మంచి కవి ప్రపంచంలో బతకలేడు

goreti-venkanna-in-bc-poets-meeting

బీసీ రచయితల వేదిక

సమావేశంలో కవి గోరటి వెంకన్న

బషీర్ బాగ్, వెలుగు: ఈ ప్రపంచంలో మంచి కవి చాలా కాలం బతకలేడని.. అందుకు సామాజిక వ్యవస్థే కారణమని ప్రజాకవి గోరటి వెంకన్న అన్నారు. సోమవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో బీసీ రచయితల వేదిక ఏర్పాటు చేసిన సమావేశంలో గోరటి వెంకన్నతో పాటు, తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రచయిత డాక్టర్ కందికొండ యాదగిరి రాసిన బీసీ కులాల కొత్తపాట–2019ని ఆవిష్కరించారు. అనంతరం గోరటి వెంకన్న మాట్లాడుతూ, నిజమైన కవులు తమను తాము దహనం చేసుకొని రచనలు చేస్తారన్నారు. బీసీ కులాలపై రచనలు చేయడానికి తమ సొంత ఊరు స్ఫూర్తి అన్నారు. కబీర్ తాత్వికత తనకు మార్గదర్శనమని తెలిపారు.

బ్రాహ్మణ ఆధిపత్యం, మతోన్మాదాన్ని ధిక్కరించే సత్తా బీసీలలో ఉందన్నారు. సామ్రాజ్యవాదం,  బ్రాహ్మణ కుల వ్యవస్థ, జాత్యాహంకారం, వర్ణ వ్యవస్థ, అసమానతలకు వ్యతిరేకంగా కవులు రచనలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ బీసీల రాజ్యాధికారం దిశగా సాహిత్య ఉద్యమానికి సిద్ధమవుతున్నామని అన్నారు. బీసీలను రాజ్యాధికారం చేపట్టేందుకు, రాజకీయ చైతన్యం కోసం ఈ పాట రచించారని ఆయన తెలిపారు. సమావేశంలో బీసీ రచయితల వేదిక అధ్యక్షుడు బైరి శేఖర్, రచయిత డాక్టర్ కందికొండ యాదగిరి, శ్యామ్ కుమార్, శ్రీనివాస్, బడే సాబ్, నగేష్ తదితరులు పాల్గొన్నారు.

Latest Updates