కరోనా మరణాలపై సర్కారు లెక్కలు  నమ్మబుద్ధి కావట్లే-హైకోర్టు

ఎక్కువ మంది చనిపోతున్నా బులెటిన్లో చూపించేది తొమ్మిది పదేనా?: హైకోర్టు

కరోనా లెక్కలు నిజం కాకపోతే  కమిటీ వేయాల్సి వస్తుంది

 ప్రైవేట్లో సగం బెడ్లపై హెల్త్ మినిస్టర్ ప్రకటన ఏమైందని ప్రశ్న

 ప్రైవేట్ దోపిడిపై 22 కల్లా నివేదిక ఇవ్వాలని ఆదేశం

 కేసు విచారణకు మూడంటే 3 నిమిషాల ముందు కోర్టుకు రిపోర్ట్ ఇస్తారా? ఇందులో ఆంతర్యం ఏంటి? ఇచ్చిన రిపోర్టులో ఏమైనా ఉందా అంటే అదీ లేదు. తప్పులు చేశాయని ఆరోపణలు ఉన్న ప్రైవేట్‌ ఆస్పత్రుల పేర్లు లేవు. తప్పుల్ని సరి చెయ్యలేదు. ప్రభుత్వ రిపోర్టుపైనే నమ్మకం, విశ్వాసం పోయే పరిస్థితి ఏర్పడింది. సీఎస్ సమక్షంలో మేం ఇచ్చిన ఆర్డర్ ను అమలు చేసే తీరు ఇదేనా? – హైకోర్టు

 హైదరాబాద్, వెలుగు: కరోనా మరణాలపై సర్కార్ వెల్ల డించే వివరాలు నమ్మబుద్ధి కావట్లేదని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. చనిపోతున్నోళ్లు ఎక్కువ మంది ఉంటున్నా సర్కారు ప్రకటించే లెక్కలు మాత్రం అనుమానాలు కలిగించేలా ఉన్నాయని అసహనం వ్యక్తం చేసింది. కరోనా కేసులు పెరుగుతున్నా మరణాలు తొమ్మిదో పదో ఉండడం అనుమానాలకు తావిస్తోందని చెప్పింది. లెక్కలు వాస్తవానికి దగ్గ రగా లేకపోతే కమిటీ వేయాల్సి వస్తుందని, ఆ  స్పెషల్ కమిటీతో అసలైన లెక్కలను తెప్పిస్తామని  హెచ్చరించింది. ప్రైవేట్ ఆస్పత్రుల అధిక రేట్లపై నేషనల్ ఫార్మాస్యూటికల్  ప్రైసింగ్ అథారిటీ విచారణ చేయాలని, హైకోర్టు, ప్రభుత్వానికి రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశించింది. రిపోర్టు ప్రకారం తప్పు చేసిన ఆస్ప త్రులపై ఎలాంటి చర్యలు తీసుకున్నది ప్రభుత్వం తమకు 22లోగా తెలియజేయాలని ఆదేశించింది. కరోనా టెస్టులు చేయడం లేదని, సరైన వైద్యం అంద ట్లేదని, డాకర్టకు సరైన ప్రొటెక్షన్లు ఇవ్వడం లేదంటూ దాఖలైన 19 పిల్స్ ను శుక్రవారం చీఫ్ జస్టిస్ ఆర్ ఎస్ చౌహాన్,  జస్టిస్ బి. విజయ్ సేన్ రెడ్డిలతో కూడిన డివిజన్ బెంచ్ విచారించింది. రాష్ట్రంలో డాక్టర్లకు కరోనా ముప్పు ఎక్కువగా ఉందన్న కేంద్రం హెచ్చరికను సర్కారుకు గుర్తు చేసింది.

హెల్త్ మినిస్టర్.. మీ మాట ఏమైంది?

కరోనా టెస్టులు భారీగా చేసేస్తామని సాక్షాత్తు హెల్త్ మినిస్ట ర్ చేసిన ప్రకటనకే దిక్కు లేదని హైకోర్టు ఘాటుగా స్పందించింది. ప్రైవేట్ ఆస్పత్రుల్లో సగం బెడ్లను స్వాధీనం చేసుకుంటామన్న మంత్రి ప్రకటన ఎటు పోయిందని నిలదీసింది. రాయితీలతో రాష్ట్ర  సర్కార్ నుంచి భూములు పొందిన ఆస్పత్రులు.. అప్పుడు చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం పేదలకు ట్రీట్మెంట్ చేసేలా ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని ప్రశ్నించింది. అసలు ఎన్ని ప్రైవేట్ ఆస్పత్రులు రాయితీలపై భూములు, ఇతర సౌకర్యా లను పొందాయో చెప్పాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. పేషెంట్ల నుంచి ప్రైవేట్ ఆస్పత్రులు భారీగా ఫీజులు వసూలు చేస్తుండడంపై ప్రభుత్వం ఇచ్చిన వివరణ ఏమాత్రం సంతృప్తి కరంగా లేదని మండిపడింది. మూడంటే మూడు ఆస్పత్రులకు కరోనా ట్రీట్ మెంట్స్ గుర్తింపు రద్దు చేస్తామని చెప్పిన సర్కార్.. ఆస్పత్రుల పేర్లను ఎందుకు చెప్పలేదని ప్రశ్నించింది. తప్పు చేసిన ఆస్పత్రుల ప్రతిష్టను కాపాడే ప్రయత్నం ప్రభుత్వం చేస్తోందా అని ప్రశ్నించింది. 38 ఆస్ప త్రులకు నోటీసులు ఇచ్చామంటున్న సర్కార్.. వాటి పేర్లెందుకు చెప్పట్లేదని నిలదీసింది.

అధికారులేమైనా ప్రభువులా?

హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను 90 శాతం వరకు అమలు చేశామంటూ ఏజీ చెబుతున్నారని, చీఫ్ సెక్రటరీ ఎందుకు హాజరు కాలేదని హైకోర్టు ప్రశ్నించింది. ‘‘అధికారులేమైనా ప్రభువులు అనుకుంటున్నారా?  సీఎస్ కూడా కేసులో ప్రతివాది అన్నది మర్చిపోవద్దు.  ఆఫీసర్లు కయింట్లన్న విషయాన్ని ఏజీ గుర్తుంచుకోవాలి. మేం ఏ వివరాలు కోరుతున్నామో.. మీరు ఏం ఇస్తున్నారో చూస్తున్నారా? కోర్టుకు మీరు చెప్పేది ఇదేనా? హైకోర్టు ఏంచెప్పిందో ఏజీకి తెలియదనుకోవాలా’’ అని ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘కేసులు  పెరుగుతుంటే గత ఆదివారం సర్కారు టెస్టులను సగానికి తగ్గించింది. టెస్ట్లు తగ్గించారంటే కరోనా కేసులు తక్కువగా ఉన్నాయని జనాన్ని మభ్య పెట్టే ప్రయత్నం చేయడమే కదా. ఆదివారం టెస్టులు చేయించుకునేందుకు జనం రావట్లేదన్న ప్రభుత్వ వాదన వాస్తవానికి  ఏ మాత్రం దగ్గరగా లేదు’’ అని మండిపడింది.

ఊళ్లలో సౌకర్యాలు పెంచండి

ఊళ్లలో కేసులు పెరుగుతున్నందున తక్షణమే ప్రభుత్వం మేల్కొని మౌలిక వసతుల కల్పన చేయాలని,  మెడికల్,  పారా మెడికల్ స్టాఫ్ ను పెంచాలని, కరోనా ట్రీట్‌మెంట్‌ చేసే ఆస్పత్రుల సంఖ్య పెంచాలని హైకోర్టు ఆదేశించింది. గ్రామాల నుంచి హైదరా బాద్ కు ఎంత మంది రోగుల్ని తరలిస్తున్నారో కూడా చెప్పాలంది. సర్కార్,  ప్రైవేట్ ల్యాబ్ లలో డైలీ ఎంత మందికి టెస్టులు చేస్తున్నారో, పాజిటివ్ ఎంత మందికి వచ్చిందో విడివిడిగా రిపోర్టులు ఇవ్వాలని ఆదేశించింది. ఢిల్లీ సర్కార్‌ మాదిరిగా ప్రైవేటులో సగం బెడ్లను సర్కార్ స్వాధీనం చేసుకోవాలని ఆదేశించింది. అనాథలు, నిరాశ్రయులకు పరీక్షలు చేసేందుకు మొబైల్ టెస్టింగ్ ల్యాబ్స్ ను ఏర్పాటు చేయాలని  చెప్పింది.

చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు?

కౌంటర్ పిటిషన్లో అసలు సరైన వివరాలేవీ లేవని హైకోర్టు మండిపడింది. నోటీసులిచ్చిన ఆస్పత్రులు వివరణ ఇచ్చాయా అని ప్రశ్నించింది. అలాంటివేవీ లేకుండా కౌంటర్ వేస్తే ఉపయోగం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆస్పత్రులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో కూడా చెప్పకుండా ప్రభుత్వం కోర్టుకు రావడమేంటని మండిపడింది. ఆస్పత్రులపై చర్యలు తీసుకోకుండా సర్కార్ ఎందుకు వెనుకాడుతోందని ప్రశ్నించింది. కరోనా రోగులను దోచుకున్న ప్రైవేటు ఆస్పత్రులు చట్టానికేమీ అతీతంకాదని పేర్కొంది. ‘‘కేసు విచారణకు మూడంటే మూడు నిమిషాల ముందు కోర్టుకు రిపోర్ట్ ఇస్తారా? సుమారు 3 వారాల క్రితం విచారణ చేసిన కేసులో కౌంటర్కాపీని మళ్లీకేసు విచారణ చేసే ఈ రోజునే ఇవ్వడంలో ఆంతర్యం ఏమిటి? పోనీ ఇచ్చిన రిపోర్టులో ఏమైనా ఉందా అంటే అదీ లేదు. అంతా అరకొర సమాచారమే. తప్పులు చేశాయని ఆరోపణలు ఉన్న ప్రైవేట్‌ ఆస్ప త్రుల పేర్లు లేవు. ఆదివారం టెస్ట్‌లు సగానికి ఎందుకు తగ్గాయో కూడా వివరణ ఇవ్వలేదు. గత విచారణలో తప్పుల్ని సరిచేసి డిటైల్డ్ రిపోర్టు ఇస్తామని ఇచ్చిన హామీని అమలు చేయడమంటే ఇదేనా? రిపోర్టుమాకు ఇచ్చేముందు ఏజీ ఆఫీసు దానిని లోతుగా పరిశీలించి గత హామీకి అనుగుణంగా ఉందో లేదో కూడా పరిశీలన చేయాల్సిన బాధ్యత లేదా? చివరికి ప్రభుత్వ రిపోర్టుపైనే నమ్మకం, విశ్వాసం పోయే పరిస్థి తి ఏర్పడింది.’’ అని సర్కారుపై హైకోర్టు మండిపడింది.

 

 

Latest Updates