ప్రజల కోసం నిరంతరం పని చేస్తూనే ఉంటా

ప్రజల కోసం నిరంతరం పని చేస్తూనే ఉంటా

న్యూఢిల్లీ: ప్రజల కోసం నిరంతరం పని చేస్తూనే ఉంటానని రాష్ట్ర గవర్నర్ తమిళసై ఉద్ఘాటించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న గవర్నర్ మీడియాతో మాట్లాడుతూ... ప్రోటోకాల్ విషయంలో కేంద్రానికి రిపోర్ట్ ఇచ్చానని, ఆ విషయంలో కేంద్రం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. అయినా తాను ప్రజా సేవ తప్ప ప్రోటోకాల్ పట్టించుకోనని స్పష్టం చేశారు. ఏడాదిగా ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా పని చేస్తున్నానని చెప్పారు. ప్రతి నెలా ఓ గవర్నర్ గా కేంద్రానికి రిపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుందని, అందుకోసమే తాను ఢిల్లీకి వచ్చినట్లు స్పష్టం చేశారు. కొంతమంది వ్యక్తులు తాను రాజకీయాలు చేస్తున్నానంటూ అనవసర కామెంట్స్ చేస్తున్నారన్నారు.

ఓ గవర్నర్ గా తన విధులు నిర్వహిస్తున్నానని పేర్కొన్న గవర్నర్... తనకు ఎలాంటి రాజకీయ ఎజెండా లేదని అన్నారు. ప్రభుత్వాన్ని రద్దు చేస్తాను అని తాను  ఎక్కడా అనలేదని తెలిపారు. ధాన్యం కొనుగోలు అవకతవకలపై సీబీఐ ఎంక్వైరీ చేయించాలి అంటూ కాంగ్రెస్ నాయకులు ఇచ్చిన లేఖను సంబంధిత వర్గాలకు పంపించానని చెప్పారు. ప్రతి ఒక్కరూ రాజ్యాంగ వ్యవస్థలను గౌరవించాలని అన్నారు. మహిళలు ఎట్టిపరిస్థితుల్లో ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవద్దని, ధైర్యంగా ముందుకెళ్లాలని సూచించారు. 

మరిన్ని వార్తల కోసం...

కేంద్రంపై తప్పుడు ప్రచారం కోసమే ధాన్యం రగడ

మత ప్రదేశాల్లో లౌడ్స్పీకర్లకు అనుమతి తప్పనిసరి