నాకు తోడుగా 30 మంది కార్పొరేటర్లను ఇవ్వండి…మీకోసం కొట్లాడతా

శ్రీకాకులం, విజయనగరం నుంచి హైదరాబాద్ కు వచ్చి సెటిల్ అయిన వారి పేర్లను రాష్ట్ర ప్రభుత్వం బీసీల నుంచి తొలగించిందన్నారు  కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి. GHMC ఎన్నికల ప్రచారంలో భాగంగా మూసాపేట్ లో పర్యటించిన ఆయన.. శ్రీకాకులం, విజయనగరం నుంచి వచ్చిన ప్రజలంతా…అద్దె ఇంట్లో కిరాయిలు కట్టలేక అవస్థలు పడుతున్నారని తెలిపారు. ఇక్కడ 2017లో మంత్రి హరీష్ రావు డబుల్ బెడ్రూం కు శిలాఫలకం వేశారని.. అయితే ఇప్పటి వరకు ఒక్క ఇటుక కూడా కట్టలేదన్నారు. కరోనా సమయంలో కష్టాల్లో ఉన్న ప్రజలకు పైసా ఇవ్వలేదన్నారు. పైగా కరెంటు బిల్లులు రెట్టింపులో వసూలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్లు వరద మన బతుకుల్ని నిండా ముంచిందన్నారు. బురదలో మునిగిన కుటుంబాలకు 50వేల రూపాయల ఆర్థిక సాయం అందించాలని సర్కారుపై పోరాటం చేశానన్నారు.

మూసాపేటలో నాళా మీద కప్పు వేయాలని ఎంతమంది కొట్లాడినా కప్పు మాత్రం రాలేదన్నారు రేవంత్ రెడ్డి. పేదోళ్లకు డబులు బెడ్రూమ్ ఇళ్లు ఇవ్వలేదు కానీ… పదెకరాల్లో వెయ్యి కోట్లతో 150 గదులతో కేసీఆర్ ఇల్లు కట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోడి కొయ్యాలె. సార పొయ్యాలె. దావత్ ఇయ్యాలె  అంటూ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల గురించి మాటలు మాత్రం చెప్పారన్నారు. బీజేపీ వాళ్లు ఇవాళ మత కల్లోలాలు తెచ్చేందుకు కుట్రలు చేస్తున్నారన్న రేవంత్ ..మనకు మత కలహాలు అవసరమా? అని అడిగారు. మీరు ప్రశ్నించే గొంతుక అని నన్ను గెలిపించి పార్లమెంటుకు పంపితే పార్లమెంటులో కొట్లాడుతున్నానన్న రేవంత్ రెడ్డి…నాకు తోడుగా పాతిక,30 మంది కార్పొరేటర్లను ఇవ్వండి… మీకోసం కొట్లాడతానని తెలిపారు.

ఫతేనగర్ లోనూ ఎన్నికల ప్రచారం నిర్వహించిన రేవంత్ రెడ్డి…ఏడేళ్లుగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇస్తామని ఊరిస్తున్నారన్నారు. ఇప్పుడు టీఆర్ఎస్ సన్నాసులు మళ్లీ వచ్చి ఓట్లు అడిగితే.. ఎలా అడుగుతారని ప్రజలు నిలదీయాలన్నారు. వరద సాయం 10వేలకు… 5వేలు ఇచ్చి మిగిలినవి తిన్న TRS వాళ్లను వంద మీటర్ల లోతు గుంత తీసి పాతిపెట్టాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Latest Updates