మనోళ్లకు ఇంకిన్ని గ్రీన్​కార్డులు!

ఒక దేశానికి ఏడు శాతం పరిమితి తొలగింపుపై ఒక అడుగు ముందుకు

‘హెచ్ఆర్​ 1044’కు హౌస్​ ఆఫ్​ రిప్రజెంటేటివ్స్​ ఆమోదం

 త్వరలో సెనేట్​కు.. ఆ తర్వాత ట్రంప్​ సంతకం

 3 లక్షల మంది ఇండియన్​ ఐటీ ప్రొఫెషనల్స్​కు ప్రయోజనం

 ఫ్యామిలీ బేస్డ్​ ఇమ్మిగ్రెంట్​ వీసాల పరిమితి కూడా పెంపు

అమెరికాలో శాశ్వత నివాసం కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మంది ఇండియన్​ ఐటీ ప్రొఫెషనల్స్​కు గుడ్​ న్యూస్. గ్రీన్​కార్డ్​కు సంబంధించి ఒక అడుగు ముందుకు పడింది. గ్రీన్​కార్డ్​ అప్లికేషన్లపై ఒక దేశానికి ఇప్పటి వరకూ ఉన్న 7 శాతం పరిమితిని ఎత్తేసే బిల్లుకు అమెరికా హౌస్​ ఆఫ్​ రిప్రజెంటేటివ్స్​ ఆమోదం తెలిపింది. ‘ఫెయిర్​నెస్​ ఫర్​ హైస్కిల్డ్​ ఇమ్మిగ్రెంట్స్​ యాక్ట్​ ఆఫ్​ 2019’లేదా ‘హెచ్​ఆర్​ 1044’బిల్లును బుధవారం హౌస్​ ఆఫ్​ రిప్రజెంటేటివ్స్​ సభ ఆమోదించింది. మొత్తం 435 మంది సభ్యులు ఉన్న సభలో 365–65 ఓట్ల తేడాతో బిల్లు పాసయ్యింది. దీంతో అమెరికాలో పర్మినెంట్​ రెసిడెన్స్​ కోసం దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న ఇండియా, చైనా లాంటి దేశాల ఐటీ ప్రొఫెషనల్స్​కు లైన్​ క్లియర్​ కానుంది. అయితే ఈ బిల్లుకు సెనెట్​ ఆమోదం తెలపాల్సి ఉంది. ఆ తర్వాత బిల్లుపై అధ్యక్షుడు ట్రంప్​ సంతకం పెడితే చట్టంగా మారుంది. ఇది చట్టంగా మారితే ఫ్యామిలీ బేస్డ్​ ఇమ్మిగ్రెంట్​ వీసాల్లో ఒక దేశానికి ఉన్న 7 శాతం కోటా ఆ సంవత్సరం అందుబాటులో ఉన్న గ్రీన్​ కార్డుల్లో 15 శాతానికి పెరగనుంది. అలాగే ఎంప్లాయిమెంట్​ బేస్డ్​ ఇమ్మిగ్రెంట్​ వీసాల కోటాలో 7 శాతం పరిమితి తొలగనుంది.

ఎవరికి లాభం..?

గ్రీన్​ కార్డు ద్వారా నాన్​ అమెరికా సిటిజన్.. అమెరికాలో శాశ్వతంగా నివాసం ఉండవచ్చు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా అక్కడ పర్మినెంట్​గా పనిచేసుకోవచ్చు. ఇండియన్​హైస్కిల్డ్​ ఐటీ ప్రొఫెషనల్స్​లో ఎక్కువ మంది హెచ్​1బీ వర్క్​ వీసాలపై అమెరికా వెళ్లి అక్కడ పని చేస్తున్నారు. ప్రస్తుతం అమలవుతున్న ఇమ్మిగ్రేషన్​ సిస్టమ్​తో పర్మినెంట్​ రెసిడెన్సీ పొందేందుకు ఎన్నో పాట్లు పడుతున్నారు. ఒక దేశానికి 7 శాతం పరిమితి కారణంగా గ్రీన్‌‌‌‌కార్డుల కోసం వారంతా ఏళ్లకు ఏళ్లు ఎదురుచూడాల్సి వస్తోంది. ప్రస్తుత సిస్టం ప్రకారం హెచ్​1బీ వీసాలపై పనిచేస్తున్న ఇండియన్​ ఐటీ ప్రొఫెషనల్స్​ గ్రీన్​కార్డ్​పొందాలంటే కనీసం 70 ఏళ్లు పడుతుందని ఓ సర్వేలో వెల్లడైంది. తాజా బిల్లు చట్టంగా మారితే ఎంప్లాయిమెంట్​ బేస్డ్​ ఇమ్మిగ్రెంట్​ కు సంబంధించి ఇప్పటి వరకూ ఒక దేశానికి ఉన్న సంఖ్యా పరిమితి తొలగిపోతుంది. అదే సమయంలో ఫ్యామిలీ స్పాన్సర్డ్​ ఇమ్మిగ్రెంట్ లిమిటేషన్​ ఒక దేశానికి సంబంధించి పరిమితి పెరగనుంది. ఇలాంటి బిల్లునే భారత సంతతికి చెందిన సెనెటర్​ కమలా హ్యారీస్ మరికొందరితో కలిసి​సెనెట్​లో ప్రవేశపెట్టారు. ఇది కూడా త్వరలోనే సెనెట్​ ముందుకు రానుంది.

మా ప్రయత్నాలు ఫలించాయి: సునయన

అమెరికాలో విద్వేషపూరిత హత్యకు గురైన తెలుగు ఇంజనీర్​ శ్రీనివాస్​ కుచిబొట్ల భార్య సునయన ఈ బిల్లు కోసం పోరాటం చేశారు. ఈ బిల్లుకు ఆమోదం లభించడం తమ జీవితంలో కీలకమైన రోజని, ఎన్నో ఏళ్లుగా ఈ రోజు కోసం తాము ఎదురుచూస్తున్నామని, తమ ప్రయత్నాలు ఇప్పటికి ఫలించాయని ఆమె చెప్పారు. 2017 ఫ్రిబవరిలో కాన్సస్​ సిటీలో జరిగిన కాల్పుల్లో శ్రీనివాస్​ హత్యకు గురయ్యాడు. శ్రీనివాస్​ హత్యతో తను ఇమ్మిగ్రేషన్​కు సంబంధించి ఎన్నో కష్టాలు పడ్డానని, దేశంలో ఉండే హక్కును కోల్పోయానని ఆమె చెప్పారు. ఈ రోజు బిల్లు పాసవ్వడంతో తనకు ప్రశాంతత దొరికిందని, తన సంతోషాన్ని చెప్పడానికి మాటలు రావడం లేదని సునయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

Latest Updates