పాలస్తీనాగా మార్చొద్దు..కాశ్మీర్ పై కాంగ్రెస్ కామెంట్స్

న్యూఢిల్లీజమ్మూకాశ్మీర్​ స్పెషల్​ స్టేటస్​ రద్దు, రాష్ట్ర విభజనపై కాంగ్రెస్​ సీనియర్​ నేతల కామెంట్లు వివాదాస్పదమయ్యాయి. కాశ్మీర్​ హిందూ మెజార్టీ రాష్ట్రమై ఉంటే బీజేపీ ఆర్టికల్​ 370ని రద్దు చేసి ఉండేదా?, ఇండియన్​ మీడియా వార్తల్ని కవర్​ చేయనంత మాత్రాన కాశ్మీర్​ ప్రశాంతంగా ఉన్నట్లా? అని మాజీ మంత్రి పి.చిదంబరం ప్రశ్నించారు. ఆయన కామెంట్స్​పై దుమారం నడుస్తుండగానే కాంగ్రెస్​కే చెందిన మరో సీనియర్​ నేత మణిశంకర్​ అయ్యర్​.. ‘మోడీ, షా కలిసి ఇండియాలో పాలస్తీనాను క్రియేట్​ చేశారు’ అంటూ ఏకంగా ఓ వ్యాసాన్నే రాశారు. ఓటు బ్యాంకు రాజకీయాలకు కాంగ్రెస్​ కేరాఫ్​ అనడానికి ఈ ఇద్దరు నేతల కామెంట్లు మరో రుజువులని, దేశ సమస్యకు మతం రంగు పులమడం దురదృష్టకరమని కేంద్ర మంత్రులు, బీజేపీ నేతలు మండిపడ్డారు.

మోడీ మెంటర్​ నెతన్యాహు

మోడీ, అమిత్​ షాకు ఇజ్రాయెల్​ పీఎం బెంజిమెన్​ నెతన్యాహు గురువు లాంటివారని అయ్యర్​ ఆక్షేపించారు. ‘‘జియోనిజం(యూదుల ప్రత్యేక దేశ ఉద్యమం) కారణంగా పాలస్తీనియన్లపై ఏడు దశాబ్దాలుగా అణచివేత కొనసాగుతూనే ఉంది. పౌరుల స్వేచ్ఛ కోరుకునే ప్రజల ఆకాంక్ష, ఆత్మగౌరవాల్ని ఎలా తొక్కేయాలో ఇజ్రాయెల్​ను చూసి మన నాయకులు నేర్చుకున్నారు. కాశ్మీర్​కు స్పెషల్​ స్టేటస్​ ఎత్తేయడం ద్వారా పాలకులు ఇండియా ఉత్తర సరిహద్దులో మరో పాలస్తీనాను సృష్టించారు’’అని అయ్యర్​ తన వ్యాసంలో రాశారు. మాజీ మంత్రి చిదంబరం ఆదివారం ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ, కాశ్మీర్​ గనుక హిందూ డామినెంట్​ స్టేట్​ అయ్యేదుంటే బీజేపీ ఇలా చేసేదికాదని, కండబలంతో కాశ్మీర్​ స్పెషల్​ స్టేటస్​ని లాక్కున్నారని ఆరోపించారు.  రాజ్యసభలో ప్రతిపక్షాలు బలంగా ఉన్నప్పటికీ, ఆయా రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న ప్రాంతీయ పార్టీలు బీజేపీకి సపోర్ట్​ చేయడంతో బిల్లులు పాసయ్యాయని చిదంబరం అన్నారు.

కాంగ్రెస్​ ఇంకెంత దిగజారుతుందో..

జమ్మూకాశ్మీర్​లోని ప్రతి ఒక్కరికీ మంచి జరగాలన్న ఉద్దేశంతోనే కేంద్రం నిర్ణయాలు తీసుకుందని, కాంగ్రెస్​ మాత్రం ఎప్పటిలాగే ఓ వర్గాన్ని బుజ్జగించే పనిలో పడిందని, ఆ పార్టీ నేతల కామెంట్లే ఇందుకు నిదర్శనమని కేంద్ర మంత్రి గిరిరాజ్​ సింగ్​ అన్నారు. ఇండియాను ‘హిందూ–ముస్లిం’ కోణంలో తప్ప మరోలా చూడటం కాంగ్రెస్​కు చేతకాదని, అందుకే చిదంబరంపై జాలిపడుతున్నానని బీజేపీ ఉపాధ్యక్షుడు, మధ్యప్రదేశ్​ మాజీ సీఎం శివరాజ్​ సింగ్​ చౌహాన్ అన్నారు. కాంగ్రెస్​ ఇంకెంత దిగజారుతుందోనని ఆందోళన చెందుతున్నట్లు చౌహాన్​ సెటైర్​ వేశారు. ‘‘కాంగ్రెస్​ లీడర్లది డర్టీ మైండ్​. ఇలాంటి కామెంట్లతో వాళ్లకు పాకిస్తాన్​తో కనెక్షన్​ ఉందనడానికి నిరూపించుకుంటున్నారు. కాశ్మీర్​ లాంటి సున్నితమైన సమస్యకు మతం రంగు పులిమినందుకు సిగ్గుపడాలి’’అని కేంద్ర మంత్రి ముక్తార్​ అబ్బాస్​ నక్వీ మండిపడ్డారు. కాంగ్రెస్​ లీడర్లవి బాధ్యతారహిత కామెంట్లని, రెచ్చగొట్టేలా మాట్లాడటం మానుకోవాలని మరో మంత్రి రవిశంకర్​ ప్రసాద్​ సూచించారు.

Latest Updates