తాండూరు కాలుష్యం తగ్గిస్తున్నారా?: గ్రీన్‌‌ ట్రిబ్యునల్‌‌

  • తీసుకుంటున్న చర్యలేంటో వివరించండి
  •  నెల రోజుల్లో డిటైల్‌‌ రిపోర్ట్‌‌ ఇవ్వండి
  •  గ్రీన్‌‌ ట్రిబ్యునల్‌‌ సీరియస్
  • కేంద్ర, రాష్ర్ట పీసీబీలు, కలెక్టర్‌‌కు ఆదేశాలు

వికారాబాద్​ జిల్లా తాండూరు ప్రాంతంలో వ్యాపిస్తున్న వాయు కాలుష్యంపై జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) సీరియస్‌‌గా తీసుకుంది. దీనిపై కేంద్ర, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి(పీసీబీ) ఆఫీసర్లు, కలెక్టర్ కలిసి నెల రోజుల్లోపు డిటైల్‌‌ రిపోర్ట్‌‌ ఇవ్వాలని ఆదేశించింది. పట్టణంలో పొల్యూషన్‌‌ అరికట్టేందుకు మున్సిపల్, ఆర్​అండ్​బీ, రెవెన్యూ శాఖలు చేపడుతున్న చర్యలు వివరించాలని ఆగష్టు 29న ఆదేశాలు జారీ చేసింది.  వాయు కాలుష్యంలో దేశ రాజధాని ఢిల్లీ మొదటి స్థానంలో ఉండగా వికారాబాద్ జిల్లా తాండూరు రెండో స్థానంలో ఉన్నట్లు రెండేళ్ల క్రితం ఓ సర్వేలో వెల్లడైన సంగతి తెలిసిందే. సర్వేలో తాండూరులో 622 మైక్రోగ్రాములు(క్యూబిక్​ మీటర్‌‌కు) ఉన్నట్లు తేల్చారు. ఢిల్లీలో ఇటీవల కాస్త తగ్గినా తాండూరులో మాత్రం యథావిధిగా ఉందంటూ తాండూరు సిటిజన్స్ వెల్ఫేర్ సొసైటీ ప్రతినిధులు గ్రీన్‌‌ ట్రిబ్యునల్‌‌కు ఫిర్యాదు చేశారు.

ట్రిబ్యునల్ దృష్టికి వచ్చిన అంశాలు…

తాండూరులో నాలుగు వేల ఎకరాల్లో నాపరాయి గనులు, వెయ్యికి పైగా స్టోన్ పాలిషింగ్ యూనిట్లు, నాపరాయి కటింగ్‌‌కు స్లయిస్ యూనిట్లు ఉన్నాయి. సుమారు నాలుగున్నర దశాబ్ధాలుగా ఇవి పనిచేస్తున్నాయి. వీటి నుంచి వెలువడే స్మూక్షంగా ధూళి కణాలు ప్రజల ఆరోగ్యాన్ని కబళిస్తున్నాయి. అలాగే పాలిషింగ్ యూనిట్ల వ్యర్థాలను రోడ్లు, ఖాళీ స్థలాల్లో పారేస్తున్నారు. ఏడేళ్ల క్రితం తాండూరు మండలం జినుగుర్తి – సిరిగిరిపేట శివార్లలో 100 ఎకరాలను సేకరించి ఈ పరిశ్రమలను తరలించాలని యోచించారు. రాజకీయ ఒత్తిళ్లతో సాధ్యం కాలేదు.  ప్రభుత్వరంగ సంస్థ సీసీఐ సిమెంట్ పరిశ్రమకు తోడు మరో ఐదు ప్రైవేటు సిమెంట్​ పరిశ్రమలున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా ఈ పరిశ్రమలు కాలుష్యాన్ని విడుదల చేస్తున్నా ప్రభుత్వం, పీసీబీ పంటించుకోవడం లేదు. పంటలపై తీవ్ర ప్రభావం పడుతోంది. జినుగుర్తి, ఐనెళ్లి శివార్లలోని జిప్సం పరిశ్రమల వల్ల భూగర్భజలాలు కలుషితం అవుతున్నాయి. వాటి నుంచి వచ్చే రసాయనాలు భూమిలోకి వదులుతున్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నా పట్టించుకోవడం లేదు.

Latest Updates