అన్నిట్లో మనమే టాప్

తక్కువ టైమ్​లోనే ఎంతో అభివృద్ధి: గవర్నర్​ తమిళిసై

తక్కువ టైం లోనే ప్రగతి సాధించిన తెలంగాణను చూసి దేశం అబ్బురపడుతోంది. సంక్షేమంలో దేశంల మనమే నంబర్‌‌ వన్‌‌. నీటి పారుదల రంగంలో అద్భుతమైన పురోగతి సాధించినం. యాసంగిలో వరి సాగు విస్తీర్ణం మామూలు కన్నా 123 శాతం ఎక్కువ పెరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టు త్వరలోనే సంపూర్ణంగా పూర్తయితది. ఈ యేడు వర్షా కాలం నుంచే రోజుకు 3 టీఎంసీలను ఎత్తి పోసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నయ్‌. కరెంటు రంగంలో గొప్ప విజయం సాధించినం. రైతులకు 24 గంటలు ఫ్రీ కరెంటిస్తున్న ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ.
– గవర్నర్‌ తమిళి సై

హైదరాబాద్​, వెలుగు: రాష్ట్రం ఏర్పడిన తక్కువ టైంలోనే సాధించిన ప్రగతిని చూసి దేశం అబ్బురపడుతున్నదని గవర్నర్​ తమిళిసై అన్నారు. రాష్ట్రం ఏర్పడిన నాటి పరిస్థితులతో ఇప్పటి పరిస్థితులను పోల్చి చూసుకుంటే అభివృద్ధి పరంగా ఎంతో ముందుకు సాగిందని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్​ నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం గడిచిన ఆరేండ్లుగా ప్రణాళికాబద్ధంగా చేస్తున్న ప్రయత్నాలు మంచి ఫలితాలిస్తున్నాయని చెప్పారు. సమైక్య రాష్ట్రంలో కుదేలైన అన్ని రంగాలను పైకితెచ్చేందుకు సర్కారు కృషి చేస్తున్నదని తెలిపారు. శుక్రవారం శాసనసభ, శాసన మండలి సభ్యుల ఉమ్మడి మీటింగ్​తో అసెంబ్లీ బడ్జెట్​ సమావేశాలు మొదలయ్యాయి. గవర్నర్​ తమిళిసై మొదటిసారి అసెంబ్లీలో ప్రసంగించారు. రాష్ట్రంలో నీటిపారుదల రంగం అద్భుతమైన పురోగతిని సాధించిందని తెలిపారు. యాసంగిలో వరి సాగు విస్తీర్ణం సాధారణం కంటే 123.5 శాతం పెరిగిందని పేర్కొన్నారు.

త్వరలోనే సీతమ్మ, సమ్మక్క బ్యారేజీల పూర్తి

ప్రస్తుత దుమ్ముగూడెం ఆనకట్ట ప్రాంతంలోనే సీతామరామ ప్రాజెక్టుకు నీరందించడానికి.. 320 మెగావాట్ల జలవిద్యుత్ ఉత్పత్తికి అనుగుణంగా ఉండేందుకు 40 టీఎంసీల సామర్థ్య్యంతో సీతమ్మ సాగర్ బ్యారేజీని ప్రభుత్వం మంజూరు చేసిందని గవర్నర్​ చెప్పారు. త్వరలోనే ఈ బ్యారేజీ పనులు ప్రారంభమవుతాయని ప్రకటించారు. కోటి ఎకరాలకు సాగునీరు అందించడం లక్ష్యంగా ప్రభుత్వం సమగ్ర జలవిధానాన్ని రూపొందించుకుని అమలు చేస్తోందని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు త్వరలోనే సంపూర్ణంగా పూర్తవుతుందని, ఈ ఏడాది వర్షాకాలం నుంచే గోదావరి నది నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రోజుకు మూడు టీఎంసీల నీటిని ఎత్తిపోసేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయని గవర్నర్​ చెప్పారు. సమ్మక్క బ్యారేజీ పనులను ఈ ఎండాకాలంలో పూర్తి చేయాలని  ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నదన్నారు. గవర్నర్​ తమిళిసై.. నమస్కారం, వణక్కం అంటూ ప్రసంగాన్ని ప్రారంభించారు. ‘ఆకలి దప్పులు లేని, అనారోగ్యాలు లేని, శతృత్వం లేని రాజ్యమే గొప్ప రాజ్యం’ అంటూ ముగించారు.

గవర్నర్​ ప్రసంగంలోని అంశాలు..

అవినీతికి, జాప్యానికి ఏమాత్రం ఆస్కారం ఇవ్వని విధంగా కొత్త రెవెన్యూ చట్టాన్ని ప్రభుత్వం రూపొందిస్తున్నది. కొత్త భూ పరిపాలనా విధానానికి శ్రీకారం చుట్టబోతున్నది.

రైతు సమన్వయ సమితులను ఇక నుంచి రైతు బంధు సమితులుగా వ్యవహరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇవి కీలక బాధ్యతలు పోషించే విధంగా త్వరలోనే యాక్షన్​ ప్లాన్​  ప్రారంభిస్తుంది.

సంక్షేమ రంగంలో దేశంలోనే రాష్ట్రం నెంబర్ వన్​గా నిలిచింది. ఆసరా పెన్షన్ల ద్వారా ఇస్తున్న పెన్షన్​ మొత్తాన్ని ప్రభుత్వం  రెట్టింపు చేసింది.  వృద్ధాప్య పెన్షన్ అర్హత వయసును 65 ఏండ్ల నుంచి 57 ఏండ్లకు తగ్గించాలని నిర్ణయించింది. 57 ఏండ్లు నిండిన వారందరికీ త్వరలోనే ఆసరా పెన్షన్లు అందుతాయి.

యువత ఉపాధికోసం నడుపుకొనే ఆటోలు, రైతులు ఉపయోగించే ట్రాక్టర్లపై రవాణా పన్నును ప్రభుత్వం రద్దు చేసింది.

ఎస్సీ, ఎస్టీ వర్గాల అభ్యున్నతి కోసం ప్రభుత్వం ప్రత్యేక ప్రగతి నిధిని ఏర్పాటు చేసింది. ఆయా వర్గాల జనాభా నిష్పత్తి ప్రకారం బడ్జెట్లో నిధులు కేటాయించి, ఖర్చు చేస్తున్నది.

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ స్టూడెంట్స్​ విదేశీ విద్యను అభ్యసించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ.20 లక్షల చొప్పున డాక్టర్ బీఆర్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిభా ఫూలే పేర్లతో ఓవర్సీస్ స్కాలర్ షిప్ పథకం అమలు చేస్తున్నది.

సంచార కులాలు, ఆర్థికంగా బాగా వెనుకబడిన తరగతులు తదితర వర్గాల వారి కోసం ప్రభుత్వం  ఎంబీసీ కార్పొరేషన్ ను  ఏర్పాటు చేసింది. బీసీ కులాల వికాసానికి ఉపయోగపడే విధంగా ఉండడానికి హైదరాబాద్ నగరంలో ఆత్మగౌరవ భవనాల నిర్మాణాల కోసం ప్రభుత్వం స్థలాలు కేటాయించింది.

పోలీసు ఉద్యోగ నియామకాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కేటాయించింది.

ప్రభుత్వ స్థలాల్లో నివసిస్తున్న పేదలకు 125 చదరపు గజాలలోపు స్థలాన్ని ప్రభుత్వం ఉచితంగా క్రమబద్ధీకరించింది. 58 జీవో కింద రెగ్యులరైజేషన్ ప్రకారం రాష్ట్రం మొత్తం లక్షా 25 వేల మందికి భూమి పట్టాలు పంపిణీ జరిగింది.

పేద యువతకు  స్వయం ఉపాధి కోసం బ్యాంకులతో సంబంధం లేకుండా, రూ.50 వేల వరకు వంద శాతం సబ్సిడీతో ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తున్నది. లక్ష రూపాయల రుణం తీసుకునే వారికి 80 శాతం సబ్సిడీ అందిస్తున్నది. రూ.2 లక్షలలోపు యూనిట్ కు 70 శాతం, రూ.5 లక్షలలోపు యూనిట్ కు 60 శాతం సబ్సిడీని అందిస్తున్నది.

కరెంటు రంగంలో రాష్ట్రం గొప్ప విజయాలు సాధించింది. రైతులకు 24 గంటల పాటు ఉచిత విద్యుత్ సరఫరా జరుగుతున్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణ నిలవడం గర్వకారణం.

రైతుబంధు పథకం ఇప్పుడు దేశానికి ఓ రోల్ మోడల్ గా నిలిచింది.

మిషన్​ భగీరథతో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు రోజూ సురక్షిత మంచినీరు అందుతున్నది.

న్యూ బోర్న్ కేర్ సెంటర్లను 22 నుంచి 42కు పెంచాలని నిర్ణయించింది. ఇప్పటికే కొత్తగా ఆరు సెంటర్లు ప్రారంభమయ్యాయి.

అన్ని రకాల పరీక్షలు నిర్వహించి, తెలంగాణ హెల్త్ ప్రొఫైల్ రూపొందించడానికి ప్రభుత్వం సంకల్పించింది. దీనిపై   కార్యాచరణను  త్వరలోనే ప్రకటిస్తుంది.

రాష్ట్రాన్ని పెట్టుబడుల స్వర్గధామంగా మార్చేందుకు ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తున్నాయి. 15 రోజుల్లోనే అన్ని రకాల అనుమతులిచ్చే టీఎస్ – ఐపాస్  సింగిల్ విండో విధానంతో ఇప్పటి వరకు 12,427 పరిశ్రమలకు అనుమతులు వచ్చాయి. ఐటీ రంగంలో రాష్ట్రం బలమైన శక్తిగా ఎదిగింది.

నూటికి నూరు శాతం ప్రభుత్వ ఖర్చుతో డబుల్ బెడ్ రూం ఇండ్లను నిర్మించి ఇచ్చే పథకం కేవలం తెలంగాణలోనే అమలవుతున్నది. ఈ కింద ఇప్పటి వరకు 2, 72, 763 ఇండ్లను ప్రభుత్వం మంజూరు చేసింది. ఇండ్ల నిర్మాణం వేగంగా సాగుతున్నది.

శాంతి భద్రతల పర్యవేక్షణకు రాష్ట్రంలో 6 లక్షల సీసీ కెమెరాలు అందుబాటులో ఉన్నాయి. దేశం మొత్తమ్మీద ఉన్న సీసీ కెమెరాల్లో 66 శాతం  ఇక్కడే ఉన్నాయి. హైదరాబాద్ లో నిర్మిస్తున్న పోలీస్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ త్వరలోనే ప్రారంభమవుతుంది.

గడిచిన కొద్ది నెలలుగా కొనసాగుతున్న తీవ్రమైన ఆర్థిక మాంద్యం ప్రభావం రాష్ట్రంపై కూడా పడింది. ఆర్థికాంశాలలో కఠినమైన క్రమశిక్షణ పాటించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది.

Latest Updates