V6, వెలుగుపై సర్కారు కక్ష

ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని రాష్ట్ర సర్కారు V6 న్యూస్ చానెల్, వెలుగు దినపత్రికలపై కక్షగట్టింది. V6 చానెల్ కు ప్రభుత్వ అడ్వర్టైజ్మెంట్లను నిలిపేసింది. వెలుగు పత్రికకు ప్రకటనలు జారీచేయకుండా అడ్డుపడుతోంది. తెలంగాణ ప్రజల ఆదరణే పునాదిగా ఎదిగిన V6, వెలుగు.. ప్రభుత్వ ప్రకటనలు ఇవ్వకపోతే నడవలేని దుస్థితిలో లేవు. రేటింగ్లను మించిన స్థాయిలో జనం తిరుగులేని అభిమానం, నమ్మకం ఉన్నంత కాలం V6 మనుగడకు ఢోకా లేదు. ఉద్యమ నాయకుడిగా ఎదిగిన వ్యక్తి తనను నిలబెట్టిన సమాజంపైనే కక్షగట్టినట్లుగా వ్యవహరిస్తున్న తీరులో ఇది కూడా ఒక భాగంగా భావిస్తూ, ఈ విషయాన్ని జనం ముందు ఉంచుతున్నాం. ప్రజలు ఎన్నుకున్న నేతగా కేసీఆర్ కు ఎంత బాధ్యత ఉందో, జనం నమ్మిన చానెల్ గా ఆయనకంటే పెద్ద బాధ్యతే ఉందని V6 భావిస్తోంది. ఎంత కష్టమైనా, నష్టమైనా తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలబెట్టేలా, జనం అభిమానాన్ని, నమ్మకాన్ని నిలబెట్టుకునేలా పనిచేస్తూనే ఉంటామని వినయంగా చెబుతున్నాం. కరోనా లాక్డౌన్ టైంలోనూ అవేర్నెస్ అడ్వర్టైజ్మెంట్ల విషయంలో V6 పట్ల ప్రభుత్వం ఇదే వివక్షను చూపించింది. అడ్వర్టైజ్మెంట్లు ఆపేసి ఏదో నష్టం చేసినట్లు కేసీఆర్, ఆయన సన్నిహితులు సంతోషపడుతూ ఉండొచ్చు. కానీ చాలా విషయాలను చరిత్రే మనకు గుర్తుచేస్తుంది. సమైక్య రాష్ట్రంలో నాటి సర్కారు.. తెలంగాణ మీడియాను అన్ని రకాలుగా అణచివేయడానికి ప్రయత్నించింది. అప్పట్లోనూ యాడ్స్ ఇవ్వకుండా ఒత్తిళ్లు తెచ్చింది. అయినా ఉద్యమ స్ఫూర్తితో, తెలంగాణ ప్రజల అండతో V6 అన్ని ఇబ్బందులనూ ఎదిరించి నిలబడింది. ఇప్పుడు మన రాష్ట్రంలోనే తెలంగాణ మీడియాను అణిచేసే ప్రయత్నాలను కూడా అదే స్ఫూర్తితో ఎదుర్కొంటాం. తెలంగాణ ఆకాంక్షలు, ప్రయోజనాల విషయంలో రాజీపడకుండా స్వచ్ఛందంగా యాడ్స్ వదులుకున్నచరిత్ర V6 మేనేజ్ మెంట్ కు ఉంది. తెలంగాణ నీళను రాయలసీమకు, తెలంగాణ నిధులను ఆంధ్రా సంస్థలకు అప్పగించి సొంత రాష్ట్రంలో కొత్త ట్రెండ్ తెచ్చిన ప్రత్యేకత మన సర్కారుది.

వెలుగు దినపత్రిక విలేకరులకు అక్రెడిటేషన్లవిషయంలోనూ ప్రభుత్వం కుసంస్కారాన్ని ప్రదర్శించింది. దీనిపై ప్రెస్ కౌన్సిల్ కు ఫిర్యాదు చేసి చట్టపరంగా పోరాడి, కౌన్సిల్ ఆదేశాలతో వెలుగు జర్నలిస్టులు అక్రెడిటేషన్లను సాధించుకున్నారు. V6, వెలుగు అందించే వార్తలు, కథనాలపై జనం నుంచి వచ్చే ఫీడ్ బ్యాక్ ను గమనిస్తూ తప్పొప్పులు సరిచేసుకోవడం ఎడిటోరియల్ విధానం.

తెలంగాణ ఉద్యమానికి బలమైన వాయిస్గా నిలిచిన V6 ప్రజల సొంత చానెల్ గానే ఉండాలన్నది మేనేజ్మెంట్, ఎడిటోరియల్ టీమ్ కమిట్మెంట్. ఈ విషయంలో ఎప్పుడూ మార్పులేదు, ఉండదు. తెలంగాణ బతుకు, భాష, సంస్కృతి, సమస్యలకే ప్రాధాన్యం ఇచ్చే ఏకైక మీడియా హౌస్ గా ఉండడం వల్లే ప్రజలు ఆదరిస్తున్నారని మేం నమ్ముతున్నాం. ఈ బాధ్యత తోనే జనం అవసరాలు, సమస్యలను V6 వెలుగులోకి తెస్తోంది. రైతులు నష్టపోతున్నా.. పంటను తెగనమ్ముకోమని చెప్పే లీడర్లు, జీవోలు, డీపీఆర్ లను దాచిపెట్టుకునే పారదర్శకత, మంచినీళ్లు రాకుండానే 40వేల కోట్లు లీకైపోయిన మిషన్ భగీరథ, ప్రాజెక్టుల పేరుమీద ఏ లెక్కకూ దొరక్కుండా ఖర్చైపోయిన లక్ష కోట్లు, నోటిఫికేషన్లు లేకుండానే నోటిమాటల్లో భర్తీ అయిపోయిన లక్ష ఉద్యోగాలు, ప్రగతిభవన్ వేగాన్ని అందుకోలేకపోయిన డబుల్ బెడ్రూంఇండ్లు, ఒకే ప్రైవేటు హాస్పిటల్ని పోషించే ఆరోగ్యశ్రీ, కరోనా వస్తేగానీ బయటపడని దారుణమైన వైద్యసదుపాయాలు, ఆర్టీసీ కార్మికులు ప్రాణాలు కోల్పోతున్నా కనీస మానవత్వం లేకుండా అణిచేసిన తీరు, విశాలమైన సెక్రటేరియట్ని పాడుబెట్టి… భూత్ బంగ్లాలో దిక్కూమొక్కూ లేని పాలన వ్యవస్థ… ఇవేవీ తెలంగాణ జనం కోరుకున్నవి కాదు. ఇలాంటివాటినే V6, వెలుగు ప్రశ్నిస్తున్నాయి. ప్రశ్నిస్తూనే ఉంటాయి.

మీడియా కథనాల్లో తప్పులు ఉంటే దాన్ని ప్రశ్నించొచ్చు. అసలు ప్రభుత్వ లోపాలనే ప్రశ్నించొద్దనే తీరు ప్రజలకు, తెలంగాణ భవిష్యత్ కు మంచిదికాదు. తను దయదలచి దానం చేస్తే తప్ప ఏ వ్యవస్థా బతకకూడదనే రాచరిక భ్రమల్లో ప్రభుత్వ పెద్దలు ఉన్నారు. మీడియాకు ప్రభుత్వ అడ్వర్టైజ్మెంట్లు మెహర్బానీ కాదు. అది ఫోర్త్ ఎస్టేట్ గా మీడియాకున్న ప్రజాస్వామిక హక్కు. యాడ్స్ ఇచ్చినా ఇవ్వకపోయినా ప్రజల సమస్యలను వెలుగులోకి తెచ్చే మా ప్రయత్నంలో వెనకడుగు పడదు. ఉద్యమంలో తనతో కలిసి పోరాడిన వాళ్లను, తనను నిలబెట్టినవాళ్లను టార్గెట్ చేసి మరీ ఎక్కడా కనిపించకుండా, వాళ్లమాట వినిపించకుండా చేశారు కేసీఆర్. తెలంగాణ సాధనే లక్ష్యంగా పనిచేసిన సంఘాలు, సంస్థలను దెబ్బతీసి నిర్వీర్యం చేశారు. ఇంకోదిక్కు తెలంగాణను అడ్డుకున్న వాళ్లు, ఉద్యమకారులపై దాడులు చేసినవాళ్ళే ఇప్పుడు ఆయన సన్నిహితులుగా, ఆయనకు ప్రతినిధులుగా మారిపోయారు. రాష్ట్రంలో ప్రతిపక్షాలు, తెలంగాణ మీడియా, తనకు ఓట్లేసిన జనం తనను ప్రశ్నించకూడదన్న ఆలోచనను ఆయన బలంగా అమలుచేస్తున్నారు. అయితే నియంతృత్వ పోకడలతో అన్ని వ్యవస్థలను బలహీనం చేసి, అందరూ తన గుప్పిట్లోనే ఉండాలనే ఆలోచనలను ప్రజలు గమనిస్తున్నారని గుర్తించలేకపోతే దాని పర్యవసానాలను ఎదుర్కోక తప్పదు.
– ఎడిటర్

For More News..

అన్ లాక్ 2 గైడ్ లైన్స్ విడుదల

ఒకరిద్దరు చనిపోతే ఇంత బద్నాం చేస్తరా?

మోసపూరిత రాజకీయాలకు ప్రతినిధి పీవీ

ఎంట్రెన్స్ టెస్టులు ఉంటయా..? ఉండవా..?

Latest Updates