గుళ్లలోని తాబేళ్లను తరిమేస్తున్నారు

అరుదైన తాబేళ్లను రక్షించేందుకు అస్సాం అధికారులు రంగంలోకి దిగారు. గుళ్లలోని కొలనుల్లో పూజలు అందుకుంటున్న తాబేళ్లను వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలకు తరలిస్తున్నారు. మొత్తం ఆరు రోజులపాటు ఈ డ్రైవ్‌‌ను నిర్వహించనున్నారు. తొలిదశలో సోనిట్‌‌పూర్‌‌ జిల్లాలోని నాగోన్‌‌ శివస్థాన్‌‌ గుడిలోని అరవై ఏడు తాబేళ్లను బుర్చాపోరి వైల్డ్‌‌లైఫ్‌‌ శాంక్చురీకి తరలించారు. వాటిల్లో ఇండియన్‌‌ ఫ్లాఫ్‌‌షెల్‌‌, పీకాక్‌‌ సాఫ్ట్‌‌షెల్‌‌, ఇండియన్‌‌ టెంట్‌‌, బ్రౌన్‌‌–రూఫ్డ్‌‌, బ్లాక్‌‌ సాప్ట్‌‌షెల్‌‌ జాతులకు చెందిన తాబేళ్లు ఉన్నాయి.

టార్టల్‌‌ సర్వైవల్‌‌ అలియన్స్‌‌, వైల్డ్‌‌లైఫ్‌‌ డివిజన్‌‌ సహకారంతో ‘సేవ్‌‌ టార్టల్‌‌’ ఆపరేషన్‌‌ని నిర్వహిస్తున్నాయి.  ఆ రాష్ట్రంలో దాదాపు 18 ఆలయాల్లో తాబేళ్లకు పూజలు చేయడం ఆనవాయితీగా ఉంది. పిల్లలు పుట్టాలని, కెరీర్‌‌లో త్వరగా సెటిల్‌‌ కావాలని వాటికి పూజలు చేస్తుంటారు జనాలు.  ఇందుకోసం గుడి కొలనులో వాటికి ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తారు ఆలయ నిర్వాహకులు. అయితే కాంక్రీట్‌‌ కొలనులో తాబేళ్లు గుడ్లు పెట్టడం, అవి వాటిని పొదగడం సాధ్యమయ్యే పని కాదు. అంతేకాదు ప్రసాదం పేరుతో వాటికి పెట్టే తిండి వల్ల తాబేళ్ల జీవితకాలం తగ్గిపోతోంది.  దీంతో తాబేళ్లు అంతరించే స్థితికి చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు ఆలయ నిర్వాహకుల్ని, భక్తుల్ని ఒప్పించి వాటిని వైల్డ్‌‌లైఫ్‌‌ శాంక్చురీకి తరలిస్తున్నారు.

Latest Updates