దేశ భద్రత పేరుతో పాస్ పోర్టును నిరాకరించారు

దేశ భద్రత పేరుతో పాస్ పోర్టును నిరాకరించారు

జమ్మూకశ్మీర్ మాజీ సీఎంమెహబూబా ముఫ్తీ ఏడాదికి పైగా గృహ నిర్బంధంలో ఉన్నారు. మనీ లాండరింగ్ కేసు విచారణను కూడా ఎదుర్కొంటున్నారు. ప్రస్తుత పరిణామాల క్రమంలో  ఆమెకు పాస్ పోర్టును పాస్ పోర్టు కార్యాలయం నిరాకరించింది. ఈ విషయాన్ని 61 ఏళ్ల ముఫ్తీ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.

తనకు పాస్ పోర్టు ఇచ్చేందుకు పాస్ పోర్టు కార్యాలయం నిరాకరించిందని తెలిపారు ముఫ్తీ. దేశ భద్రతకు ముప్పు వాటిల్లే  అవకాశం ఉందంటూ సీఐడీ ఇచ్చిన రిపోర్టు కారణంగా పాస్ పోర్టు ఇవ్వడానికి అధికారులు నిరాకరించారన్నారు. 2019 ఆగస్టు తర్వాత కశ్మీర్ లో నెలకొన్న సాధారణ పరిస్థితులు ఇలా ఉన్నాయన్నారు. ఒక రాష్ట్రానికి సీఎంగా  సేవలందించిన వ్యక్తికి పాస్ పోర్టు ఉంటే దేశ సార్వభౌమత్వానికి ముప్పు వాటిల్లుతుందా అంటూ ముఫ్తీ ప్రశ్నించారు.

గత డిసెంబరులో పాస్ పోర్టు కోసం ఆమె దరఖాస్తు చేశారు. అయితే, పోలీసు విచారణలో కూడా ఆమెకు నెగెటివ్ రిపోర్టు వచ్చింది. 2019లో జమ్మూకశ్మీర్ ను రెండు యూటీలుగా మార్చిన తర్వాత... శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా వందలాది మంది అక్కడి నేతలను భద్రతాబలగాలు నిర్బంధించాయి. గత అక్టోబర్ లో ఆమె విడుదలయ్యారు. అయితే, ప్రస్తుతం ఆమె మనీ లాండరింగ్ కేసులో ఈడీ విచారణను ఎదుర్కొంటున్నారు.