కొద్ది రోజుల్లో పెళ్లి అనగా.. పెళ్లి కొడుకు తండ్రి, పెళ్లి కూతురు తల్లి జంప్!

దాదాపు ఏడాది క్రితం ఎంగేజ్‌మెంట్ అయింది. ఆ యువ జంట మరో నెల రోజుల్లో మూడు ముళ్ల బంధంతో ఒక్కటవబోతోంది. కానీ అంతలో అదేదో పాత సినిమాలో మాదిరి ఊహించని ట్విస్ట్ ఎదురైంది. సంవత్సరం రోజులుగా ఆ అమ్మాయి, అబ్బాయి.. కన్న కలలు, పెంచుకున్న ఆశలు ఒక్కసారిగా చెదిరిపోయాయి. పూర్వాశ్రమంలో ఎప్పుడో నడిచిన తమ ప్రేమ వ్యవహారం గుర్తొచ్చి.. పెళ్లి కొడుకు తండ్రి (48), పెళ్లికూతురు తల్లి (46) ఇంటి నుంచి వెళ్లిపోయి ఆ యువ జంటకు షాక్ ఇచ్చారు. ఈ ఘటన గుజరాత్‌లో జరిగింది. కాటర్గామ్‌కి చెందిన బిజినెస్‌మ్యాన్ అయిన పెళ్లికొడుకు తండ్రి, నవ్సారీకి చెందిన పెళ్లికూతురి తల్లి తమ పిల్లలకు పెళ్లి చేయబోయి.. లేటు వయసులో వాళ్లిద్దరూ కలిసి వెళ్లిపోయి రెండు కుటుంబాలను నవ్వులపాలు చేశారు.

ఎప్పుడో చిన్న వయసులో పక్క పక్క ఇళ్లలో ఉండేవాళ్లు.. పసితనంలో మొదలైన స్నేహం.. వారితో పాటే పెరిగి ప్రేమగా మారింది. కానీ, పెద్దలు వారి ప్రేమ పెళ్లికి అంగీకరించలేదు. చేసేది లేక ఇద్దరి జీవితం చెరో దారి అయిపోయింది. వేర్వేరు వ్యక్తుల్ని పెళ్లి చేసుకున్నారు. దాదాపు 25 ఏళ్ల గడిచిన తర్వాత ఇప్పుడు వాళ్ల పిల్లలు పెళ్లికి ఎదిగారు. వారికి సంబంధాలు చూస్తుండగా… అనుకోకుండా  విధి ఆ రెండు కుటుంబాలనే ఒక చోటకి చేర్చింది. ఏడాది క్రితం వారి పిల్లలకు పెళ్లి చూపులు జరిగాయి. ఒకరికొకరు నచ్చారు. అంతా ఓకే అనుకుని.. ఎంగేజ్‌మెంట్ కూడా చేసుకున్నారు. ఫిబ్రవరి రెండో వారంలో సూరత్‌లో వైభవంగా పెళ్లి అనుకున్నారు. కానీ, కుర్ర వయసులో ఆ పెళ్లి కొడుకు తండ్రి, పెళ్లి కూతురు తల్లికి మధ్య నడిచిన ప్రేమ.. మళ్లీ ఎదురుపడ్డాక ఆ నాటి జ్ఞాపకాలను చిగురింపజేసింది. వారు తమ పిల్లల పెళ్లి చేయకలేకపోయారు. వారిద్దరూ లేటు వయసులోనైనా ఒక్కటవ్వాలని ఇంటి నుంచి వెళ్లిపోయారు. 10 రోజులుగా వారిద్దరూ తమ ఇళ్లలో కనిపించడం లేదు. దీంతో వారిద్దరూ కలిపి వెళ్లిపోయి ఉంటారని వారి బంధువు ఒకతను చెప్పాడు. వారిద్దరూ చిన్నప్పుడు పక్క పక్క ఇళ్లలోనే ఉండేవారంటూ నాటి ప్రేమ వ్యవహారాన్ని బయటపెట్టాడు. దీంతో పెద్దలు చేసిన ఆ పనితో కలిసి జీవితం పంచుకోవాలనుకున్న ఆ యువ జంటతో పాటు ఆ రెండు కుటుంబాలు చిన్నబోయాయి.

More News:

దగ్గరుండి కటింగ్ చేయించిన తల్లి.. ఉరేసుకున్న కొడుకు

అందమైన అమ్మాయితో ప్రేమ పెళ్లి.. అంతలోనే అనుమానంతో హత్య

Latest Updates