ప్రజల ఆస్తిపై సర్కార్ కన్ను.. టార్గెట్ 12 వేల కోట్లు

ఎల్ఆర్ఎస్ కు తోడు వీఎల్​టీ, ప్రాపర్టీ ట్యాక్స్

వీఎల్​టీ విధింపు ఇట్లా..

ఖాళీ ప్లాట్లకు వీఎల్‌‌టీ ఎట్లా విధిస్తారంటే.. ఉదాహరణకు హైదరాబాద్​ శివార్లలోని బోడుప్పల్​లో శ్రీకాంత్​ అనే వ్యక్తికి 200 గజాల ప్లాటు ఉంది. ఆ ప్రాంతంలో రిజిస్ట్రేషన్‌‌ డిపార్ట్​మెంట్​ ఖరారు చేసిన బహిరంగ మార్కెట్‌‌ వ్యాల్యూ ప్రకారం.. ఆ ప్లాట్​విలువ రూ.10 లక్షలు. వీఎల్​టీ కింద ఈ విలువలో 0.5 శాతం (అంటే లక్షకు రూ.500 చొప్పున) రూ.5 వేలు కట్టాల్సి ఉంటుంది. దీనికి మరో రూ.300 వరకు ఎక్ట్స్​ట్రా చార్జీలు ఉంటాయి. ఏటా ఇంటి పన్ను లాగానే ఈ వీఎల్​టీని కూడా కట్టాల్సి ఉంటుంది. రాష్ట్రవ్యాప్తంగా 2015లో ఎల్ఆర్ఎస్​ చేసుకున్న ప్లాట్ల ఓనర్ల నుంచి మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు ఇప్పటికే వీఎల్​టీ వసూలు చేస్తున్నాయి. అవిపోగా ఇంకా 25 లక్షలకుపైగా ఖాళీ ప్లాట్లు ఉంటాయని అంచనా వేసిన సర్కారు.. ఆస్తుల ఆన్ లైన్​ తర్వాత అవన్నీ కూడా వీఎల్​టీ పరిధిలోకి వస్తాయని లెక్కలేసుకుంది.

హైదరాబాద్, వెలుగు:రాష్ట్ర ఖజానాను నింపుకొనేందుకు సర్కారు జబర్దస్తీగా ట్యాక్సుల వసూలుకు సిద్ధమవుతోంది. ఎల్ఆర్ఎస్​తో ఖాళీ ప్లాట్ల రెగ్యులరైజేషన్​ ద్వారా ఇప్పటికే రూ.10 వేల కోట్ల ఆదాయాన్ని టార్గెట్​చేసిన సర్కారు.. ఖాళీ స్థలాలన్నీ గుర్తించి ‘వేకెంట్​ల్యాండ్​ ట్యాక్స్(వీఎల్టీ)’ను పక్కాగా వసూలు చేయాలని నిర్ణయించింది. ఇదే సమయంలో ప్రాపర్టీ ట్యాక్స్​వసూళ్లనూ పెంచుకునేందుకు ఏర్పాట్లు చేసింది. ఇందులో భాగంగానే రేకుల షెడ్ల నుంచి బిల్డింగ్​ల దాకా దేన్నీ వదలకుండా ఆస్తులన్నీ ఆన్​లైన్ లో నమోదు చేసుకోవాలనే కొత్త పద్ధతిని తెరపైకి తెచ్చింది. జనంపై పన్నుల బాదుడు ఉండదని సర్కారు పెద్దలు ప్రకటనలు చేస్తున్నా.. ప్రాపర్టీ ట్యాక్స్, వీఎల్​టీని కఠినంగా అమలు చేయటం ద్వారా రూ.2 వేల కోట్ల ఆదాయాన్ని సమకూర్చుకునే ప్లాన్​ చేసింది.  స్థానిక సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే నిధులను ఈ పన్నుల ద్వారా వచ్చే ఆదాయంతో సర్దుబాటు చేసుకోవాలని భావిస్తోంది. మొత్తంగా ఎల్ఆర్ఎస్, ప్రాపర్టీ ట్యాక్స్, వీఎల్​టీ  కలిపి జనం నుంచి 12 వేల కోట్ల రూపాయలకుపైగా వసూలు చేసేందుకు రంగం సిద్ధం చేసింది.

రికార్డుల ప్రకారం రాష్ట్రంలో దాదాపు 61 లక్షల ఇండ్లు, భవనాలున్నాయి. పంచాయతీల్లో 49.50 లక్షల ఇండ్లు, మున్సిపాలిటీల్లో 11.5‌0 లక్షల ఇండ్ల నుంచి ఆస్తి పన్ను వసూలవుతోంది. ఇంకా నమోదు కాని ఇండ్లు 10 లక్షలకుపైగా ఉన్నట్టు సర్కారు అంచనా వేసింది. వాటన్నింటినీ భువన్​ యాప్​ సాయంతో అసెస్  చేయాలని మున్సిపాలిటీలు, పంచాయతీల సిబ్బందికి ఆదేశాలు జారీ చేసింది. అక్టోబర్ 15లోపు ఈ పనికి డెడ్ లైన్​ పెట్టింది. ఒకట్రెండు రూములు, రేకుల షెడ్లున్న పేదల ఇండ్లనూ వదలకుండా అన్ని ఆస్తుల గుర్తింపు జరగాలని స్పష్టంగా సూచించింది. అన్ని జిల్లాల డీపీవోలు పంచాయతీ కార్యదర్శులకు, మున్సిపల్​కమిషనర్లు  బిల్ కలెక్టర్లకు జూమ్​ ద్వారా జరిగిన వీడియో కాన్ఫరెన్సుల్లో అవగాహన కల్పించారు. అసెస్​మెంట్​కు, ఓనర్ షిప్​కు సంబంధం లేదని.. ఆబాదీ/ గ్రామ కంఠం, సర్వే నంబర్, అటవీ ప్రాంతమైనప్పటికీ ఇండ్లను అసెస్​ చేయాలని, అనుమతి లేని నిర్మాణాలకు వెంటనే ఇంటి నంబర్​ కేటాయించాలని ఆదేశించారు. ఈ డేటా ప్రకారమే మెరూన్​ కలర్​ పాస్​బుక్స్​ను అందజేయనున్నట్టు అధికారులు చెప్తున్నారు.

మున్సిపల్ చట్టంలోనే రూల్​ పెట్టారు

ఖాళీ జాగాలున్న ప్రజల నుంచి నిర్బంధంగా ట్యాక్స్​ వసూలు చేసేందుకు వీలుగా రాష్ట్ర మున్సిపల్ చట్టం–2019లో సర్కారు పలు రూల్స్​ చేర్చింది. నిజానికి అంతకన్నా ముందే ఖాళీ ప్లాట్ల ఓనర్లు మార్కెట్​వాల్యూలో 0.5% ఏటా ట్యాక్స్​గా స్థానిక మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు చెల్లించాలని… ఇట్లా కట్టిన రిసిప్ట్​ ఉంటేనే ఆ ల్యాండ్ ను రిజిస్ట్రేషన్​ చేయాలని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ సర్క్యులర్​(జీ/2280/2017) జారీ చేసింది. 2017 ఏప్రిల్​ 17 నుంచే ఈ ఉత్తర్వులు అమల్లో ఉన్నా పూర్తిస్థాయిలో అమలు కాలేదు. గతేడాది కొత్తగా తెచ్చిన ‘తెలంగాణ మున్సిపల్​ యాక్ట్– 2‌019’ లోని చాప్టర్–3లో ఖాళీల జాగాల గుర్తింపు, ట్యాక్స్​ వసూలు రూల్​ చేర్చారు. ఈ చట్టం అమల్లోకి వచ్చిన ఆర్నెళ్లలోపు నిర్మాణ పర్మిషన్లు ఇవ్వదగిన ఖాళీ జాగాలన్నింటినీ గుర్తించి, ట్యాక్స్​ విధించాలని పేర్కొన్నారు. ఇప్పుడీ రూల్​ను పక్కాగా అమలు చేసి.. ఒక్క ఖాళీ జాగాను కూడా వదలకుండా ట్యాక్స్​ వసూలు చేసేందుకు సర్కారు రెడీ అయింది. ఆయా జాగాల్లో ఇండ్లుగానీ, ఇతర నిర్మాణాలుగానీ చేసేవరకు వీఎల్​టీ ట్యాక్స్​ కట్టాలి.

రిజిస్ట్రేషన్, ఇంటి పర్మిషన్లకు వీఎల్​టీతో లింక్

ట్యాక్సుల వసూలును కట్టుదిట్టం చేసేందుకు సర్కారు రెడీ అయింది. వీఎల్​టీ బకాయిలు చెల్లించకపోతే రిజిస్ట్రేషన్లు చేయవద్దని.. ఇంటి నిర్మాణ పర్మిషన్లు ఇవ్వొద్దని మౌఖికంగా అన్ని జిల్లాల అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. గతంలోనే ఉన్న రూల్స్​ను కూడా కఠినంగా అమలు చేయాలని స్పష్టం చేసింది. రాష్ట్ర సర్కారు ప్రస్తుతం చేపట్టిన వ్యవసాయేతర ఆస్తుల ఆన్​లైన్ ప్రక్రియ, మెరూన్​ పాస్​ బుక్స్​జారీ ప్రతిపాదన అంతా కూడా ప్రాపర్టీ ట్యాక్స్ ​వసూళ్లను పెంచుకోవడంలో భాగమేనని అధికారులు చెప్తున్నారు. ఈ క్రమంలోనే ఇంటి పన్ను పరిధిలోకి రాని ఇండ్లను అసెస్​ చేయడం, ఖాళీ స్థలాలను గుర్తించి అసెస్​మెంట్ నంబర్​ ఇవ్వడం వంటివి చేపట్టారని అంటున్నారు. అంతేకాదు ఖాళీ జాగాల ఓనర్లు ఎక్కడున్నా సరే వారి నుంచి పక్కాగా పన్ను వసూలు చేసేందుకు మెకానిజంను రూపొందిస్తున్నట్టు తెలిసింది.

ఆస్కీ సూచనలకు పదును

మున్సిపాలిటీల్లో ఆస్తులను పక్కాగా అసెస్‌ చేసి, ట్యాక్సులను పూర్తి స్థాయిలో వసూలు చేస్తే మున్సిపల్‌ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు ఆర్థికంగా బలోపేతం అవుతాయని అడ్మినిస్ట్రేటివ్‌ స్టాఫ్‌ కాలేజీ ఆఫ్‌ ఇండియా(ఆస్కీ) ఎక్స్​పర్టుల టీమ్​ గతంలో రాష్ట్ర ఫైనాన్స్​ కమిషన్ కు ఇచ్చిన రిపోర్టులో సూచించింది. మున్సిపల్ ఫైనాన్స్, సర్వీస్ డెలివరీపై రెండేళ్ల కిందట స్టడీ చేసి పలు సూచనలు చేసింది. ట్యాక్సుల ఇన్​కం పెంచుకునేందుకు యుద్ధ ప్రాతిపదికన అసెస్డ్‌, అన్‌ అసెస్డ్‌ ప్రాపర్టీలను గుర్తించి డేటా రూపొందించాలని, అసెస్‌ చేయని ఆస్తులను అసెస్‌ చేసి ప్రాపర్టీ ట్యాక్స్​ విధించాలని.. ఖాళీ జాగాలు, కేబుల్‌ ఆపరేటర్ల నుంచి పన్ను వసూలు చేయాలని పేర్కొంది. ఆస్కీ రిపోర్టులోని సూచనలకు సర్కారు మరింత పదును పెట్టి అమలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది.

Latest Updates