స్విగ్గీ, జొమాటో.. తగ్గండి తగ్గండి

భారీ డిస్కౌంట్లు, దోపిడీ ధరలకు పాల్పడుతున్నాయనే రెస్టారెంట్ల ఆరోపణల మీద డిపార్ట్‌‌మెంట్‌‌ ఫర్‌‌ ప్రమోషన్‌‌ ఆఫ్‌‌ ఇండస్ట్రీ అండ్‌‌ ఇంటర్నల్‌‌ ట్రేడ్‌‌ (డీపీఐఐటీ) ఫుడ్‌‌ డెలివరీ కంపెనీలు స్విగ్గీ, జొమాటో, ఫుడ్‌‌పాండా, ఉబర్‌‌ ఈట్స్‌‌లను గురువారం మీటింగ్‌‌కు పిలిచింది. లోకల్‌‌ కిరాణా షాపులు, చిన్న రిటైలర్ల వ్యాపారాలను దెబ్బతీస్తున్నాయంటూ ఇటీవలే గ్లోబల్‌‌ ఈ–కామర్స్‌‌ కంపెనీలను ఉద్దేశించి కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్‌‌ గోయెల్‌‌ వ్యాఖ్యానించారు. ఈ పెద్ద కంపెనీలు దోపిడీ ధరలతో చిన్న వర్తకుల పొట్టకొడుతున్నాయని ఆయన అన్నారు. చిన్న రిటైలర్లు, కిరాణా షాపుల మనుగడను పరిరక్షిస్తామని చెప్పారు. చిన్న వ్యాపారాలు, పెద్ద ఈ–కామర్స్‌‌ కంపెనీల ప్రయోజనాలను కాపాడేందుకు అన్ని చర్యలనూ ప్రభుత్వం తీసుకుంటోందని గోయెల్‌‌ తెలిపారు. రెస్టారెంట్ల సమస్యలు పరిష్కరించేందుకే ఫుడ్‌‌ యాగ్రిగేటర్ల మీటింగ్‌‌ నిర్వహిస్తున్నారు. లోకల్‌‌ కిరాణా షాపులు గ్లోబల్‌‌ ఈ–కామర్స్‌‌ కంపెనీల నుంచి ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నాయో, అదే తరహా సమస్యలను ఫుడ్‌‌ యాగ్రిగేటర్ల నుంచి రెస్టారెంట్లు ఎదుర్కొంటున్నాయని ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. ఫెడరేషన్‌‌ ఆఫ్‌‌ హోటల్‌‌ అండ్‌‌ రెస్టారెంట్‌‌ అసోసియేషన్స్‌‌ ఆఫ్‌‌ ఇండియా, నేషనల్‌‌ రెస్టారెంట్‌‌ అసోసియేషన్‌‌ ఆఫ్‌‌ ఇండియాలు గురువారం మీటింగ్‌‌లో పాల్గొన్నాయి.

రెస్టారెంట్లు, ఆన్‌‌లైన్‌‌ ప్లేయర్లు ఇద్దరినీ చర్చలలో భాగం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఒకరి ప్రయోజనాలను మరొకరు దృష్టిలో పెట్టుకుని, రెండు విభాగాలూ ఎదిగేలా సొల్యూషన్స్‌‌పై ఈ మీటింగ్‌‌లో దృష్టి పెట్టనున్నట్లు మరో అధికారి చెప్పారు. డీపీఐఐటీ సెక్రటరీ రమేష్‌‌ అభిషేక్‌‌ ఈ మీటింగ్‌‌కు పిలిచారని స్విగ్గీ అధికార ప్రతినిధి వెల్లడించారు. ఫుడ్‌‌ సర్వీస్‌‌ రంగంలోని  అందరు ప్రతినిధులూ మీటింగ్‌‌లో పాల్గొంటారని చెప్పారు. పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలు–సవాళ్ల గురించి చర్చించనున్నామని తెలిపారు. ఉబర్‌‌ఈట్స్‌‌, జొమాటో, ఓలా (ఫుడ్‌‌పాండా)లు ఈమెయిల్స్‌‌కు బదులివ్వలేదు. రెస్టారెంట్‌‌ అసోసియేషన్ల ప్రతినిధులు దాదాపు రెండు నెలల కిందట డీపీఐఐటీ అధికారులను కలిసి తమ కష్టాలను చెప్పుకున్నారు. ఫుడ్‌‌ యాగ్రిగేటర్ల భారీ డిస్కౌంట్లు, దోపిడీ ధరలు తమ వ్యాపారాలను దారుణంగా దెబ్బతీస్తున్నాయని రెస్టారెంట్ల ప్రతినిధులు ప్రభుత్వ అధికారులకు తెలిపారు. అంతేకాదని, యాగ్రిగేటర్లు తమ సొంత ప్రైవేట్‌‌ లేబుల్స్‌‌ ప్రవేశపెడుతూ, ఆఫ్‌‌లైన్‌‌ ప్లేయర్లను దెబ్బతీస్తున్నాయని కూడా వాపోయారు. వినియోగదారుల ఇష్టాలకు సంబంధించిన డేటా తమ వద్ద ఉండటంతో, దాని ఆధారంగా తమ ప్రైవేట్‌‌ లేబుల్‌‌ బిజినెస్‌‌ను యాగ్రిగేటర్లు రూపొందించుకుంటున్నారని రెస్టారెంట్‌‌ సంఘాల ప్రతినిధులు ఆరోపించారు. తమ సొంత ప్రొడక్ట్స్‌‌ మీద భారీ డిస్కౌంట్స్‌‌ ఇస్తూ, రెస్టారెంట్లూ ధరలు తగ్గించేలా వత్తిడి తెస్తున్నాయని, ఫలితంగా రెస్టారెంట్ల లాభదాయకత దెబ్బతింటోందని వాపోయారు. జూలై 4 మీటింగ్‌‌ డిస్కౌంట్ల సమస్యకే పరిమితం కాదని రెండు ప్రముఖ ఫుడ్‌‌ యాగ్రిగేటర్ల ప్రతినిధులు వెల్లడించారు. ఈ రంగాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు ఏ చర్యలు తీసుకోవాలో తాము డీపీఐఐటీకి ప్రతిపాదించనున్నట్లు వారు తెలిపారు. ఫుడ్‌‌ సేఫ్టీ మెరుగుపరచడానికీ ఐడియాలు ఇవ్వనున్నట్లు చెప్పారు. ఈ ఏడాది మొదట్లో దేశంలోని 500కి పైగా రెస్టారెంట్లు కాంపిటీషన్‌‌ కమిషన్‌‌కు కంప్లెయింట్‌‌ చేశాయి. ఐతే, ఈ రంగంలో ఎఫ్‌‌డీఐ సమస్యలు లేవు. కాకపోతే, రంగంలోని వివిధ విభాగాల పనితీరును అవగాహన చేసుకోవాలని ప్రభుత్వం భావిస్తోందని టెక్నోపాక్‌‌ ఛైర్మన్‌‌ అరవింద్‌‌ సింఘాల్‌‌ చెప్పారు. గత ఆరు నెలల్లో ఇండియాలో ఫుడ్‌‌ ఆర్డరింగ్‌‌ రంగం స్వరూపం చాలా మారింది. మార్కెట్‌‌ లీడర్లైన స్విగ్గీ, జొమాటోలు ఒకరితో ఒకరు పోటీపడుతూ కోట్ల రూపాయలను కుమ్మరిస్తున్నాయి. ఇదిలావుంటే, క్యాబ్‌‌ యాగ్రిగేటర్లు ఓలా, ఉబర్‌‌లు ఫుడ్‌‌ డెలివరీ వ్యాపారం కష్టమని తెలుసుకుని ఇంచుమించుగా చేతులెత్తేశాయి. అవి కూడా కోట్ల రూపాయలను వెచ్చించాయి. చిన్న రెస్టారెంట్లతోపాటు, పెద్ద చెయిన్స్‌‌ కూడా ఈ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొచ్చాయి. యాప్‌‌లు ఇస్తున్న డిస్కౌంట్లతో తమ వ్యాపారం 30 శాతం తగ్గిపోయిందని ఆ రంగంలోని ఒకరు చెప్పారు.