ఎన్నికల్లో కోదండరాంకు మద్దతు ఇవ్వలేం

హైదరాబాద్‌: రాబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీజేఎస్ అధ్యక్షుడు ప్రెఫెసర్ కోదండరాంకు మద్దతు ఇవ్వలేమని తేల్చి చెప్పింది రాష్ట్ర కాంగ్రెస్. ఎన్నికలపై కాంగ్రెస్‌ నేతలు ఆదివారం సన్నాహక సమావేశం నిర్వహించారు. ఏఐసీసీ తెలంగాణ ఇంచార్జ్‌ మానిక్కం ఠాగూర్‌ అధ్యక్షతన గాంధీభవన్‌లో ఈ సమావేశం జరిగింది. వరంగల్-ఖమ్మం-నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి పోటీపడుతున్న కోదండరాంకు మద్దతుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. దీనిపై మాట్లాడిన జిల్లాల కాంగ్రెస్ నేతలు.. పార్టీని నమ్ముకున్న వారికే టికెట్ ఇవ్వాలని బడా నేతలను కోరారు. ఇతర పార్టీలకు మద్దతు ఇస్తే.. పార్టీ క్యాడర్ దెబ్బతుంటుందని పార్టీ ఇంచార్జ్‌ ముందు ఆవేదన వ్యక్తం చేశారు.

బలమైన అభ్యర్థిని మనమే నిలబెడదామని చెప్పినట్లు తెలుస్తోంది. గ్రాడ్యుయేట్ ఓటర్ల నమోదు ప్రక్రియలో స్థానిక నాయకత్వం చొరవ తీసుకోవాలని మానిక్కం ఠాగూర్ ఈ సందర్భంగా సూచించారు. పట్టభద్రుల ఎన్నికలకు సంబంధించి మరో రెండు రోజుల్లో అభ్యర్థిని నిర్ణయించనున్నామని తెలిపారు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జి మానిక్కం ఠాగూర్. 2023లో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ నేతలంతా పని చేయాలన్నారు. కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శాసనసభలో కాంగ్రెస్‌ పక్ష నేత భట్టి విక్రమార్క, సీనియర్‌ నేతలు దామోదర రాజనర్సింహ, షబ్బీర్‌ అలీ తదితరులు పాల్గొన్నారు.

Latest Updates