ఆ మూడు జిల్లాలు పూర్తిగా క్లోజ్?

  • ఇండ్లలోంచి ఎవరినీ బయటికి రానివ్వొద్దని నిర్ణయం
  • ప్రధానంగా సూర్యాపేటపై నజర్​
  • కేసులు ఇంకా పెరిగితే ర్యాండమ్ టెస్టులు
  • గద్వాల జిల్లాలోనూ వేగంగా పెరుగుతున్న కేసులు
  • వికారాబాద్​లో వారంగా కొత్త కేసులు లేకున్నా హైఅలర్ట్

హైదరాబాద్‌‌, వెలుగుకరోనా కేసులు అధికంగా నమోదవుతున్న సూర్యాపేట, గద్వాల, వికారాబాద్‌‌ జిల్లాలపై సర్కారు ప్రత్యేకంగా ఫోకస్​ పెట్టింది. రాష్ట్రంలో గ్రేటర్​ హైదరాబాద్​తోపాటు సూర్యాపేట జిల్లాలో భారీగా కేసులు నమోదవుతున్నాయి. వికారాబాద్, గద్వాల జిల్లాల్లో వైరస్​ వ్యాప్తి వేగంగా ఉంది. దీంతో సూర్యాపేట, గద్వాల, వికారాబాద్​లలో లాక్‌‌ డౌన్ పక్కాగా అమలు చేయాలని ఆ జిల్లాల్లో పర్యటించిన ఉన్నతాధికారులు ఆదేశించారు. పరిస్థితి కంట్రోల్లోకి రాకుంటే.. ఇండ్లలోంచి ఒక్కరు కూడా బయటికి రాకుండా పూర్తిగా లాక్​డౌన్​ అమలు చేయాలని సర్కారు భావిస్తోంది.

తొలుత ఈ 3 జిల్లాల్లో 14 రోజులు ప్రజలందరినీ ఇండ్లకే పరిమితం చేయాలని భావిస్తున్నారు. అప్పటికీ కేసులు తగ్గకపోతే ర్యాండమ్​గా వీలైనంత మందికి టెస్టులు చేయించాలని నిర్ణయించారు. ఇప్పటికే నమోదైన పాజిటివ్ కేసుల కాంటాక్ట్స్‌ ట్రేసింగ్‌ ను మరోసారి రివ్యూ చేసి.. కాంటాక్ట్స్‌ లో అందరికీ టెస్టులు చేయించనున్నారు. ముఖ్యంగా సూర్యాపేటలో ఒక్క వ్యక్తి కూడా బయటికి వెళ్లకుండా పూర్తి లాక్‌ డౌన్‌ అమల్లోకి తేనున్నారు.

సగటు కేసులు ఎక్కువ

రాష్ట్రంలో హైదరాబాద్‌ తర్వాత అత్యధిక కేసులు సూర్యాపేట జిల్లాలోనే నమోదయ్యాయి. గత 22 రోజుల్లో అక్కడ 83 మందికి వైరస్ సోకింది. ఈ జిల్లాలో 13 లక్షల జనాభా ఉంది. ఈ లెక్కన సగటున ప్రతి లక్ష మందిలో 6.5 కేసులు నమోదయ్యాయి. కోటికిపైగా జనాభా ఉన్న గ్రేటర్ హైదరాబాద్‌లో 470 కేసులు వచ్చాయి. అంటే ప్రతి లక్షకు సగటున ఐదుగురికి మాత్రమే. సగటున చూస్తే హైదరాబాద్‌ కంటే సూర్యాపేటలోనే వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్నట్టు అధికారులు చెప్తున్నారు. గద్వాల జిల్లాలోనూ ఇదే పరిస్థితి ఉంది. ఇక్కడ సగటున ప్రతి లక్ష మందిలో ఆరుగురికి వైరస్ సోకింది. 20 రోజుల్లోనే 36 కేసులు నమోదయ్యాయి. కొందరికి వైరస్ ఎలా సోకిందో ఇప్పటికీ స్పష్టత రాలేదని హెల్త్​ సిబ్బంది పేర్కొన్నారు. గద్వాల జిల్లాలో మర్కజ్ లింక్​తోపాటు ఏపీలోని నెల్లూరు జిల్లాకు వెళ్లొచ్చినవారికి వైరస్ సోకింది. దీంతో గద్వాల, నెల్లూరు మధ్య బార్డర్‌‌ పూర్తిగా మూసేయాలని అధికారులు ఆదేశించారు. వికారాబాద్ జిల్లాలో ఇప్పటివరకు 37 కేసులు నమోదయ్యాయి. అక్కడ వారం రోజు లుగా కొత్త కేసులు లేవు. అయినా ఇంటింటి సర్వే కొనసాగించాలని అధికారులు నిర్ణయించారు.

Latest Updates