గ్రీన్ టీ ఇలా తాగితేనే ఆరోగ్యం..

అన్ని టీల  లానే గ్రీన్​ టీని కమెలియా సైనసిస్ అనే మొక్క నుంచే సేకరిస్తారు.  దాదాపు వందల యేళ్ల నుంచే గ్రీన్​ టీ అందుబాటులో ఉన్నా…ఇటీవల   ఎక్కువగా ప్రాచుర్యంలోకి వచ్చింది.   అధిక బరువుని తగ్గించుకోవడం కోసం చాలా మంది తీసుకుంటున్న డ్రింక్స్​లో గ్రీన్​ టీని ప్రత్యామ్నాయంగా వాడుతున్నారు. దీని వల్ల ఒంట్లో  కొవ్వు కరగడమే కాదు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అయితే సరైన మోతాదులో, సరైన సమయంలో తాగితేనే.

మోతాదు మించితే

సరైన మోతాదులో తీసుకుంటే గ్రీన్​ టీ ఉపయోగకరంగా ఉంటుంది. కానీ, ఎక్కువగా తీసుకోవడం  వల్ల ఆరోగ్యానికి ఇబ్బంది కలుగుతుంది. అందుకే గ్రీన్​ టీని రోజుకు రెండు లేదా మూడు కప్పులు మాత్రమే తాగాలి.   గ్రీన్​ టీలో కెఫీన్​ ఉండదనుకుని చాలామంది నాలుగైదు కప్పులు తాగుతారు.  కానీ దీనివల్ల కూడా శరీరంలోకి కెఫిన్​ ఎక్కువగా చేరుతుంది.  లివర్​ డ్యామేజ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. శరీరం విషతుల్యం అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి.  శరీరంలో  వ్యర్థాలు పేరుకుపోయి గ్యాస్, అసిడిటీ సమస్యలు కూడా వస్తాయి.  కెఫిన్ కారణంగా తలనొప్పి, నిద్ర  లేమి సమస్యలు, వాంతులు, డయేరియా సమస్యలు కూడా తలెత్తుతాయి. గర్భణిలు, పాలిచ్చే తల్లులు, కిడ్నీ, గుండె సంబంధిత సమస్యలున్న వాళ్లు గ్రీన్​ టీ విషయంలో జాగ్రత్తగా ఉంటే  మంచిదంటున్నారు  నిపుణులు. అలాగే గ్రీన్​ టీలో ఉండే టోనిన్ కారణంగా ఐరన్​ సమస్యలు కూడా వస్తాయి.

పరగడపున వద్దే వద్దు

గ్రీన్​ టీని పరగడుపున అసలు తాగకూడదు. దానికి బదులు గోరు వెచ్చని నీటిలో నిమ్మరసం, తేనె కలుపుకుని తాగితే బెటర్​. దీంతో శరీరంలోని వ్యర్థాలుమూత్రం ద్వారా బయటకి పోతాయి.  కానీ  ఖాళీ కడుపుతో గ్రీన్​ టీ తాగితే  అసిడిటీ  జీర్ణ  సంబంధిత సమస్యలు వస్తాయి. లివర్​కి సంబంధించిన  సమస్యలు  కూడా తలెత్తే అవకాశం ఉంది.

భోజనం ముందు, తర్వాత

భోజనం చేసిన తర్వాత  కనీసం 30 నుంచి 45 నిమిషాల తర్వాతే  గ్రీన్​ టీ తాగాలి. కానీ చాలా మంది  భోజనం చేసిన వెంటనే గ్రీన్​ టీ తాగుతారు. దానివల్ల  తిన్న  ఆహారంలో ఉండే పోషకాలు శరీరానికి సరిగా అందవు.  గ్రీన్​ టీలో ఉండే  యాంటీ ఆక్సిడెంట్లు  ఆహారంలో ఉండే పోషకాలను శరీరం గ్రహించకుండా చేస్తుంది. దీనికి తోడు జీర్ణ సమస్యలు వస్తాయి.  భోజనానికి గంటన్నర ముందు  కూడా గ్రీన్​ టీ తాగొద్దు.

నిద్రకు ముందు

రాత్రి పడుకోబోయే ముందు కొందరు గ్రీన్​ టీ తాగుతారు. అలా అస్సలు చేయకూడదు. ఎందుకంటే గ్రీన్​ టీ డైయురెటిక్​గా పనిచేస్తుంది. అందువల్ల నిద్రలో ఉన్నప్పుడు మూత్ర విసర్జన కోసం ఎక్కువ సార్లు లేవాల్సి వస్తుంది. ఇది నిద్రను చెడగొడుతుంది. కనుక రాత్రిపూట పడుకోబోయే ముందు గ్రీన్​ టీకి దూరంగా ఉండాలి.

రాత్రి పూట
( నిద్రకు గంటన్నర ముందు)

రాత్రి పూట నిద్రకు గంటన్నర ముందు గ్రీన్​ టీ తాగితే జీవక్రియలు బాగా జరుగుతాయి. ఇలా చేయడం వల్ల  నిద్ర పోతున్నా కూడా కొవ్వు వేగంగా కరిగిపోతుంది.   బరువు కూడా తగ్గుతారు.  అలాగే జలుబు, దగ్గు వంటి శ్వాసకోస సమస్యలు చాలా వరకు దూరం అవుతాయి.   అంతేకాదు శరీరం రిలాక్స్​ అవుతుంది. మనసంతా ప్రశాంతంగా మారి నిద్ర బాగా పడుతుంది. మరుసటి రోజు లేచే సరికి ఉల్లాసం, ఉత్తేజంగా ఉంటుంది. రోజంతా తిన్న ఆహారం శరీరంలో వ్యర్థాలుగా పేరుకుపోతాయి. వాటన్నింటిని క్లీన్​ చేయడానికి రాత్రి పడుకోవడానికి గంటన్నర ముందు గ్రీన్​ టీ తాగాలి.  ఇలా చేయడం వల్ల శరీరంలో అంతర్గతంగా ఉన్న అనారోగ్య సమస్యలు కూడా తగ్గుతాయి.  అయితే గ్రీన్​ టీలో పాలు, పంచదార కలపకుండా  డైరెక్ట్​గా తాగితేనే ఈ ఫలితాలుంటాయి.

మళ్లీ  వాడకూడదు

కొంతమంది  ఒకటే టీ బ్యాగ్​ని  రెండు, మూడు సార్లు ఉపయోగిస్తుంటారు.  ఇలా చేయడం వల్ల  అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.  మరీ స్ట్రాంగ్​గా కాకుండా కాస్త లైట్​గా టీ తాగడానికి ఇష్టపడేవాళ్లు  టీ బ్యాగ్​ని రెండోసారి ఉపయోగించుకోవచ్చు.  ఒక బ్యాగ్​ని రెండు కప్పులో ముంచి టీని చేసుకోవచ్చు. అలా కాకుండా ఒకసారి ఉపయోగించిన బ్యాగ్​ని దాచిపెట్టి మళ్లీ కొంత సమయం ​ తర్వాత ఉపయోగించడం ఆరోగ్యానికి అసలు మంచిది కాదు.  ఇలా చేయడం వల్ల బ్యాక్టీరియా  వృద్ధి  చెందుతుంది. ఒకటే టీ బ్యాగ్​ని రెండు సార్లు ఉపయోగించాలనుకుంటే  చిన్న గ్లాస్​లో  నీళ్లు పోసి  టీ బ్యాగ్​ పెట్టి తర్వాత వాడుకోవచ్చు.  వీలైనంత వరకు ఈ పద్ధతికి దూరంగా ఉంటే బెటర్​.

లాభాలున్నాయి.

గ్రీన్​ టీ తాగడం వల్ల దంతాలు దృఢంగా మారతాయి.  గ్రీన్​ టీలో ఉండే యాంటీ మైక్రోబియల్​  దంతాలను సంరక్షిస్తాయి.  గ్రీన్​ టీలో చక్కెర, పాలు కలపకుండా తాగడం వల్ల  అందులో ఉండే  ఔషధ గుణాలు దంత సమస్యలను దూరం చేస్తాయి. గ్రీన్​ టీ తాగితే బరువు తగ్గడమే కాకుండా గుండె జబ్బులు కూడా దరిచేరవు. శరీరంలోని చక్కెర స్థాయి కూడా అదుపులో ఉంటుంది. అలాగే, క్యాన్సర్​ కారకాల  వృద్ధి నియంత్రించడంలోనూ గ్రీన్​ టీ కీలక పాత్ర పోషిస్తుంది

 

Latest Updates