ఆన్ లైన్ మ్యారేజ్: ఫోన్ కు తాళి కట్టిన వరుడు.. వీడియో చూడాల్సిందే..

ప్రతి సంవత్సరం ఈ సీజన్ లో వేల పెళ్లిళ్లు జరుగుతుంటాయి. కానీ, ఈ సంవత్సరం మాత్రం లాక్డౌన్ దెబ్బకు పెళ్లిళ్లన్నీ ఆగిపోయాయి. కచ్చితంగా పెళ్లి చేసుకోవాలని అనుకున్నవాళ్లు మాత్రం తూతూమంత్రంగా కానిచ్చేస్తున్నారు. సోషల్ డిస్టెన్సింగ్ పాటిస్తూ.. కేవలం నలుగురు లేదా అయిదుగురి సమక్షంలో పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. పెళ్లిళ్లు సెటిలయి లాక్డౌన్ వల్ల వేర్వేరు ప్రాంతాల్లో చిక్కుకున్న వాళ్లు కూడా పెళ్లి వాయిదా వేయడం ఇష్టం లేక ఆన్ లైన్ పెళ్లిళ్లకు మొగ్గుచూపుతున్నారు. వధువు ఒకచోట, వరుడు మరోచోట ఉన్నవాళ్లు వీడియో కాలింగ్ ద్వారా పెళ్లి చేసుకుంటున్నారు.

తాజాగా కేరళకు చెందిన ఓ జంట కూడా ఇలాగే ఆన్ లైన్ లో వీడియో కాలింగ్ ద్వారా పెళ్లి చేసుకున్నారు. కొట్టాయం జిల్లాకు చెందిన శ్రీజిత్ నాదేషన్ మరియు అంజనా పెళ్లి ముందుగా జనవరిలో చేయాలని పెద్దలు నిశ్చయించారు. కానీ, ఆ ముహుర్తానికి పెళ్లి వాయిదాపడింది. దాంతో ఏప్రిల్ 26 చేయాలని నిర్ణయించారు. కానీ, ఈ సారి లాక్డౌన్ అడ్డొచ్చింది. వధువు అంజనా.. ఉత్తరప్రదేశ్ లోని లక్నోలో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తుంది. ఆమె అక్కడి నుంచి కేరళకు రావడానికి లాక్డౌన్ సమస్య ఎదురైంది. దాంతో ఏంచేయాలో ఎవరికి అర్థం కాలేదు. మళ్లీ ఈ సారి కూడా పెళ్లి వాయిదా పడుతుందేమోనని అందరూ అనుకున్నారు. కానీ, వధూవరులిద్దరూ వినూత్నంగా ఆలోచించి ఆన్ లైన్ లో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. దానికి వారి పెద్దలను ఒప్పించారు. దాంతో వధువు లక్నోలో, వరుడు కేరళలో ఉండి ఆన్ లైన్ వేదికగా పెళ్లి చేసుకున్నారు. మొదట ఇద్దరూ వీడియో కాల్ చేసుకొని… ఒకరికొకరు ఎదురెదురుగా కూర్చున్నారు. లక్నోలో అంజనా స్నేహితులు పెళ్లి పెద్దలయ్యారు. కేరళలో శ్రీజిత్ కుటుంబ సభ్యులు చూస్తుండగా.. ఫోన్ కు తాళి కట్టాడు. అదే సమయంలో అంజనా తాళిని తన మెడ చుట్టూ ఒక ముడి వేసుకుంది. లాక్డౌన్ ముగియగానే అంజనా కేరళకు వచ్చిన తర్వాత శ్రీజిత్ మిగతా రెండు ముళ్లు వేస్తాడని.. అప్పడు బంధువులకు, స్నేహితులకు మ్యారేజ్ రిసెప్షన్ ఏర్పాటు చేస్తామని శ్రీజిత్ కుటుంబ సభ్యులు తెలిపారు.

For More News..

లాక్డౌన్ పాటిస్తే గిఫ్ట్ గా బంగారం, ఫ్రిడ్జ్, వాషింగ్ మెషిన్

సీసీటీవీ ఫుటేజ్: సిరియాలో బాంబు దాడి.. 40 మంది మృతి

Latest Updates