వరల్డ్‌ క్లాస్‌ ‘విద్య’

  • ప్రపంచ స్థాయి విద్యాసంస్థల నిర్మాణం   
  • ఫారినర్స్‌‌ను ఆకర్షించేలా ‘స్టడీ ఇన్‌ ఇండియా’
  • పరిశోధనలు పెంచేందుకు ఎన్‌ఆర్‌ఎఫ్‌
  • కొత్త జాతీయ విద్యావిధానం అమలు
  • బడ్జెట్‌లో విద్యారంగానికి రూ.94,853.64 కోట్లు
  • గతేడాది కంటే 13 శాతం ఎక్కువ నిధులు
  • హెచ్‌ఈఎఫ్‌ఏ ద్వారా అందుబాటులో మరో 30వేల కోట్లు

ఢిల్లీ: 2019-–20 బడ్జెట్‌‌లో కేంద్ర ప్రభుత్వం విద్యారంగంలో పలు సంస్కరణలకు నాంది పలికింది. వరల్డ్‌‌ క్లాస్‌‌ విద్యాసంస్థల నిర్మాణం, స్టడీ ఇన్‌‌ ఇండియా, పరిశోధనల పెంపునకు నిధులివ్వడం, కొత్త జాతీయ విద్యావిధానం అమలు ద్వారా పలు విప్లవాత్మక మార్పులు తీసురానున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌‌ బడ్జెట్‌‌ ప్రసంగంలో వివరించారు. విద్యారంగానికి రూ. 94,853.64 కోట్లు కేటాయించారు. ఇది గతేడాది కంటే 13 శాతం ఎక్కువ. ఈ ఏడాది విద్యారంగానికి కేటాయించిన మొత్తంలో రూ.38,317.01 కోట్లు ఉన్నత విద్యకు, రూ.56,536.63 కోట్లు స్కూల్‌‌ ఎడ్యుకేషన్‌‌కు ఇచ్చారు. అలాగే హయ్యర్ ఎడ్యుకేషన్‌‌ ఫైనాన్స్‌‌ ఏజెన్సీ(హెచ్‌‌ఈఎఫ్‌‌ఏ) ద్వారా మరో 30వేల కోట్ల రూపాయలు కూడా అందుబాటులో ఉంచినట్లు కేంద్ర మానవవనరుల శాఖ పేర్కొంది.

వరల్డ్‌‌ క్లాస్‌‌ విద్యాసంస్థల నిర్మాణానికి కేంద్రం 400 కోట్ల రూపాయలు కేటాయించింది. ఇది గతేడాదితో పోల్చితే మూడు రెట్లు ఎక్కువ. విదేశీ స్టూడెంట్లను ఆకర్షించే లక్ష్యంతో ‘స్టడీ ఇన్‌‌ ఇండియా’  ప్రోగ్రామ్‌‌ ప్రవేశపెట్టనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.

కొత్తగా జాతీయ విద్యా విధానం

భారత ఉన్నత విద్యావ్యవస్థను ప్రపంచంలోని అత్యుత్తమమైన వాటిలో ఒకటిగా తీర్చిదిద్దేందుకు కొత్త జాతీయ విద్యావిధానం తీసుకొస్తున్నట్లు తెలిపింది. కొత్తకొత్తవి కనుక్కోవడంపై, పరిశోధనలపై మరింత దృష్టి సారించేలా స్కూల్‌‌, ఉన్నత విద్యలో పెద్దఎత్తున మార్పులు తీసుకురానున్నట్లు వివరించారు.  దేశంలో పరిశోధనలు పెంచడంతోపాటు కోఆర్డినేట్‌‌ చేసేందుకు నేషనల్‌‌ రీసెర్చ్‌‌ ఫౌండేషన్‌‌(ఎన్‌‌ఆర్‌‌ఎఫ్‌‌)ను ఏర్పాటు చేస్తామంది. ఎన్‌‌ఆర్‌‌ఎఫ్‌‌ దేశంలో పరిశోధనారంగాన్ని బలోపేతం చేయడంతోపాటు జాతీయ ప్రాధాన్యం ఉన్న అంశాలు గుర్తించి రీసెర్చ్‌‌కు టేకప్‌‌ చేసేలా సహకరిస్తుంది. అలాగే ఒకే అంశంపై అనేక చోట్ల రిసర్చ్‌‌ చేస్తూ టైమ్‌‌, ఖర్చు పెరగకుండా జాగ్రతలు తీసుకుంటుంది.  హయ్యర్‌‌ ఎడ్యుకేషన్‌‌ కమిషన్‌‌ ఆఫ్‌‌ ఇండియా(హెచ్‌‌ఈసీఐ) డ్రాఫ్ట్‌‌ బిల్‌‌ దాదాపు పూర్తికావొచ్చిందని ఈ ఏడాదే దాన్ని ప్రవేశపెట్టనున్నట్లు ప్రభుత్వ తెలిపింది. ఇంకా మెరుగైన ప్రతిఫలాలు సాధించేందుకు ఉన్నత విద్యావ్యవస్థను రెగ్యులేట్‌‌ చేసేలా హెచ్‌‌ఈసీఐకి మరింత స్వయంప్రతిపత్తి కల్పించేందుకు ఇందులో పలు సంస్కరణలు ప్రవేశపెట్టనున్నట్లు సూచించింది.

‘ఖేలో ఇండియా’ విస్తరిస్తాం

ఖేలో ఇండియా ప్రోగ్రామ్‌ను విస్తృతపరిచేందుకు నేషనల్‌ స్పోర్ట్స్‌ ఎడ్యుకేషన్‌ బోర్డ్‌ (ఎన్‌ఎస్‌ఈబీ) ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం బడ్జెట్లో పేర్కొంది. ఎలాంటి హెచ్చుతగ్గులు లేకుండా ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్లో కేటాంచిన మొత్తాన్ని కొనసాగించారు. ఖేలో ఇండియా స్కీంకు అవసరమైనన్ని నిధులు ఇచ్చేందుకు క్రేద్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని వివరించింది. దీని ద్వారా  ప్రతి స్థాయిలో క్రీడల్ని, ఆటగాళ్లను ప్రోత్సహిస్తామంది. క్రీడలు, యువజన మంత్రిత్వ శాఖకు 2019-–20 లో రూ. 2216.92 కోట్లు కేటాయించారు. ఇది గతేదాది కంటే రూ.214.2 కోట్లు ఎక్కువ.

విద్యారంగానికి 2019-20 బడ్జెట్ కేటాయింపులు

మొత్తం విద్యారంగానికి రూ. 94,853.64 కోట్లు

స్కూల్‌ ఎడ్యుకే షన్‌రూ. 56,536.63 కోట్లు

ఉన్నత విద్య రూ. 38,317.01 కోట్లు

 

Latest Updates