపడ్డాడు. ఈ అరుదైన సంఘటన హర్యానాలోని ఫరీదాబాద్ జిల్లా బల్లాగఢ్‌ రైల్వే స్టేషన్‌లో జరిగింది. మూమూలు రోజుల్లో కూడా అంతగా రద్దీ లేని ఈ స్టేషన్‌లో ప్రస్తుతం లాక్ ‌డౌన్ కారణంగా పెద్దగా రైళ్లు తిరగడం లేదు. దీంతో రెండేళ్ల ఓ పిల్లాడు, 14 ఏళ్ల తన అన్నతో కలిసి స్టేషన్ ‌లో పట్టాలపై ఆడుకుంటున్నారు. అదే సమయంలో ఢిల్లీ-ఆగ్రా రైలు అటుగా వచ్చింది. రైలును చూసి అన్న పక్కకు పారిపోగా .. రెండేళ్ల పిల్లాడు పట్టాలపైనే చిక్కుకున్నాడు. లోకో పైలట్ అతడిని చూసి ఎమర్జెన్సీ బ్రేక్ వేసినా..అప్పటికే రైలు అతడి మీది నుంచి దూసుకెళ్లి కొంత దూరంలో ఆగింది.

దీంతో లోకో పైలట్ దీవాన్ సింగ్, ఆయన అసిస్టెంట్ అతుల్ ఆనంద్ భయం భయంగా రైలు దిగి బాలుడి కోసం వెతికారు. తీరా రైలు కింద చూస్తే పిల్లాడు గుక్కపెట్టి ఏడుస్తూ కనిపించేసరికి ఊపిరి పీల్చుకున్నారు. పిల్లాడు సజీవంగా బయట పడడాన్ని నిజంగా నమ్మలేకపోయాం. చిన్నగాయం కూడా కాకుండా అతడు బయటపడడం ఆశ్చర్యంగా అనిపించిందని తెలిపాడు దీవాన్. ఈ ఘటనకు సంబంధించిన ఫొటో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. లోకో పైలట్, ఆయన అసిస్టెంట్ ఇద్దరూ ఆ చిన్నారిని క్షేమంగా బయటికి తీశారు. బాలుడు ఇంజిన్ మధ్యలో ఇరుక్కోవడంతో బయటికి తీసుకురావడం అంత సులభం కాలేదు. దీంతో ముందు అతడిని కంగారు పడొద్దని చెప్పి, తర్వాత ఆ ప్రమాదకరమైన ప్రదేశం నుంచి నెమ్మదిగా బయటికి తీసుకొచ్చి తల్లికి అప్పగించామని తెలిపారు ఆగ్రా డివిజన్ రైల్వేస్ కమర్షియల్ మేనేజర్ శ్రీవాస్తవ. ఎంతో సాహసం, సమయస్ఫూర్తితో బాబను కాపాడిన లోకో పైలట్లపై ప్రశంసల జల్లు కురుస్తోంది. వారిద్దరికి డివిజనల్ రైల్వే మేనేజర్ రివార్డు అందజేశారు.

Latest Updates