కరోనాపై గవర్నర్ ఫోకస్

చర్చించేందుకు రావాలని సీఎస్, హెల్త్ ప్రిన్సిపల్ సెక్రటరీకి పిలుపు హాజరుకాని ఆఫీసర్లు
నేడు ప్రైవేటు హాస్పిటళ్ల మేనేజ్మెంట్లతో  గవర్నర్ భేటీ.. ట్విట్టర్లో వెల్లడి
ప్రభుత్వ ఫెయిల్యూర్స్, కరోనా పరిస్థితిపై  నెటిజన్ల ఫిర్యాదుల వెల్లువ

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కరోనా తీవ్రతపై గవర్నర్ తమిళిసై సీరియస్ గా దృష్టి సారించారు. అసలేం జరుగుతుందో తెలుసుకునే పనిలో పడ్డారు. ఇదే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై చర్చించేందుకు సోమవారం రాజ్ భవన్ కు రావాలని సీఎస్, హెల్త్ ప్రిన్సిపల్ సెక్రటరీని ఆదేశించారు. మంగళవారం వస్తామని గవర్నర్ ఆఫీసుకు సీఎస్ చెప్పినట్టు తెలిసింది. సోమవారం సాయంత్రం దాదాపు గంటపాటు గవర్నర్ ట్విట్టర్ వేదికగా కరోనాపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. మంగళవారం ఉదయం ప్రైవేటు హస్పిటళ్ల మేనేజ్మెంట్లతో సమావేశం అవుతున్నట్టు వెల్లడించారు. గత మూడు నెలలుగా రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై స్టడీ చేస్తున్నానని, నిమ్స్ కు స్వయంగా వెళ్లి సందర్శించానని గుర్తుచేశారు.

ఈ సందర్భంగా నెటిజన్లు.. రాష్ట్రంలో కరోనా తీవ్రత, ప్రభుత్వ నిర్లక్ష్యంపై ఫిర్యాదులు చేశారు. కరోనా కట్టడిలో రాష్ట్ర సర్కార్ ఫెయిలైందని, పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేటు హాస్పిటళ్లు ఎక్కువ ఫీజులు వసూలు చేస్తున్నాయని గవర్నర్ దృష్టికి తెచ్చారు. పలు ప్రశ్నలకు ఆమె ఓపికగా సమాధానం ఇచ్చారు. కరోనా కట్టడిలో రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తేసిందనే విమర్శలు వెల్లువెత్తుతున్న టైంలో గవర్నర్దృష్టి సారించడం ఆసక్తికరంగా మారింది. గవర్నర్ మంగళవారం ప్రైవేటు ఆస్పత్రుల మేనేజ్మెంట్లతో సమావేశం కానున్నారు. ప్రైవేటు ఆస్పత్రులు తప్పుడు రిపోర్టులు ఇస్తున్నాయని రాష్ట్ర హెల్త్ డిపార్ట్మెంట్ ఆఫీసర్లు ఆరోపిస్తూ వస్తున్నారు.

లక్షల్లో ఫీజు వసూలు చేస్తున్నట్టు ప్రజలు నుంచి ఫిర్యాదులు వచ్చాయి. దీంతో గవర్నర్ ప్రైవేటు హస్పిటల్స్ ప్రతినిధులతో మీటింగ్ నిర్వహించడం చర్చనీయాంశమైంది. ఈ విషయం పై కూడా గవర్నర్ ట్విట్ చేశారు. ‘‘ఐసోలేషన్ సౌకర్యాలు, బెడ్స్ , బిల్లింగ్ , టెస్టింగ్ తదితర అంశాల్లో పబ్లిక్ సందేహాలు , ఫిర్యాదులపై చర్చించేందుకు, కరోనాను నివారించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై మంగళవారం ఉదయం 11 గంటలకు ప్రైవేట్ హాస్పిటళ్ల ప్రతినిధులతో సమావేశం అవుతున్నాను’’ అని వెల్లడించారు.

సీఎస్, హెల్త్ సెక్రటరీని రమ్మని చెప్పా

రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసులపై చర్చించేందుకు సీఎస్, హెల్త్ సెక్రటరీతో చర్చిస్తానని ట్విట్టర్ లో గవర్నర్ పేర్కొన్నారు. ‘‘రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసుల గురించి చర్చించటానికి సీఎస్, హెల్త్ సెక్రటరీని రావాలని ఆదేశించాను’’ అని పోస్ట్ చేశారు.

మరో పనిలో బిజీగా ఉన్నట్లు బదులిచ్చిన సీఎస్!

కరోనా నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై చర్చించేందుకు సీఎస్, హెల్త్ సెక్రటరీని రాజ్ భవన్ కు రావాలని సోమవారం ఉదయమే సమాచారం ఇచ్చారు. కానీ వెంటనే రావడం కుదరదని, మరో పనిలో బిజీగా ఉన్నట్లు గవర్నర్ ఆఫీసుకు సీఎస్ సమాచారం ఇచ్చినట్టు అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. వైరస్ నియంత్రణ కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై గవర్నర్ కు పూర్తి రిపోర్టు ఇచ్చేందుకు ఒకరోజు టైం అడిగి ఉండొచ్చని ఓ సీనియర్ ఆఫీసర్ చెప్పారు. అయితే గవర్నర్ పిలిస్తే అధికారులు మరో రోజు వస్తామని చెప్పడం ఏమిటని, ఇది సరైన పద్ధతి కాదన్న చర్చ సెక్రటేరియట్ వర్గాల్లో జరిగింది.

ఎందుకింత దృష్టి?

మొన్నటి వరకు రాష్ట్రంలోని ఎడ్యుకేషన్పై దృష్టి పెట్టిన గవర్నర్.. ఇప్పుడు కరోనా తీవ్రతపై ఆరా తీయడంపై ఆసక్తికరంగా మారింది. డాక్టరైన గవర్నర్ తమిళిసై మొదట్నించి రాష్ట్రంలో కరోనా సిచ్యువేషన్పై ఆరా తీస్తున్నారు. స్వయంగా నిమ్స్ కు వెళ్లి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అయితే ప్రభుత్వం సరిగా టెస్టులు నిర్వహించడం లేదని, కేసులపై వాస్తవాలు వెల్లడించడం లేదని రాజకీయ పార్టీలు ఆమెకు ఫిర్యాదు చేశాయి. అదే టైంలో..కరోనాతో హైదరాబాద్ ప్రమాదకరంగా మారిందని కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి ఆరోపించారు. వైరస్ నియంత్రణపై స్టడీ చేసేందుకు హైదరాబాద్ కు వచ్చిన సెంట్రల్ టీమ్కు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సమాచారం ఇవ్వలేదన్న విమర్శలు వచ్చాయి. ప్రజలు కూడా తమ నిరసనను వెలిబుచ్చుతూనే ఉన్నారు. ఒకేసారి అన్ని వైపుల నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఫెయిలైందన్న ఆరోపణలు వస్తున్న టైంలో కరోనా సిచ్యువేషన్పై గవర్నర్ ఫోకస్ పెట్టడం చర్చకు దారితీసింది. ప్రైవేటు హస్పిటళ్లతో ప్రభుత్వం నిర్వహించాల్సిన మీటింగ్ను కూడా జరిపేందుకు గవర్నర్ ముందుకు వచ్చారు. ‘‘రాష్ట్రంలో ఏం జరుగుతుందో రిపోర్ట్ ఇవ్వాలని గవర్నర్ ను కేంద్రం అడిగి ఉండొచ్చు. అందుకే ఆమె అన్ని విషయాలను ప్రభుత్వం నుంచి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందరితో మాట్లాడుతున్నారు’’ అని ఓ ఐఏఎస్ ఆఫీసర్ అభిప్రాయపడ్డారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం..

 

Latest Updates