సర్కారు భూమి సర్కారుకే రిజిస్ట్రేషన్​

షాద్ నగర్ ,వెలుగురియల్​ ఎస్టేట్​ వ్యాపారుల అక్రమాలకు హద్దూ అదుపులేకుండా పోతుంది. ఇప్పటి వరకు ప్రైవేటు స్థలాలను కబ్జాచేసి వెంచర్లు చేసి విక్రయించిన భూ అక్రమార్కులు ఫరూఖ్​నగర్​ మండలం ఏలికట్ట గ్రామ శివారులో ఏకంగా ప్రభుత్వ భూమినే ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్​ చేసిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఏలికట్ట గ్రామ శివారులోని సర్వేనెంబర్​ 192లో రియల్​ ఎస్టేట్​ వ్యాపారులు వెంచర్​ చేశారు.  అయితే ఆ వెంచర్​కు రోడ్డు మార్గం లేకపోవడంతో సర్వేనెంబర్​ 209 లో 34 ఎకరాల  ప్రభుత్వ భూమిలో కొంత భాగాన్ని ఆక్రమించి తమ వెంచర్​లోకి రోడ్డును ఏర్పాటుచేసుకున్నారు. రోడ్డు మార్గం కోసం తీసుకున్న ప్రభుత్వ భూమిని ప్రభుత్వం పేరిటే రిజిస్ట్రేషన్​ చేయడం గమనార్హం.  భూ అక్రమార్కుల వెంచర్​పై అనుమానాలు కలిగిన కొందరు ఏలికట్ట  గ్రామస్తులు  ఆగస్టులో కలెక్టర్​ లోకేశ్​కుమార్​ నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో  అక్రమార్కుల వ్యవహారంపై  రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు.

ఎమ్మార్వో సర్వేతో తేలిన వాస్తవాలు

ఏలికట్ట గ్రామస్తుల ఫిర్యాదును కలెక్టర్​ లోకేశ్​కుమార్​ సీరియస్​గా తీసుకున్నారు. ఈ అంశంపై క్షేత్రస్థాయిలో సర్వేచేసి నివేదిక​అందజేయాలని ఎమ్మార్వో రాజేశ్వర్​రెడ్డిని ఆదేశించారు. దాంతో ఎమ్మార్వో రెవెన్యూ సిబ్బందితో సర్వేచేసి ప్రభుత్వ భూమి ఆక్రమణ వాస్తవమేనని నిగ్గుతేల్చారు. రోడ్డుగా అభివృద్ధి చేసిన భూమిని వెంచర్​ నిర్వాహకులు ప్రభుత్వానికే రిజిస్టర్​ చేసిన సంగతిని గుర్తించి ఎమ్మార్వో నివ్వెరపోయారు. కబ్జాకు గురైన ప్రభుత్వ భూమిలో ఎమ్మార్వో హద్దురాళ్ళను ఏర్పాటుచేయించారు. అయితే ఎమ్మార్వో ఏర్పాటుచేయించిన హద్దురాళ్ళను  భూ అక్రమార్కులు  చెరిపేశారు. ఆ భూమి తమదేనంటూ గ్రామస్తులపై తమ ప్రతాపాన్ని చూపే ప్రయత్నాలు
చేశారు.

పోలీసులకు ఎమ్మార్వో ఫిర్యాదు

రెవెన్యూ సిబ్బంది సర్వేనెంబర్​209లో   ఏర్పాటుచేసిన హద్దురాళ్ళను వెంచర్​ నిర్వహకులు తొలగించడంపై ఎమ్మార్వో రాజేశ్వర్​రెడ్డి షాద్​నగర్​ టౌన్​ పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదుచేశారు.  ప్రభుత్వ భూమిని ప్రభుత్వానికే రిజిస్టర్​ చేసిన సబ్​ రిజిస్ట్రార్​పై కూడా చర్య తీసుకోవాలని ఎమ్మార్వో ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలుస్తున్నది.

Latest Updates