గేట్లెత్తితే పోయేదానికి ఎత్తిపోస్తున్నరు

కాళేశ్వరం నీళ్లు ఇచ్చినట్లు కలరింగ్​
ఎగువన ఎస్సారెస్పీలో గేట్లు ఎత్తితే వరద కాల్వ నిండుగా పారే చాన్స్​
అదేమీ పట్టించుకోకుండా సర్కారు రివర్స్​పంపింగ్​

హైదరాబాద్, వెలుగు: వరద కాల్వ రైతులకు ప్రభుత్వం మళ్లీ భారీ ఎత్తిపోతల ప్రదర్శనకు సిద్ధపడింది. ఎగువన ఉన్న ఎస్సారెస్పీ నుంచి ఖర్చు లేకుండా వచ్చే నీళ్లను వదిలేసి.. కింది నుంచి లిఫ్ట్ లతో కాళేశ్వరం నీటిని ఎత్తిపోసే మోటార్లను ఆన్​ చేసింది. గతంలో ఎన్నడూ లేనట్లు వరద కాల్వను కాళేశ్వరం నీటితో నింపినట్లు కలరింగ్ ఇస్తోంది. 102 కిలోమీటర్ల పొడవున్న ఈ కాల్వ పొడవునా భూగర్భ జలాలు పెంపొందించడంతోపాటు చెరువులు నింపుతున్నట్లు గొప్పలు చెప్పుకుంటోంది. నిజానికి పైనున్న ఎస్సారెస్పీ వరద కాల్వ గేట్లు ఎత్తితే.. గ్రావిటీ ద్వారా ఈ కాల్వ నిండుగా నీళ్లు పారే అవకాశముంది. ఈ నీటిని వద్దనుకొని దిగువన ఉన్న నీటిని ఎత్తిపోసేందుకు సర్కారు చేస్తున్న రివర్స్​ పంపింగ్.. సినిమాను తలపిస్తోంది. ఎల్లంపల్లి నుంచి ఒక టీఎంసీ నీటిని పంపు చేసి.. వరద కాల్వలో నీళ్లు నిలపడంతోపాటు దానిపై ఆధారపడ్డ చెరువులను నింపాలని సీఎం కేసీఆర్ కాళేశ్వరం ఈఎన్సీని ఆదేశించారు. సీఎం ప్రకటనకు ముందే ఇంజనీర్లు కాళేశ్వరం లింక్ -2లోని నందిమేడారం పంపుహౌస్ లో ఒక మోటారును నడిపి 3 వేల క్యూసెక్కులకు పైగా నీటిని ఎత్తిపోయడం మొదలుపెట్టారు. గురువారం సాయంత్రానికే లక్ష్మీపూర్ పంపుహౌస్ లోనూ ఒక మోటారును రన్​ చేసి వరద కాల్వకు లిఫ్ట్ చేశారు. ఈ నీటితోనే 60 చెరువులను నింపాల్సి ఉంటుంది. ఇందులో సగానికిపైగా చెరువులను ఇంతకు ముందే నింపారు. మంత్రి ప్రశాంత్​రెడ్డి సొంత నియోజకవర్గం బాల్కొండ పరిధిలో చెరువులకు నీళ్లు అందించే తూముల నిర్మాణం అప్పట్లో పూర్తి కాలేదు. ఇటీవలే ఆ పనులు కంప్లీట్ అయ్యాయి. అందుకే వరద కాల్వకు నీళ్లు విడుదల చేయాలని మంత్రి కోరిన వెంటనే నీళ్ల లిఫ్టింగ్​కు సీఎం ఆర్డరిచ్చారు. గురువారం ఎల్లంపల్లి నుంచి నందిమేడారం, లక్ష్మీపురం పంప్​ హౌజ్​లను ఆన్​ చేశారు. శుక్రవారం ఉదయం నుంచే జగిత్యాల సమీపంలోని ఎస్సారెస్పీ పునరుజ్జీవం మోటార్లను ఆన్ చేశారు. వారం రోజుల పాటు మోటార్లు నడిపి వరద కాల్వలో ఒక టీఎంసీ నీటిని నింపనున్నారు.

ఎగువన నీళ్లుంటే.. ఎత్తిపోసుడెందుకో..!
ఇటీవలే ఎస్సారెస్పీ ఎగువన ఉన్న బాబ్లీ ప్రాజెక్టు గేట్లు ఎత్తారు. దీనికి తోడు వానలు పడుతుండటంతో ఎస్సారెస్పీలో నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. ప్రాజెక్టులో నీటి మట్టం 1,070 అడుగులున్నప్పుడు.. అంటే 29 టీఎంసీల నీళ్లుంటే.. వరదకాల్వ గేట్లు ఎత్తి నీటిని కాల్వలోకి విడుదల చేయవచ్చు. వారం రోజులుగా ఇన్​ఫ్లో పెరగడంతో నీటిమట్టం అంతకు మించిపోయింది. బాబ్లీ గేట్లు ఎత్తడంతో.. ఎగువ నుంచి దాదాపు నాలుగు వేల క్యూసెక్కుల ఇన్​ ఫ్లో ప్రాజెక్టులోకి వచ్చి చేరుతోంది. శుక్రవారం సాయంత్రానికి ఎస్సారెస్పీలో 30.75 టీఎంసీల నీళ్లు నిల్వ ఉన్నాయి. దాదాపు రెండు టీఎంసీల నీటిని ఇక్కడి నుంచి వాడుకునే వీలుందని ఇంజనీర్లు చెబుతున్నారు. ముప్కల్​ దగ్గర ఉన్న గేట్లు ఎత్తితే.. గ్రావిటీ ద్వారా ఈ నీళ్లు మెట్​పల్లి, కోరుట్ల, జగిత్యాల మీదుగా వరద కాల్వ నిండుగా పారుతుంది. మిడ్ మానేరు వరకు నీళ్లు చేరుకుంటాయి. 102 కిలోమీటర్ల పొడవునా వరద కాల్వలో నీటిని నిల్వ చేయటంతో పాటు దారి పొడవునా ఉన్న చెరువులన్నీ నింపే వీలుంది. ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకం పేరిట ప్రభుత్వం చెప్పుకుంటున్నదీ ఇదే. కానీ.. కింది నుంచి నీళ్లను లిఫ్ట్ చేసి రాంపూర్​, రాజేశ్వరరావుపేట పంపులను ఆన్​ చేసి.. వరద కాల్వను రివర్స్​లో ఎగువకు పారిస్తోంది.

ఎల్లంపల్లిల ఉన్నదే 5.33 టీఎంసీలు
ఎగువన ఎస్సారెస్పీ నీటిని వదిలేసి.. ఎల్లంపల్లి ప్రాజెక్టును అట్టడుగు వరకు ఖాళీ చేస్తుండటం చర్చనీయాంశంగా మారింది. ఎల్లంపల్లి ప్రాజెక్టులో శుక్రవారం నాటికి 5.33 టీఎంసీల నీళ్లు ఉన్నాయి. అక్కడి నుంచి ఒక టీఎంసీకి పైగా నీటిని ఎత్తిపోసి వరద కాల్వ నింపుతామని ప్రభుత్వం ప్రకటించింది. గురువారం నుంచే మోటార్లు ఆన్​ చేసింది.ఇప్పటికే కొండపోచమ్మ ఎత్తిపోతల కోసం ఎల్లంపల్లిలో ఉన్న నీళ్లన్నీ ఎత్తిపోశారు. ఇప్పుడు ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకం కోసం మళ్లీ టీఎంసీకి పైగా నీటిని తరలించి ప్రాజెక్టును మరింత ఖాళీ చేస్తున్నారు. ఎల్లంపల్లికి వరద వచ్చే ఉమ్మడి ఆదిలాబాద్ వాగులు ఇప్పటి వరకు పొంగలేదు. కడెం ప్రాజెక్టులో నీటి మట్టం సగానికి తక్కువగా ఉంది. అది నిండి గేట్లు ఎత్తితే కానీ ఎల్లంపల్లి నిండే పరిస్థితి లేదు. మరోవైపు కాళేశ్వరం లింక్ –1లోని మేడిగడ్డకు పెద్దగా వరద రావడం లేదు. దీంతో కింది నుంచి ఎత్తిపోసి నింపే అవకాశం ఇప్పట్లో లేదు.

గతంలోనూ ఇంతే…
వరద కాల్వ సమీపంలో చెరువులు నింపేందుకు గతంలోనూ కింది నుంచే నీటిని ఎత్తిపోశారు. ఎగువన ఎస్సారెస్పీలో సమృద్ధిగా నీళ్లున్నా వాటిని దిగువకు వదులలేదు. ఎస్సారెస్పీకి భారీగా వరద వచ్చినప్పుడు మిడ్ మానేరుకు బుంగ పేరుతోనూ వరద కాల్వకు నీటిని విడుదల చేయలేదు. బుంగతో సంబంధం లేకుండా వరద కాల్వ ద్వారా వచ్చే నీటిని మిడ్ మానేరు గేట్లు ఎత్తి ఎల్ఎండీ నింపుకొనే అవకాశం ఉన్నా ఆ దిశగా కనీస ప్రయత్నం చేయలేదు. అప్పుడు కాళేశ్వరం నీళ్లనే సూర్యాపేట, కోదాడ వరకు ఇచ్చామన్నట్టుగా చెప్పుకోవడానికే ప్రయత్నించారు. ఇప్పుడు గ్రావిటీ ద్వారా వచ్చే నీటిని తీసుకోకుండా అదే రీతిన క్రెడిట్ గేమ్ మొదలు పెట్టారు.

‘కాళేశ్వరం’ మైలేజ్ పెంచడానికే..
కాళేశ్వరం ప్రాజెక్టుకు మైలేజ్ పెంచడానికి, ఆ ప్రాజెక్టే లేకుంటే పోచంపాడుకు దిక్కులేదని రైతులు అనుకోవాలనే ప్రభుత్వం కింది నుంచి నీటిని ఎత్తిపోయడానికి ప్రాధాన్యం ఇస్తోంది. వరద కాల్వ ప్రాంత రైతులు కూడా కాళేశ్వరం లేకుంటే ఇప్పట్లో నీళ్లే రాకపోవు అనుకోవాలనేది ప్రభుత్వ ప్రయత్నంగా కనిపిస్తోంది. ఎంతసేపు కాళేశ్వరం ప్రాజెక్టు అంశం ప్రజలు, రైతుల్లో నానాలనే ప్రయత్నమే తప్ప పైసా ఖర్చు లేకుండా వచ్చే ఎస్సారెస్పీ నీటిని సద్వినియోగం చేసుకోవాలనే ఆలోచన ప్రభుత్వ పెద్దలకు ఎంతమాత్రమూ లేదు. లింక్ – 2లో నందిమేడారం, లక్ష్మీపూర్ పంపుహౌస్ లు, పునరుజ్జీవ పథకంలోని రాంపూర్, రాజేశ్వర్రావు పేట పంపుహౌసుల్లో మోటార్లు నడిపించి, లక్షలాది రూపాయల ప్రజాధనం వెచ్చించి నీటిని ఎత్తిపోస్తున్నారు.

For More News..

రాష్ట్రంలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు

‘పూజిస్తం.. అవసరమైతే శిక్షిస్తం’

Latest Updates