ఘనంగా ‘అక్కినేని’ అవార్డుల ప్రదానం

హైదరాబాద్: అన్నపూర్ణ స్టూడియోలో అక్కినేని జాతీయ పురస్కారాల వేడుక జరిగింది.
2018 సంవత్సరానికి శ్రీదేవి, 2019 సంవత్సరానికి రేఖకు అక్కినేని జాతీయ పురస్కారాలు దక్కాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి విచ్చేశారు. అవార్డు గ్రహితలకు మెగాస్టార్ చిరంజీవి పురస్కారాలను ప్రదానం చేశారు.

ఈ కార్యక్రమంలో నాగార్జున మాట్లాడుతూ.. ‘సినిమా తల్లి ఎంతో ఇచ్చింది. ఆ తల్లి రుణం తీర్చుకోడానికే నాన్నగారు అక్కినేని జాతీయ పురస్కారాన్ని ప్రకటించారు. ఈ పురస్కారాన్ని ఇవ్వడం ద్వారా తన పేరు పరిశ్రమలో చిరకాలం ఉంటుందని నాన్నగారు భావించేవారు. శ్రీదేవి, రేఖలకు అక్కినేని జాతీయ పురస్కారం ఇవ్వాలని నాన్నగారు ఎప్పుడూ చెబుతుండేవారు. తెలుగు సినిమా ఉన్నంత వరకు నాన్నగారు బతికే ఉంటారు. ఇప్పుడు కూడా నాన్నాగారు ఈ వేదికపైనే ఉన్నారని’ ఆయన అన్నారు.

శ్రీదేవి తరపున ఆమె భర్త బోనీకపూర్ అక్కినేని పురస్కారాన్ని అందుకున్నారు. శ్రీదేవికి అక్కినేని జాతీయ పురస్కారాన్ని అందించినందుకు అక్కినేని ఫౌండేషన్‌కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. పురస్కారాన్ని స్వీకరించిన అనంతరం భావోద్వేగానికి గురైన బోనీకపూర్.. అక్కినేని కుటుంబానికి కృతజ్ఞతలు తెలిపారు.

Latest Updates