కలిసి కొట్లాడుదం: ఉద్యోగ సంఘాల జేఏసీ

ఒక్క కార్మికుడికీ నష్టం జరగనివ్వం.. ఆర్టీసీ ఆస్తులు కాపాడుకుంటం

అవసరమైతే సకలజనుల సమ్మె.. ఉద్యోగ సంఘాల జేఏసీ, ఆర్టీసీ జేఏసీ ప్రకటన

ఆర్టీసీ కార్మికులు, ప్రభుత్వ ఉద్యోగులు జట్టుకట్టారు. డిమాండ్ల సాధన కోసం ప్రభుత్వంపై కలిసి పోరాడుదామని నిర్ణయించారు. ఆర్టీసీని కాపాడుకుంటామని, సమస్యలు పరిష్కారం కాకపోతే మరో సకల జనుల సమ్మె తప్పదని ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్​, టీఎన్జీవో అధ్యక్షుడు కారం రవీందర్​రెడ్డి అన్నారు. ప్రభుత్వం కోరితే ఆర్టీసీ కార్మికులతో చర్చించడానికి కూడా తాను సిద్ధమని ప్రకటించారు. మంగళవారం టీఎన్జీవో భవన్‌లో ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలను ఆర్టీసీ జేఏసీ నేతలు కలిసి తమ సమ్మెకు మద్దతు ఇవ్వాలని కోరారు. ఇందుకు ఉద్యోగ సంఘాల జేఏసీ అంగీకరించింది. అనంతరం నాయకులు మీడియాతో మాట్లాడారు.

పూర్తిగా మద్దతిస్తున్నం

ఆర్టీసీ కార్మికుల సమ్మెకు పూర్తిగా మద్దతునిస్తున్నామని ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్​ కారం రవీందర్‌రెడ్డి తెలిపారు.  కార్మికులెవరూ అధైర్యపడొద్దని ఆయన కోరారు. కార్మికుల ఆత్మహత్యలు తమను కలిచి వేశాయన్నారు. సకల జనుల సమ్మెలో బస్సు టైరు కదిలిందో.. ఆగిందో ఎవరిని అడిగినా తెలుస్తుందని, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎంతగానో శ్రమించిన ఆర్టీసీ కార్మికుల పక్షాన్నే తాము ఉంటామని ఆయన స్పష్టం చేశారు.

ఉద్యోగుల, కార్మికుల సమస్యలు పరిష్కారం కాకపోతే మరో సకల జనుల సమ్మె తప్పకపోవచ్చన్నారు.  ఆర్టీసీ జేఏసీ నేతలు టీఎన్జీవో భవన్‌‌కు రాకముందే వారి సమస్యలను ప్రభుత్వానికి నివేదించాలని తమ సమావేశంలో తీర్మానించామని ఆయన చెప్పారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసమే మొన్న తాము సీఎంను కలిశామన్నారు. సకల జనుల సమ్మెలో కీలకంగా ఉన్న ఆర్టీసీకి ఇబ్బంది జరిగినప్పుడు తోడుండాల్సిందేనని ఉద్యోగ సంఘాల జేఏసీ నిర్ణయించిందని తెలిపారు. అందరిని కలుపుకొని పోతామని, సంస్థ బాగుంటేనే కార్మికులు బాగుంటారని చెప్పారు. ఆర్టీసీ ఆస్తుల పరిరక్షణ, నష్టాలు పూరించే విషయంలో ప్రభుత్వంపై ఎంత ఒత్తిడి తీసుకురావడానికైనా తాము కలిసి వస్తామని కారం రవీందర్​రెడ్డి స్పష్టం చేశారు. సమ్మెపై బుధవారం ఉద్యోగు సంఘాల జేఏసీలోని 126  సంఘాలతో చర్చించి భవిష్యత్‌‌ కార్యాచరణను ప్రకటిస్తామన్నారు. బుధవారం నుంచే ఉద్యోగ సంఘాల జేఏసీ కార్యాచరణ ఉంటుందని తెలిపారు. సమ్మెకు ముందు కార్మికులు తమను కలిసినా, కలువకున్నా వాళ్లు తమ సోదరులేనన్నారు. కార్మికుల సమస్యలు పరిష్కారమైతేనే సమ్మె ఆగుతుందని స్పష్టం చేశారు. ప్రతి కార్మికుడ్ని కాపాడుకోవడమే ఉద్యోగ సంఘాల జేఏసీ లక్ష్యమని, ఇందులో అందరూ భాగస్వాములేనని చెప్పారు. ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపాలని ప్రభుత్వం కోరితే చర్చించేందుకు తాను సిద్ధమని ఆయన ప్రకటించారు. కార్మికుల సమస్యలను సీఎస్‌‌కు వివరిస్తామన్నారు. ప్రభుత్వ, వివిధ కార్పొరేషన్ల, సంస్థల ఉద్యోగులు ఎన్నో సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. గత రెండేండ్లుగా ఉద్యోగులు, కార్మికు సమస్యల పరిష్కారం కోసం తాము ఎన్నో సార్లు సీఎస్‌‌ను కలిశామని చెప్పారు. ‘‘ఎన్నికలు జరుగుతుంటాయి.. ప్రభుత్వాలు వస్తాయి.. పోతాయి కానీ ఉద్యోగుల సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదు. అన్ని శాఖల్లోనూ ఉద్యోగులు అసంతృప్తితో ఉన్నారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కాకపోతే మరో సకల జనుల సమ్మె చేసే పరిస్థితి తలెత్తుతుంది”అని ఆయన  హెచ్చరించారు. టీజీవో అధ్యక్షురాలు మమత మాట్లాడుతూ, ఉద్యోగుల సమస్యల పరిష్కారమే తమ ధ్యేయమన్నారు. అందరం కలిసి ఐక్యంగా ముందుకు సాగుదామని తెలిపారు. ప్లాన్‌‌ ఆఫ్‌‌ యాక్షన్‌‌లో ఉద్యోగులందరం పాలుపంచుకుంటారని ఆమె చెప్పారు.

అందరూ అండగా నిలవాలి: అశ్వత్థామరెడ్డి

తెలంగాణ వచ్చిన తర్వాత ఆర్టీసీలో ఒక్క కొత్త బస్సును కూడా కొనలేదని ఆర్టీసీ జేఏసీ చైర్మన్‌‌ అశ్వత్థామరెడ్డి అన్నారు.  7 వేల మంది కార్మికులు రిటైర్‌‌ అయినా కొత్తగా రిక్రూట్‌‌మెంట్‌‌ చేయలేదని, తప్పనిసరి పరిస్థితుల్లోనే తాము సమ్మెకు వెళ్లామని చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో అందరినీ కలుపుకుపోయామని, టీఎన్జీవోలు, టీజీవోలు తమకు గతంలోనూ మద్దతుగా నిలిచారని తెలిపారు. ఉమ్మడి ఏపీలో తెలంగాణలోని 1,200 గ్రామాలకు బస్సులు లేకపోగా, ఇప్పుడు రాష్ట్రంలో 3 వేల గ్రామాలకు బస్సు సౌకర్యం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టీసీ ఆస్తులను నేతల బినామీలకు లీజులకు ఇచ్చారని, వాళ్లు మల్టీప్లెక్సులు, పెట్రోల్‌‌పంపులు పెట్టి వ్యాపారాలు చేస్తున్నారని అన్నారు. సమ్మెకు ఉద్యోగులు మద్దతివ్వలేదనే బాధతోనే ఆ సంఘాలపై విమర్శలు చేశామని చెప్పారు. సమ్మె విరమించి చర్చలకు వెళ్లాలని హైకోర్టు చెప్పలేదని ఆయన అన్నారు.   ప్రభుత్వం పిలిస్తే చర్చలకు తాము మొదటి నుంచి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. సబ్సిడీ, బ్యాంక్‌‌ గ్యారంటీ, జీహెచ్‌‌ఎంసీ సహా ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు ఇవ్వడంలో రాష్ట్ర సర్కార్​ తీవ్రంగా నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు. కార్మికులకు చెందిన రూ.1,400 కోట్ల  పీఎఫ్‌‌ నిధులను యాజమాన్యం ఉపయోగించుకుందన్నారు. సరిగ్గా వైద్యం అందడం లేదని, పనిగంటలు పెరిగి కార్మికులపై భారం పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ సాధనలో ఎంతో కీలకంగా పనిచేసిన ఆర్టీసీ కార్మికులను కొందరు ఉద్యమ ద్రోహులే ఇప్పుడు ద్రోహులుగా చిత్రీకరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 2018లో సమ్మె నోటీస్‌‌ ఇస్తే ఏడుగురు మంత్రులతో కమిటీ వేశారని, ఆ కమిటీ ఏమైందో, ఆ సూచనలు ఎందుకు అమలు కాలేదో ఎవరికీ తెలియదన్నారు. ఆర్టీసీని కాపాడుకునేందుకే సమ్మెకు వెళ్లామని, తమకు అందరూ అండగా నిలువాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

మరింత ఉధృతం కానున్న సమ్మె

ఆర్టీసీ కార్మికుల సమ్మెకు ఇప్పటికే రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, పలు ట్రేడ్​ యూనియన్లు, స్టూడెంట్​ యూనియన్లు మద్దతు తెలిపి.. సంఘీభావంగా ర్యాలీలు, సమావేశాలు నిర్వహిస్తున్నాయి. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగ సంఘాల జేఏసీ కూడా మద్దతు తెలుపడంతో సమ్మె మరింత ఉధృతం కానుంది. ఆర్టీసీ కార్మికులు చేపట్టనున్న కార్యక్రమాల్లో తామూ పాల్గొంటామని ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు ప్రకటించారు. ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా నల్లబ్యాడ్జీలతో ప్రభుత్వ ఉద్యోగులు నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఈ నెల 19న  తలపెట్టిన రాష్ట్ర బంద్ లో కూడా పాల్గొని, సమస్యల పరిష్కారం కోసం పోరాడనున్నారు.

టీఎన్జీవో భేటీలో సమ్మెపై ప్రధాన చర్చ!

టీఎన్జీవో ఈసీ సమావేశంలో మంగళవారం ఆరు గంటలపాటు జరిగింది. ఇందులో ఆర్టీసీ సమ్మెపై ప్రధానంగా చర్చించినట్లు తెలిసింది. 33 జిల్లాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు ఇందులో పాల్గొని.. ఆర్టీసీ సమ్మెకు మద్దతివ్వాలని ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. మరోవైపు ఈ జేఏసీలోని 126 సంఘాలు బుధవారం భేటీ కానున్నాయి. అనంతరం సమస్యల పరిష్కారం కోసం సీఎస్ ఎస్​కే జోషిని ఆ జేఏసీ నేతలు కలువనున్నారు. తమ ఉద్యోగులకు సంబంధించిన 18 సమస్యలతోపాటు 19వ అంశంగా ఆర్టీసీ కార్మికుల సమస్యను కూడా సీఎస్  దృష్టికి తీసుకువెళ్లనున్నారు.

– కారం రవీందర్​రెడ్డి,
ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్​

Latest Updates