కరోనా కవరేజీలో ఉన్న జర్నలిస్టులను ప్రభుత్వం ఆర్ధికంగా ఆదుకోవాలి: హైకోర్టు

ప్రాణాలను ఫణంగా పెట్టి కరోనా వార్తలను కవర్ చేస్తున్న జర్నలిస్టులకు ప్రభుత్వం ఆర్ధిక సహాయం చేయాలంది హైకోర్టు. కరోనా వైరస్ పై ప్రజలకు అవగాహన కల్పించడం లో జర్నలిస్టుల సేవలు మారవలేమంది. కరోనా పై ప్రత్యక్ష పోరాటం చేస్తున్న జర్నలిస్టులను ఆదుకోవాలంటూ హైకోర్టులో లాయర్ రాపోలు భాస్కర్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఇవాళ(మంగళవారం) హైకోర్టు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించారు.

ఈ పిటిషన్ పై సీనియర్ న్యాయవాది మాచర్ల రంగయ్య తన వాదనలను విన్పించారు. లాక్‌డౌన్ సమయంలో ఇబ్బందులు పడుతున్న జర్నలిస్టులను ప్రభుత్వం ఆదుకోవాలని పిటిషనర్ తరపున కోరారు.రాష్ట్రంలో ఉన్న ప్రతి జర్నలిస్టుకు రూ. 25 వేలు ఇవ్వాలని పిటిషనర్ కోరారు. అంతేకాదు కరోనా వార్తలను కవర్ చేస్తున్న  ప్రతి జర్నలిస్టుకు హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని కూడ పిటిషనర్ కోరారు. జర్నలిస్టులకు మెడికల్ కిట్స్, మాస్కులను ఉచితంగా ఇవ్వాలని కోరారు. రెండు వారాల్లోగా జర్నలిస్టులు ఇచ్చిన రిప్రజెంటేషన్ పై స్పందించి… సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.

ఈ విషయమై తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ, ప్రెస్ అకాడమీ ఛైర్మెన్ లకు హైకోర్టు మంగళవారం నాడు నోటీసులు జారీ చేసింది. ఈ విషయమై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేస్తామని అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ ప్రకటించారు.

 

Latest Updates