చిన్న చిన్న ఇండస్ట్రీలకు  విదేశాలనుంచి రూ.లక్ష కోట్లు

న్యూఢిల్లీ :  దేశంలోని కుటీర, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు ( ఎంఎస్‌‌ఎంఈలు) ఊతమిచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విదేశీ లెండర్ల నుంచి ఎంఎస్‌‌ఎంఈలకు14.5  బిలియన్ డాలర్ల(రూ.99,928 కోట్ల) క్రెడిట్ అందించేందుకు చూస్తోంది. దీని కోసం ఫారిన్‌‌ లెండర్లతో ప్రభుత్వం చర్చలు జరుపుతున్నట్టు తెలిసింది. ప్రభుత్వం చర్చలు జరిపే ఫారిన్ లెండర్స్‌‌లో జర్మనీ ప్రభుత్వ రంగ డెవలప్‌‌మెంట్ బ్యాంక్ కేఎఫ్‌‌డబ్ల్యూ గ్రూప్, ప్రపంచ బ్యాంక్, కొన్ని కెనడియన్ ఇన్‌‌స్టిట్యూషన్లు ఉన్నాయి. ఫారిన్ ఇన్‌‌స్టిట్యూషన్ల నుంచి లక్ష కోట్ల వరకు రుణాలు ఇప్పించే ప్లాన్‌‌లో ప్రభుత్వం ఉన్నట్టు ఒకరు చెప్పారు. చిన్న వ్యాపారాల రంగానికి అవసరమైన మూలధనం అందించేందుకు మన ఇండియన్ బ్యాంక్‌‌లకు తగినంత  స్థాయి లేకపోవడమే దీనికి కారణమని వారు పేర్కొన్నారు. మూలధనం దొరకకపోవడంతో ఈ రంగం ఉద్యోగాలు కల్పించేందుకు ఆపసోపాలు పడుతోందని తెలిపారు.

ప్రభుత్వం జరుపుతున్న చర్చలు ప్రాథమిక దశలోనే ఉన్నాయని తెలిసింది. కేంద్ర ఎంఎస్‌‌ఎంఈ మంత్రిత్వ శాఖ దీనిపై ఆర్థికమంత్రిత్వ శాఖతో కలిసి ఫారిన్ బ్యాంక్‌‌లతో చర్చిస్తున్నట్టు వెల్లడైంది. విదేశీ సావరీన్ బాండ్లను జారీ చేయడం ద్వారా 70,000 కోట్లను అప్పుగా తెచ్చుకోవాలని ప్లాన్‌‌లో ఉన్నట్టు ప్రభుత్వం ప్రకటించిన అనంతరం ఈ డెవలప్‌‌మెంట్ వెలుగులోకి వచ్చింది. దేశీయ జీడీపీ పెరిగినా.. షాడో బ్యాంకింగ్ ఇండస్ట్రీ లిక్విడిటీ సంక్షోభం ఎదుర్కొంటుండటంతో, ఎంఎస్‌‌ఎంఈలకు అసలు రుణాలు దొరకడం లేదు. దేశంలో 6.34 కోట్ల ఎంఎస్‌‌ఎంఈలున్నాయి.  ఎంఎస్‌‌ఎంఈ రంగం 20 లక్షల కోట్ల నుంచి 25 లక్షల కోట్ల లోటు క్రెడిట్‌‌ను ఎదుర్కొంటుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్యానల్‌‌ ఇటీవలే వెల్లడించింది. ఈ రంగ ప్రస్తుత జీడీపీలో 28 శాతానికి పైగా సహకారం అందిస్తోంది.

Latest Updates