సంవత్సరంలోపు సర్కారు ఆస్పత్రుల్లో సకల సౌలత్లు

సంవత్సరంలోపు సర్కారు ఆస్పత్రుల్లో సకల సౌలత్లు
  • భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో రూ. 87కోట్లతో న్యూ బిల్డింగ్స్, డెవలప్​మెంట్​ వర్క్స్​
  • ఇప్పటికే ఇల్లెందు, అశ్వారావుపేటలో పనులు ప్రారంభం..
  • త్వరలో ఏజెన్సీ ప్రాంతవాసులకు మెరుగైన వైద్య సేవలు

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : జిల్లాలోని తెలంగాణ వైద్య విధాన పరిషత్​ హాస్పిటళ్లకు ఇక మంచిరోజులు రానున్నాయి. సంవత్సరంలోపు సకల సౌలత్​లు అందుబాటులోకి వస్తాయని అధికారులు చెబుతున్నారు.  జిల్లాలోని ఇల్లెందు, అశ్వారావుపేట, చర్ల, బూర్గంపహాడ్​  గవర్నమెంట్​ హాస్పిటళ్లకు రూ. 87కోట్లతో కొత్త బిల్డింగ్స్​ను నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఇల్లెందు, అశ్వారావుపేటలో పనులు  ప్రారంభమయ్యాయి.

ఎక్కడెక్కడ ఎలా..? 

ఇల్లెందులోని గవర్నమెంట్ హాస్పిటల్​ను డెవలప్​ చేయడంలో భాగంగా 30 పడకల హాస్పిటల్​ను వంద పడకల హాస్పిటల్​గా ప్రభుత్వం అప్​ గ్రేడ్​ చేసింది. ఐదు దశాబ్దాల కిందడి ఈ ఆస్పత్రికి రిపేర్లు చేస్తూ వచ్చారు. వంద పడకల ​హాస్పిటల్​గా మారడంతో కొత్త బిల్డింగ్​ కోసం పట్టణంలోని జేకే కాలనీలో  ల్యాండ్​ను చూశారు. కొత్త బిల్డింగ్​ నిర్మాణాలకు ప్రభుత్వం రూ. 37.5కోట్లను మంజూరు చేసింది. బిల్డింగ్​ పనులు మొదలయ్యాయి. 

ఇక 30 పడకల​ అశ్వారావుపేట హాస్పిటల్​ను  ప్రభుత్వం వంద పడకల హాస్పిటల్​గా మార్చింది. ఈ హాస్పిటల్​ ఆవరణలో రూ. 37.5కోట్లతో  కొత్త బిల్డింగ్​కు అధికారులు శ్రీకారం చుట్టారు. ఇక్కడ ఇటీవలే పనులు మొదలయ్యాయి. 
    
చత్తీస్​గఢ్​సరిహద్దు ప్రాంతంతో పాటు మారుమూల ఏజెన్సీలోని చర్ల పీహెచ్​సీ ఇటీవల 30 పడకల​ హాస్పిటల్​గా అప్​ గ్రేడ్​ అయింది. ఆస్పత్రి బిల్డింగ్​ కోసం  ప్రభుత్వం రూ. 10కోట్లు మంజూరు చేసింది. టెండర్​ ప్రక్రియ ఫైనల్​ దశలో ఉంది. టెండర్​ ఫైనల్​ రాగానే పనులు ప్రారంభం కానున్నాయి. 
    
శిథిలావస్థలో ఉన్న బూర్గంపహాడ్​ హాస్పిటల్​కు డీఎంఎఫ్​టీ కింద అధికారులు రూ. 2కోట్లు కేటాయించారు. కానీ ఈ హాస్పిటల్​కు మరో రూ. 8 కోట్లకు పైగా నిధులు అవసరం ఉందని డాక్టర్లు పేర్కొంటున్నారు. తెలంగాణ మెడికల్​ ఇన్​ఫ్రాస్ట్రక్చర్​ డెవలప్​ కార్పొరేషన్​ బిల్డింగ్​ పనులను పర్యవేక్షించనుంది. ఈ పనులన్నీ సంవత్సరంలోపు పూర్తయి ప్రజలకు అందుబాటులోకి రానున్నట్లు అధికారులు చెబుతున్నారు. 

ఏజెన్సీ ప్రాంత వాసులకు మెరుగైన వైద్యం.. 

ఇల్లెందు, అశ్వారావుపేట ప్రాంతాల్లో వంద పడకల హాస్పిటళ్లతో పాటు చర్లలోని 30 పడకల హాస్పిటళ్ల బిల్డింగ్స్​ పూర్తి అయితే ఏజెన్సీ వాసులకు నాణ్యమైన వైద్య సేవలందనున్నాయి. ఏజెన్సీ మండలాలైన ఆళ్లపల్లి, గుండాల, చర్ల మండలాలతో పాటు దమ్మపేట, అశ్వారావుపేట మండలాల్లోని ఏజెన్సీ గ్రామాలకు చెందిన గిరిజనులకు మేలు కలుగనుంది.

ఎమ్మెల్యేలు,  కలెక్టర్​చొరవతోనే.. 

జిల్లాలోని స్థానిక ఎమ్మెల్యేలతో పాటు కలెక్టర్​ జితేశ్​ వీ పాటిల్​ ప్రత్యేక చొరవతోనే హాస్పిటల్స్​ అప్​ గ్రేడ్​ కావడంతో పాటు నిధులు మంజూరు అయ్యాయి. ఇల్లెందు, అశ్వారావుపేట పట్టణాల్లో న్యూ బిల్డింగ్​ పనులు కూడా ప్రారంభమయ్యాయి. ఈ బిల్డింగ్స్​ పూర్తి అయితే ఇల్లెందు, చర్ల, అశ్వారావుపేట ఏజెన్సీ ప్రాంతాల్లోని మారు మూల ప్రాంతాల్లోని ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుతాయి. -  డాక్టర్​ రవిబాబు, డీసీహెచ్​ఎస్​, భద్రాద్రికొత్తగూడెం