బియ్యంతో శానిటైజర్ తయారీ

  • ప్రణాళిక ఆమోదించిన కేంద్రం
  • ఎఫ్​సీఐ గోడౌన్లలోని మిగులు రైస్ వాడాలని నిర్ణయం

న్యూఢిల్లీ: మిగులు బియ్యాన్ని శానిటైజర్‌గా మార్చే ప్రణాళికను కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎఫ్​సీఐ)లో లభించే మిగులు బియ్యంతో పెట్రోల్, ఆల్కాహాల్ ఆధారిత హ్యాండ్ శానిటైజర్లను తయారు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. పెట్రోలియం, నేచురల్ గ్యాస్ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అధ్యక్షతన సోమవారం జరిగిన నేషనల్ బయోఫ్యూయెల్ కో ఆర్డినేషన్ కమిటీ(ఎన్​బీసీసీ) మీటింగ్​లో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎఫ్​సీఐలో లభించే మిగులు బియ్యాన్ని ఇథనాల్ గా మార్చవచ్చని.. దానిని ఆల్కహాల్ బేస్డ్ హ్యాండ్ శానిటైజర్లను తయారు చేయడంలో ఉపయోగించవచ్చనే విధానాన్ని ఆమోదించారు.

ఆస్పత్రులకు సప్లై
ఇప్పటికే హ్యాండ్ శానిటైజర్లు తయారు చేయాలని నిర్ణయించిన షుగర్ ఫ్యాక్టరీలు.. తయారైన వాటిలో ఎక్కువ భాగం ఆస్పత్రులకు సప్లై చేయాలనుకుంటున్నట్లు తెలిపాయి. వారిలో కొంతమంది శానిటైజర్లను తక్కువ ధరకు, మరికొందరు ఫ్రీగా హాస్పిటల్స్ కు సరఫరా చేయాలని నిర్ణయించారు. రాష్ట్రాల ఎక్సైజ్ డిపార్ట్ మెంట్లు, డ్రగ్ కంట్రోలర్లు పూర్తి సహాకారం అందించడంతో కొత్త విధానంలో హ్యాండ్ శానిటైజర్ల ఉత్పత్తి షుగర్ ఫ్యాక్టరీలలో ప్రారంభం అయిందని ఇండియన్ షుగర్ మిల్స్ అసోసియేషన్ ప్రతినిధి ఒకరు మీడియాకు వెల్లడించారు.

గోడౌన్లలో మస్తు బియ్యం మిగుల్తున్నయ్
ఎఫ్​సీఐ గోడౌన్లలో మొత్తం 58.49 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాలున్నాయి. ఇందులో బియ్యం 30.97 మిలియన్ టన్నులు, గోధుమలు 27.52 మిలియన్ టన్నులున్నట్లు అధికారిక సమాచారం. ఆహార ధాన్యాల స్టాక్ ఏప్రిల్ 1 నాటికి దాదాపు 21 మిలియన్ టన్నుల నిల్వలు ఉన్నాయని, ఇది సగటు అవసరమైన నిల్వ కంటే చాలా ఎక్కువ అని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. రెగ్యులర్ గా రేషన్ పంపిణీ, లాక్ డౌన్ అమలుతో పంపిణీ చేస్తున్న బియ్యం తదితర అవసరాలకు పోను చాలా స్టాక్ మిగులుతుందని అంచనా వేసినట్లు తెలిపాయి.

Latest Updates