ఆర్టీసీ చార్జీలు 50% పెంపు!

హైదరాబాద్‌‌, వెలుగు: త్వరలో ఆర్టీసీ చార్జీలు పెరగనున్నాయి. ఇప్పటికే లిక్కర్‌‌ ధరలు పెంచిన రాష్ర్ట ప్రభుత్వం.. బస్‌‌ చార్జీలు పెంచాలని భావిస్తోంది. బస్సులను ఎప్పుడు నడిపినా 50 శాతం టికెట్ ధరలు పెంచనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. పెంపుపై అధికారులు కూడా కసరత్తు చేస్తున్నారు. బస్‌‌ కెపాసిటీలో 50 శాతం ప్యాసింజర్స్‌‌తో మాత్రమే నడుపుకోవాలని కేంద్ర ప్రభుత్వం చెప్పడం, లాక్‌‌డౌన్‌‌ వల్ల ఆర్టీసీ 750 కోట్ల మేర ఆదాయం కోల్పోవడంతో.. చార్జీలు పెంచక తప్పదని అధికారులు అంటున్నారు. ఈ నెల 15వ తేదీ తర్వాత గ్రీన్‌‌ జోన్లలో బస్సులను నడిపే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మార్చి 22 నుంచి డిపోల్లోనే బస్సులు

మార్చి 22 నుంచి బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి. ప్రస్తుతం అత్యవసర సిబ్బంది, మెడికల్‌‌ స్టాఫ్‌‌, కార్గో సర్వీసుల కోసం మాత్రమే నడుపుతున్నారు. ఇందులో కార్గో సర్వీసులకే పేమెంట్‌‌ తీసుకుంటున్నారు. సంస్థకు రోజుకు రూ.12 కోట్ల నుంచి 13 కోట్ల వరకు వచ్చేది. మార్చి 22 నుంచి ఈనెల 15వ తేదీ వరకు 750 కోట్ల కలెక్షన్‌‌ కోల్పోయింది. సమ్మె టైంలో రెండు నెలలు బస్సులు పెద్దగా నడవకపోవడంతో ఇంతేస్థాయిలో ఇన్‌‌కమ్‌‌ పోయింది. బస్సులు నడవకున్నా 50 శాతం జీతాలతోపాటు, ట్యాక్స్‌‌లు, ఆర్టీసీ అప్పుల వడ్డీలు కట్టక తప్పడంలేదు.

సగం మందితోనే..

ఆర్టీసీ బస్సులు నడిపితే బస్సు కెపాసిటీలో 50 శాతం మందినే ఎక్కించుకోవాలని కేంద్రం సూచించింది. పల్లె వెలుగు బస్సులో 56 సీట్లున్నాయి. అంటే 23 మందినే ఎక్కించుకోవాలి. మామూలు సమయాల్లోనూ ఆర్టీసీకి నష్టాలు వచ్చేవి. ఇప్పుడు 50 శాతంతో నడిపితే సంస్థ భవిష్యత్‌‌ ఎలా అని అధికారులు వాపోతున్నారు. అన్ని బస్సులు నడిపినా రోజుకు రూ.5 కోట్లు రావడమూ కష్టమేనంటున్నారు. బస్సులు ప్రారంభమైన రోజు నుంచే కొత్త చార్జీలు అమల్లోకి వస్తాయని పేర్కొంటున్నారు. అవసరమైతే 50 నుంచి 75 శాతం వరకు పెంచే అవకాశం లేకపోలేదని చెబుతున్నారు.

కరోనా కంట్రోల్‌‌ అయ్యే దాకా..

డిసెంబర్‌‌ 3 నుంచి కిలోమీటర్‌‌కు 20 పైసల చొప్పున బస్సు చార్జీలు పెంచారు. దీంతో ఆర్టీసీకి ఏటా 752 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేశారు. అన్నీ పోగా రోజుకు సగటున కోటి వరకు లాభం వచ్చేంది. లాక్‌‌డౌన్‌‌ వల్ల పరిస్థితి మొదటికి వచ్చింది. ఇప్పుడు పెంచే చార్జీలు కరోనా కంట్రోల్​లోకి వచ్చే దాకా అమల్లో ఉండనున్నాయి. కరోనా తగ్గితే 30 లేదా 20 శాతం చార్జీలు తగ్గించవచ్చని
ఓ అధికారి తెలిపారు.

మాస్క్ ఉంటేనే ఎక్కనిస్తరు

పల్లె వెలుగు బస్సులో 20 నుంచి 22 మందిని మాత్రమే ఎక్కించుకోనున్నారు. ఇద్దరు కూర్చునే సీటులో ఒకరు, ముగ్గురు కూర్చునే సీటులో ఇద్దరు కూర్చునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. బస్సు ఎక్కేటప్పుడు ప్రతి ప్యాసింజర్‌‌కు థర్మల్‌‌ స్క్రీనింగ్‌‌ చేస్తారు. మాస్క్‌‌ ఉంటేనే అనుమతిస్తారు. ఇప్పటికే బస్సులను శానిటైజ్‌‌ చేసి సిద్ధంగా ఉంచారు.

Latest Updates