రెండేళ్లు.. కోటీ 95 లక్షల ఇళ్లు

  • పీఎంఏవై కింద నిర్మించాలని కేంద్రం లక్ష్యం          
  • ఐదేళ్లలో గ్రామాల్లో 1.54 కోట్ల ఇళ్ల నిర్మాణం

న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై)–గ్రామీణ్ పథకం కింద 2022 నాటికి ప్రతి ఒక్కరికి గూడు కల్పించే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులేస్తోంది. దేశవ్యాప్తంగా వచ్చే 2 ఏళ్లలో కోటీ  95 లక్షల ఇళ్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

‘‘పీఎంఏవై–గ్రామీణ్ రెండో దశలో 2019-–20 నుంచి 2021–22 వరకు అర్హులైన లబ్ధిదారులకు ఇళ్లు నిర్మిస్తాం. ఆ ఇళ్లలో ఎల్పీజీ, ఎలక్ట్రిసిటీ కనెక్షన్లు, టాయిలెట్ సౌకర్యాలు సహా అన్నీ ఉంటాయి” అని శుక్రవారం కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. గత ఐదేళ్లలో గ్రామాల్లో 1.54 కోట్ల ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసినట్లు తెలిపారు.

ఇళ్ల నిర్మాణానికి పట్టే సమయం భారీగా తగ్గినట్లు చెప్పారు. 2015–16లో పీఎంఏవై కింద 314 రోజుల్లో నిర్మించాల్సిన ఇళ్లను కేవలం 114 రోజుల్లోనే కట్టామని, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్​ఫర్ (డీబీటీ) వల్లే ఇది సాధ్యమైందని చెప్పారు. 2022 నాటికి దేశంలోని ప్రతి గ్రామీణ కుటుంబానికి ఎలక్ట్రిసిటీ, వంట సౌకర్యం కచ్చితంగా ఏర్పాటు చేస్తామని వివరించారు. కేంద్రం ఏ పని చేసినా గావ్, గరీబ్, కిసాన్ (ఊరు, పేద, రైతు)లను దృష్టిలో ఉంచుకునే చేస్తుందని చెప్పారు.

2024 నాటికి ఇంటింటికీ నీళ్లు

2024 నాటికి గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి ఇంటికి నీటిని సరఫరా చేస్తామని నిర్మల చెప్పారు. కొత్తగా ఏర్పాటు చేసిన జల్ శక్తి మినిస్ట్రీ ఇందుకోసం రాష్ట్రాలతో కలిసి పని చేస్తుందని తెలిపారు. జల్ జీవన్ మిషన్ కింద ‘హర్ ఘర్ జల్’ పనులు జరుగుతాయన్నారు.

ఇంకా ఏం చెప్పారంటే..

  • దేశవ్యాప్తంగా బహిరంగ మల విసర్జన (ఒడీఎఫ్) లేని గ్రామాలు 5.6 లక్షలు
  • ప్రధాన మంత్రి గ్రామీణ్ డిజిటల్ సాక్షారతా అభియాన్ కింద డిజిటల్ అక్షరాస్యులుగా 2 కోట్ల మంది రూరల్ ప్రజలు
  • స్వచ్ఛ్ భారత్ మిషన్ కింద 2014 అక్టోబర్ 2 నుంచి ఇప్పటివరకు 9.6 కోట్ల టాయిలెట్ల నిర్మాణం
  • 2022 నాటికి ప్రతి ఇంటికి కరెంటు కనెక్షన్, కుకింగ్ ఫెసిలిటీ
  • ప్రధాన మంత్రి గ్రామ్  సడక్ యోజన ఫేజ్–3లో లక్షా 25 వేల కిలోమీటర్ల రోడ్ల విస్తరణ. ఇందుకు రూ.80,250 కోట్ల ఖర్చు.

 

Latest Updates