మతమార్పిడులపై ప్రభుత్వం స్పందించాలి : పవన్

మతమార్పిడులపై వైసీపీ ప్రభుత్వం స్పందించాలన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ… హిందూ ధర్మానికి అన్యాయం జరిగితే తాను మాట్లాడతానన్నారు. సామూహిక మత మార్పిడులు జరుగుతుంటే సీఎం జగన్ కు కనిపించడం లేదన్నారు. తిరుమలలో అన్యమత ప్రచారం ఎక్కువగా జరుగుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారు. మత మార్పిడిలకు సంబంధించిన వీడియోను మీడియాకు విడుదల చేస్తానని తెలిపారు. ఈ విషయాన్ని అందరికీ చెప్పాలని కోరారు.

హిందూ ధర్మానికి ఏ మాత్రం నష్టం కలిగేలా ప్రవర్తించినా తాను మాట్లాడతానన్నారు పవన్ కల్యాణ్. కడప దర్గాకు పోయి ఏ హిందువూ జై భవానీ అనడని…మెదక్ చర్చి దగ్గరకు వెళ్లి జై శ్రీరామ్ అనరని తెలిపారు. హిందూ దేవాలయాల దగ్గరికి వెళ్లి జై జీసస్ అనకూడదు. అది ధర్మ విరుద్ధం. దీన్ని కచ్చితంగా ఖండిస్తున్నామన్న పవన్.. అన్యమత ప్రచారం వద్దన్నారు.

ధర్మాన్ని కాపాడే హిందూ సంస్థల గురించి తాను మాట్లాడటం లేదన్న పవన్..మత మార్పిడులపై వైసీపీ ప్రభుత్వం కచ్చితంగా స్పందించాలన్నారు. లేదంటే ప్రజలు దీన్ని వ్యతిరేకిస్తారన్నారు. అత్యధిక మెజారిటీ ఉన్న ప్రభుత్వం వైసీపీదని, పాలన సరిగ్గా ఉండాలన్నారు.

Latest Updates