నిరుద్యోగుల కోసం గూగుల్​ కొత్త యాప్​

  • వైఫై హాట్​స్పాట్ల కోసం బీఎస్‌‌ఎన్‌‌ఎల్‌‌తో ఒప్పందం
  • చెల్లింపులకు టోకెనైజ్డ్‌‌ కార్డులు   
  • బెంగళూరులో ఏఐ ల్యాబ్​
  • కార్డుల కస్టమర్ల కోసం టోకెనైజ్డ్‌‌ కార్డులు
  • 2జీ ఫోన్లలో కూడా వాయిస్​ అసిస్టెంట్

న్యూఢిల్లీ: ప్రముఖ ఐటీ సేవల కంపెనీ గూగుల్‌‌ బెంగళూరులో ఆర్టిఫిషియల్‌‌ ఇంటెలిజెన్స్‌‌ (ఏఐ) ల్యాబ్‌‌ను ప్రారంభించింది. నగరంలో గురువారం నిర్వహించిన ‘గూగుల్‌‌ ఫర్‌‌ ఇండియా’ కార్యక్రమంలో ఈ విషయాన్ని ప్రకటించింది. ప్రముఖ సైంటిస్టు డాక్టర్ మనీశ్‌‌ గుప్తాను దీనికి హెడ్‌‌గా నియమించింది. ఈ ల్యాబ్‌‌ ఇండియాలో కంప్యూటర్‌‌ సైన్స్‌‌ రీసెర్చ్‌‌పై దృష్టి పెడుతుంది. మెషీన్‌‌ లెర్నింగ్‌‌, కంప్యూటర్ విజన్‌‌, లాంగ్వేజెస్‌‌, స్పీచ్‌‌, సిస్టమ్స్‌‌ వంటి విభాగాల్లో పరిశోధనలు చేస్తుంది. ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం, విద్యకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి పైన పేర్కొన్న టెక్నాలజీలను వర్తింపజేయడానికి పని చేస్తుంది. ఏఐ అప్లికేషన్లు, సేవలను ఇక్కడ రూపొందిస్తారు. ఫలితంగా కోట్లాది మంది ఇండియన్లకు ప్రయోజనం కలుగుతుంది.

అన్ని ఫోన్లకూ గూగుల్‌‌ అసిస్టెంట్‌‌

స్మార్ట్‌‌ఫోన్లతోపాటు ఫీచర్‌‌ ఫోన్లకు గూగుల్‌‌ అసిస్టెంట్‌‌ సేవలను అందించడానికి ఈ కంపెనీ వొడాఫోన్‌‌ ఐడియాతో ఒప్పందం కుదుర్చుకుంది. టోల్‌‌ఫ్రీ నంబరుకు ఫోన్‌‌ చేసి 2జీ కస్టమర్లు వాయిస్ అసిస్టెంట్‌‌ సేవలను ఉపయోగించుకోవచ్చు. డేటా అవసరం లేకుండానే గూగుల్‌‌ అసిస్టెంటును ప్రశ్నలు అడగొచ్చు. సమాచారం పొందవచ్చు. హిందీ, ఇంగ్లిష్‌‌ భాషల్లో ఇది జవాబులు ఇస్తుంది.

పల్లెటూళ్లకూ ఇంటర్నెట్​

గుజరాత్‌‌, బీహార్‌‌, మహారాష్ట్ర గ్రామీణ ప్రాంతాల్లో వై–పై హాట్‌‌స్పాట్లను విస్తరించడానికి ఇదే వేదికపై బీఎస్‌‌ఎన్‌‌ఎల్‌‌తో గూగుల్‌‌ ఒప్పందం కుదుర్చుకుంది. గూగుల్‌‌ ఇది వరకే 500 రైల్వే స్టేషన్లలో వై–ఫై హాట్‌‌స్పాట్లు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. కేంద్ర టెలికంశాఖ మంత్రి రవిశంకర్‌‌ ప్రసాద్‌‌ సమక్షంలో ఈ ఒప్పందం జరిగింది.

చెల్లింపులు ఇంకా ఈజీ

డిజిటల్ టోకెన్‌‌ విధానంలో ఫోన్ల ద్వారా ఆన్‌‌లైన్‌‌లో డబ్బు చెల్లించడానికి గూగుల్‌‌ టోకెనైజేషన్ టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చింది. కార్డు నంబరును వెల్లడించకుండానే పేమెంట్‌‌ను పూర్తి చేయగలగడం ఈ టెక్నాలజీ ప్రత్యేకత. ఇందుకోసం హెచ్‌‌డీఎఫ్‌‌సీ, యాక్సిస్‌‌, ఎస్‌‌బీఐ బ్యాంకులతో ఒప్పందం కుదుర్చుకుంది. వ్యాపారుల కోసం గూగుల్‌‌ పే బిజినెస్ యాప్‌‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

పాఠాలు చెప్పే బోలో

విద్యార్థులు మరింత బాగా చదివేందుకు, హోంవర్క్‌‌లో సాయపడేందుకు తయారు చేసిన బోలో యాప్‌‌ను మరింత విస్తరిస్తున్నట్టు గూగుల్‌‌ తెలిపింది. ఈ స్పీచ్‌‌ ఆధారిత యాప్‌‌ ఇక నుంచి బెంగాలీ, మరాఠీ, తమిళం, తెలుగు, ఉర్దూ భాషల్లో పనిచేస్తుంది. వీటిని చదవడం కూడా నేర్పుతుంది. ఈ యాప్‌‌లో ఇప్పటికే ఎనిమిది లక్షల మంది రిజిస్టర్‌‌ అయ్యారు.

నిరుద్యోగుల కోసం కోర్మో

చిన్నచిన్న ఉద్యోగాల కోసం అన్వేషించే వారి కోసం ప్రత్యేక యాప్‌‌ను అందుబాటులోకి తెస్తున్నట్టు గూగుల్ ప్రకటించింది.  కోర్మో  అనే కంపెనీ సహకారంతో దీనిని తయారు చేసింది.  దేశవ్యాప్తంగా అనేక చిన్న చిన్న వ్యాపార సంస్థలు, ఆఫీసుల్లో ఉద్యోగ సమాచారాన్ని దీని ద్వారా తెలుసుకోవచ్చు. ఇది  పూర్తిస్థాయిలో నిరుద్యోగులను, ఎంప్లాయర్‌‌ను అనుసంధానిస్తుంది. ప్రధానంగా ఇది రిటైల్, హాస్పిటాలిటీ, లాజిస్టిక్స్ రంగాలలో ఉన్న ఉద్యోగాల మీద దృష్టి పెడుతుంది.   షాపింగ్ మాల్స్, రిటైల్ ఔట్‌‌లెట్లు, హోటల్స్, లాజిస్టిక్స్ రంగంలోని జాబ్స్‌‌ గురించి ఎప్పటికప్పుడు తెలియజేస్తుంది.

Google set to enter India’s job search segment with Kormo

 

0

Latest Updates