ఇరిగేషన్‌‌ ఆస్తుల లెక్క తీస్తున్న సర్కారు

ఉన్నదెంత.. కబ్జా అయిందెంత?

నిర్దేశిత ఫార్మాట్‌‌లో వివరాల సేకరణకు నిర్ణయం

బిల్డింగులు, కార్లు, కంప్యూటర్లు సహా మొత్తం లెక్కలోకి..

అధికారులతో సమీక్షలో రజత్​కుమార్‌ ఆదేశాలు

హైదరాబాద్‌‌, వెలుగు: సర్కారు ఇరిగేషన్‌‌  డిపార్ట్‌‌మెంట్‌‌  సేకరించిన భూముల్లో ఉన్నవెన్ని, కబ్జాల పాలైనవెన్ని అన్న వివరాలు సేకరించే పనిలో పడింది. నిర్దేశిత ఫార్మాట్‌‌లో భూముల వివరాలన్నీ ఇవ్వాలంటూ ఇరిగేషన్‌‌  ప్రిన్సిపల్‌‌  సెక్రటరీ రజత్‌‌ కుమార్‌‌ ఇంజనీర్లను ఆదేశించారు. దీనికి సంబంధించి మంగళవారం ఉదయం జల సౌధలో ఇరిగేషన్‌‌ ఆస్తులు, వాహనాలు, పరికరాలు తదితర వివరాలపై ఇన్వెంటరీ మీటింగ్‌‌ నిర్వహించారు. జల సౌధ నుంచి అసిస్టెంట్‌‌ ఇంజనీర్‌‌  ఆఫీసు దాకా మొత్తంగా శాఖ పరిధిలో ఉన్న మొత్తం బిల్డింగులు, వాహనాలు, కంప్యూటర్లు, జిరాక్స్‌‌, ప్రింటింగ్‌‌ మిషన్లు, ఇతర ఆస్తులు, వాటి పరిస్థితికి సంబంధించిన మొత్తం సమాచారాన్ని పరిశీలించారు. ఎస్‌‌ఈలు, సీఈలు తమ పరిధిలోని ఆస్తుల వివరాలను ప్రిన్సిపల్‌‌  సెక్రెటరీకి అందజేశారు. ఇందులో భూములు, స్థలాల పరిస్థితి ఏమిటన్నది తేల్చాలని రజత్​ కుమార్​ అధికారులను ఆదేశించారు.

పూర్తి వివరాల్లేవ్..

నాగార్జునసాగర్‌‌, శ్రీరాంసాగర్‌‌ ప్రాజెక్టు ప్రధాన కాల్వల కోసం సేకరించిన భూముల్లో కాలువలు, ఒకవైపు రోడ్డుగా ఉపయోగిస్తున్న స్థలం పోను మిగతా భూములను సమీప రైతులు సాగు చేసుకుంటున్న విషయం మీటింగ్‌‌లో ప్రస్తావనకు వచ్చింది. మేజర్‌‌, మీడియం, మైనర్‌‌ ఇరిగేషన్‌‌ కోసం సేకరించిన లక్షల ఎకరాల భూమికి సంబంధించి పూర్తి వివరాలు తమ వద్ద అందుబాటులో లేవని కొందరు ఎస్‌‌ఈలు వివరించినట్టు తెలిసింది. మైనర్‌‌ ఇరిగేషన్‌‌ కోసం సేకరించిన చెరువుల భూములు.. మేజర్‌‌, మీడియం ఇరిగేషన్‌‌లో కాల్వల కోసం సేకరించిన భూములు ఎక్కువగా ఇతరుల కబ్జాలో ఉన్నట్టు గుర్తించారు. వాటికి సంబంధించిన పూర్తి వివరాలను మార్చి రెండో తేదీన అందజేయాలని రజత్‌‌కుమార్‌‌ ఆదేశించారు. ఇక రాష్ట్రంలో ఇరిగేషన్​ శాఖ పరిధిలో ఇప్పటివరకు సుమారు ఆరున్నర లక్షల ఎకరాల భూమిని సేకరించారు. అందులో రెండు లక్షల ఎకరాల భూమికి సంబంధించి ఇంకా మ్యూటేషన్​ కాలేదు. అంటే అధికారికంగా ఇరిగేషన్​ డిపార్ట్​మెంట్​ పేరు మీదికి బదిలీ కాలేదు. వాటి లెక్కలు, వివరాలు కూడా తేల్చాలని నిర్ణయించారు.

ప్రత్యేక ఫార్మాట్​లో..

భూముల వివరాలు ఎలా సమర్పించాలి, ఎక్కడెక్కడ ఎంత భూమిని సేకరించారన్న వివరాలు ఎలా ఇవ్వాలి, ఆయా రికార్డుల కోసం సంబంధిత జిల్లాల్లో ఏయే ఆఫీసులను సంప్రదించాలన్న అంశాలపై మధ్యాహ్నం బీఆర్కే భవన్‌‌లో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. రిటైర్డ్‌‌ ఆర్డీవో మనోహర్‌‌ దీనిపై చీఫ్‌‌ ఇంజనీర్లకు అవగాహన కల్పించారు. ఇరిగేషన్‌‌  సర్కిళ్ల వారీగా సేకరించిన భూముల వివరాలు తేలితే.. వాటిలో ఎన్ని భూములు డిపార్ట్‌‌మెంట్‌‌ ఆధీనంలో ఉన్నాయి, ఎన్ని కబ్జా అయ్యాయన్నది తేలుతుందని రజత్​ కుమార్​ స్పష్టం చేశారు. వచ్చే ఐదు రోజుల పాటు ఇదే పనిలో ఉండాలని ఆదేశించారు. మార్చి 16న తిరిగి ఇన్వెంటరీ మీటింగ్‌‌ నిర్వహిస్తామని ఆలోగా ఇరిగేషన్‌‌ డిపార్ట్‌‌మెంట్‌‌కు సంబంధించిన అన్ని వివరాలను పూర్తిగా అందజేయాలని సూచించారు.

Latest Updates