చైనీస్ యాప్స్‌ యాక్సెస్‌ను బ్లాక్ చేసిన గూగుల్

న్యూఢిల్లీ: చైనాకు చెందిన 59 యాప్స్‌ను కేంద్ర ప్రభుత్వం నిషేధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయా యాప్స్‌ ఇంకా ప్లేస్టోర్‌‌లోనే ఉండటంతో కొంత సందిగ్ధత నెలకొంది. దీనిపై ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ స్పందిస్తూ.. ఆయా యాప్స్‌ను యాక్సెస్ చేయకుండా తాత్కాలికంగా బ్లాక్ చేసినట్లు స్పష్టం చేసింది. ‘ఇండియా గవర్నమెంట్ ఇచ్చిన ఉత్తర్వులను సమీక్షిస్తున్నాం. ఇండియా గూగుల్ ప్లే స్టోర్‌‌లో అవేలబుల్‌గా ఉన్న ఆయా యాప్స్‌ యాక్సెస్‌ను టెంపరరీగా బ్లాక్ చేశాం. ఈ విషయాన్ని డెవలపర్స్‌కు తెలియజేశాం’ అని గూగుల్ ప్రతినిధి తెలిపారు. అయితే బ్లాక్ చేసిన యాప్స్ వివరాలను మాత్రం గూగుల్ వెల్లడించలేదు. కాగా, బ్యాన్ అయిన యాప్స్ డెవలపర్స్‌ స్వచ్ఛందంగా ప్లేస్టోర్‌‌ నుంచి తమ యాప్స్‌ను తొలగిస్తున్నారని సమాచారం. టిక్‌టాక్, షేర్ ఇట్, యూసీ బ్రౌజర్, వీచాట్, హలో సహా 59 చైనీస్ యాప్స్‌ను ఇండియా సోమవారం బ్యాన్ చేసిన విషయం విధితమే.

Latest Updates