స్పెషల్‌ డెవలప్‌మెంట్‌ ఫండ్‌ కింద రూ.53 కోట్లు రిలీజ్​

  • ఒక్క షాద్‌నగర్‌ నియోజకవర్గానికే రూ. 30.74 కోట్లు

హైదరాబాద్‌, వెలుగు: నియోజకవర్గాలకు స్పెషల్‌ డెవలప్‌మెంట్‌ ఫండ్‌ (ఎస్​డీఎఫ్​) నుంచి నిధులు విడుదల చేస్తూ ప్లానింగ్‌ డిపార్ట్‌మెంట్‌ శనివారం 18 వేర్వేరు జీవోలు జారీ చేసింది. 2019–-20 ఆర్థిక సంవత్సరానికి గాను 17 నియోజకవర్గాలకు రూ. 53.07 కోట్లు విడుదల చేసింది. అందులో అత్యధికంగా షాద్‌నగర్‌ నియోజకవర్గానికి రూ. 30.74 కోట్లు దక్కగా.. పాలకుర్తి నియోజకవర్గానికి అతి తక్కువగా రూ. 2.74 లక్షలు దక్కాయి. షాద్‌నగర్‌లో 303 పనులకు రూ. 4.28 కోట్లు, 31 పనులకు రూ. 17.89 కోట్లు, 17 పనులకు రూ. 8.56 కోట్లు విడుదల చేస్తూ మూడు వేర్వేరు జీవోలు జారీ అయ్యాయి. ఆదిలాబాద్‌ నియోజకవర్గానికి రూ. 2.96 కోట్లు కేటాయిస్తూ  రెండు జీవోలు, బాన్సువాడకు రూ. 64.96 లక్షల కేటాయిస్తూ రెండు జీవోలు విడుదలయ్యాయి.

వర్ధన్నపేటకు రూ.56.53 లక్షలు, నల్గొండకు రూ.1.15 కోట్లు, సంగారెడ్డి, ఆందోల్‌, నారాయణఖేడ్‌, జహీరాబాద్‌ నియోజకవర్గాలకు కలిపి రూ. 1.41 కోట్లు, సిద్దిపేట మున్సిపాలిటీకి రూ.4.03 కోట్లు, హుజూరాబాద్‌కు రూ.1.01 కోట్లు, భూపాలపల్లికి రూ.38.22 లక్షలు, మధిరకు రూ.50.74 లక్షలు, బాల్కొండకు రూ.1.58 కోట్లు, నిజామాబాద్‌ రూరల్‌కు రూ. 53 లక్షలు విడుదలయ్యాయి. జుక్కల్‌ నియోజకవర్గంలోని పిట్లం మండలం కుర్తి రోడ్డుపై హైలెవల్‌ బ్రిడ్జి కమ్‌ చెక్‌ డ్యాం నిర్మాణానికి రూ.7.50 కోట్లు కేటాయించారు. అసెంబ్లీ కాన్‌స్టియెన్సీ డెవలప్‌మెంట్‌ ఫండ్‌ (ఏసీడీఎఫ్‌) నిధులు ఇవ్వకపోవడంతో ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో చిన్న చిన్న పనులు కూడా చేయలేకపోతున్నారు. ఇదే విషయాన్ని పలుమార్లు మంత్రులు, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. కనీసం రూ.లక్ష పని కూడా చేయలేకపోతున్నామని, వచ్చే బడ్జెట్‌లోనైనా ఏసీడీఎఫ్‌ నిధులు కేటాయించాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం స్పెషల్​ డెవలప్​మెంట్​ ఫండ్​ (ఎస్​డీఎఫ్‌ ) నుంచి నిధులు విడుదల చేసింది.

Latest Updates