రషీద్ ఖాన్ భార్య అనుష్క శర్మనా?

రషీద్ ఖాన్ భార్య అనుష్క శర్మనా?

న్యూఢిల్లీ: వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. అఫ్గాన్ క్రికెటర్ రషీద్ ఖాన్ భార్య ఎవరని గూగుల్‌‌లో సెర్చ్ చేస్తే నటి అనుష్క శర్మ పేరు కనిపిస్తోంది. నమ్మడం లేదా అయితే కింద స్క్రీన్ షాట్‌‌ను కూడా జత చేస్తున్నాం. చూసేయండి. కావాలంటే మీరూ గూగుల్ సెర్చ్‌‌లోకి వెళ్లి ‘రషీద్ ఖాన్ వైఫ్’ అని టైప్ చేసి చూడండి. స్క్రీన్‌‌‌పై అనుష్క శర్మ పేరుతో పాటు ఆమె ఫొటోలు వస్తాయి. నిజానికి రషీద్ ఖాన్‌‌కు అసలు పెళ్లే కాలేదు. అనుష్క శర్మ టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి భార్య అన్న సంగతి అందరికీ తెలిసిందే. అలాంటప్పుడు రషీద్ ఖాన్ భార్య పేరేంటని వెతికితే గూగుల్‌‌లో అనుష్క పేరు ఎందుకు వస్తోందనేగా మీ అనుమానం?

2018లో ఇన్‌‌స్టాగ్రామ్‌‌ చాట్ సెషన్‌‌లో భాగంగా కొందరు ఫ్యాన్స్ బాలీవుడ్‌‌లో మీకు ఇష్టమైన హీరోయిన్ ఎవరని రషీద్‌‌ను అడిగారు. దీనికి సమాధానంగా అనుష్క శర్మ, ప్రీతి జింటా అని రషీద్ చెప్పాడు. దీంతో అప్పటి నుంచి రషీద్ ఫేవరెట్ నటి అనుష్క శర్మ అని ఎక్కువగా వార్తలు ట్రెండింగ్ అయ్యాయి. అప్పటి నుంచి గూగుల్ ఇలా చూపిస్తోందట. ఐపీఎల్‌‌లో సన్ రైజర్స్ హైదరాబాద్‌‌కు ఆడుతున్న మిస్టరీ స్పిన్నర్ రషీద్.. అఫ్గాన్ జట్టు వరల్డ్ కప్ గెలిచేంత వరకు తాను పెళ్లి చేసుకోనని గత జూలైలో ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.