చిటికెలో కంపెనీ..సరికొత్తగా ఈ-ఫామ్

  • సరికొత్తగా ఈ–ఫామ్‌   
  • పీఎఫ్, ఈఎస్‌ఐ, బ్యాంక్​ అకౌంట్​ సహా 10 రకాల సేవలు..

న్యూఢిల్లీ :  ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌ను మరింత మెరుగు పరిచేందుకు, ప్రభుత్వం సరికొత్త విధానాలను తీసుకొస్తోంది. కొత్తగా వ్యాపారాలు ఏర్పాటు చేసే కంపెనీలకు త్వరగా అనుమతులు ఇచ్చేందుకు,  ఇంటిగ్రేటెడ్ ఎలక్ట్రానిక్ ఫామ్‌ను ఈ నెల 15 నుంచి తీసుకొస్తోంది. ఈ ఎలక్ట్రానిక్ ఫామ్‌తోనే ఈపీఎఫ్‌ఓ, ఈఎస్‌ఐసీ రిజిస్ట్రేషన్ నెంబర్లను కూడా వెంటనే జారీ చేయనుంది. ఎస్‌పీఐసీఈ+(సింప్లిఫైడ్ ప్రోఫార్మా ఫర్ ఇన్‌కార్పొరేటింగ్ కంపెనీ ఎలక్ట్రానికలీ) పేరుతో ఈ ఎలక్ట్రానిక్ ఫామ్‌ను కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అందుబాటులో ఉంచుతుంది. ఈ ఫామ్ ద్వారా 10 రకాల సర్వీసులను ఆఫర్ చేస్తోంది. దీంతో ఇండియాలో కంపెనీలు ఏర్పాటు చేయాలనుకునే వారికి చాలా ప్రొసీజర్లకు సమయంతో పాటు ఖర్చు ఆదా అవుతోందని మంత్రిత్వ శాఖ చెప్పింది.

కార్మిక మంత్రిత్వ శాఖ, ఆర్థిక మంత్రిత్వ శాఖలోని రెవెన్యూ డిపార్ట్‌మెంట్, మహారాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ ఫామ్ ద్వారా మరికొన్ని సర్వీసులను ఆఫర్ చేయనున్నాయి. ఈ నెల 15 నుంచి ఏర్పాటు చేయబోయే అన్ని కొత్త కంపెనీలకు ఈపీఎఫ్‌ఓ(ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్), ఈఎస్‌ఐసీ(ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్) తప్పనిసరి చేసింది ప్రభుత్వం. ఈపీఎఫ్‌ఓ,ఈఎస్‌ఐసీ రిజిస్ట్రేషన్ నెంబర్లను సంబంధిత ఏజెన్సీలు సెపరేట్‌గా జారీ చేయవని నోటీసులో కార్పొరేట్ వ్యవహారాల శాఖ చెప్పింది. కంపెనీకి పాన్(పర్మినెంట్ అకౌంట్ నెంబర్), టాన్(ట్యాక్స్ డిడక్షన్ అండ్ కలెక్షన్ అకౌంట్ నెంబర్), ప్రొఫెషన్ ట్యాక్స్ రిజిస్ట్రేషన్(మహారాష్ట్ర), బ్యాంక్ అకౌంట్ ఓపెన్‌ అన్నీ కూడా ఈ ఫామ్ ద్వారానే జారీ చేయనున్నారు. డైరెక్టర్ ఐడెంటిఫికేషన్ నెంబర్(డీఐఎన్), జీఎస్టీఐఎన్‌ అప్లయి చేస్తే.. వాటిని కూడా దీని ద్వారానే అందించనున్నారు.

Latest Updates