రగులుతోంది : ఆర్టీసీ సమ్మెకు పెరుగుతున్న ప్రజా మద్దతు

కలిసొస్తున్న ట్రేడ్యూనియన్లు, స్టూడెంట్ యూనియన్లు
సై అంటున్న రైతు, కూలీ సంఘాలు, బీడీ కార్మికులు
ఎక్కడ చూసినా నిరసనలు, ధర్నాలు, ఆందోళనలు
వంటావార్పుతో జోరందుకున్న ఉద్యమం
నేడు మంత్రుల ఇండ్లు, బస్భవన్ను ముట్టడించనున్న స్టూడెంట్స్
హైదరాబాద్​లో ఆర్టీసీ కండక్టర్​ ఆత్మహత్య

హైదరాబాద్‌‌, వెలుగు: ఆర్టీసీ సమ్మెతో రాష్ట్రం రగులుతోంది. కార్మికులకు పార్టీలు, ప్రజా సంఘాలతోపాటు జనం మద్దతు పెరుగుతోంది. ఎటు చూసినా నిరసనలు, ఆందోళనలు, రాస్తారోకోలతో రాష్ట్ర రాజధాని సహా అన్ని జిల్లాలు హోరెత్తుతున్నాయి. ఆత్మాహుతికి యత్నించిన డ్రైవర్​ శ్రీనివాస్‌‌ రెడ్డి మరణించడంతో ఉద్యమం మరింత ఉధృతమైంది. హైదరాబాద్​లో మరో ఆర్టీసీ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యలు వద్దని, సమస్యలు పరిష్కారమయ్యే వరకు బరిగీసి కొట్లాడుదామని నాయకులు పిలుపునిచ్చారు. 48వేల మంది కార్మికులను డిస్మిస్​ చేశామన్న సీఎం కేసీఆర్​ తీరుపై ఎక్కడికక్కడ నిరసనలు తెలిపారు.

ఆర్టీసీని కాపాడుకునేందుకు తమ వంతు పాత్ర పోషిస్తామని చెప్పారు. ఇప్పటికే ఉద్యమ కార్యాచరణను ప్రకటించిన అఖిలపక్ష నేతలు, ఆర్టీసీ జేఏసీ నేతలు దాన్ని అమలు చేయడం మొదలుపెట్టారు. తెలంగాణ ఉద్యమం తరహాలోనే మళ్లీ రోడ్ల మీద ఆదివారం వంటావార్పులు చేశారు. సీఎం కేసీఆర్​ దిష్టిబొమ్మలను ఊరేగించి దహనం చేశారు. సకల జనుల సమ్మె దిశగా ఆర్టీసీ ఉద్యమం ముందుకు సాగుతోంది.

కలిసి వస్తున్న జనం

ఆర్టీసీ సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయాలని, సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 5 నుంచి ఆర్టీసీ కార్మికులు సమ్మెబాట పట్టిన విషయం తెలిసిందే. మొదట కార్మికులకే పరిమితమైన ఆందోళనలు.. రోజు రోజుకు తీవ్ర రూపం దాలుస్తోంది. ఇప్పటికే పలు ఉద్యోగ, కార్మిక సంఘాలు, స్టూడెంట్స్‌, టీచర్స్‌ యూనియన్లు, వీఆర్వో, వీఆర్‌ఏ, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌, విద్యుత్, బ్యాంక్‌, ఇన్సూరెన్స్‌, సింగరేణి… ఇలా అనేక సంస్థల్లో పనిచేస్తున్న కార్మికులు ఆర్టీసీ కార్మికులకు మద్దతు తెలిపారు. ప్రస్తుతం కుల సంఘాలు పోరాటాలకు సై అంటున్నాయి. దాదాపు అన్ని రాజకీయ పార్టీలు అండగా నిలిచాయి. ప్రజలు కూడా స్వచ్ఛందంగా ఉద్యమానికి మద్దతు తెలుపుతున్నారు. రాష్ట్ర సర్కార్​ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చట్ట ప్రకారం సమ్మె నోటీసు ఇచ్చి, సమ్మెలోకి వెళ్లిన కార్మికులను సెల్ఫ్‌ డిస్మిస్‌ అయ్యారని ప్రకటించడం ఏమిటని భగ్గుమంటున్నారు. ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన కార్మికులు, కార్మిక సంఘాల పట్ల సీఎం ఇలా ప్రవర్తించడం ఏమిటని సోషల్​ మీడియాలో నెటిజన్లు వీడియోలు, పోస్టులు పెడుతున్నారు. క్షణాల్లో అవి వైరల్​ అవుతున్నాయి. ఆర్టీసీ కార్మికుల సమస్యను పరిష్కరించకుండా, సరైన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా విద్యాసంస్థల దసరా సెలవులను ఈ నెల 19  వరకూ పొడగించడంపై పేరెంట్స్‌, టీచర్స్‌ కూడా మండిపడుతున్నారు.

రాష్ట్ర బంద్​కు ఏర్పాట్లు

ఆదివారం రోడ్లపై వంటావార్పు ప్రోగ్రాంతో ప్రారంభమైన అఖిలపక్షం, ఆర్టీసీ జేఏసీ ఉద్యమ కార్యాచరణకు మద్దతు పెరుగుతోంది. ఈ నెల 19న చేపట్టనున్న రాష్ట్ర బంద్‌కు  అన్ని సంఘాలు సిద్ధమవుతున్నాయి. సోమవారం డిపోల ముందు బతుకమ్మ ఆడుతూ నిరసన తెలుపాలని, హైదరాబాద్​లోని ఇందిరాపార్క్‌ వద్ద సభ పెట్టాలని అఖిలపక్షం పిలుపునిచ్చింది. గురువారం రాస్తారోకోలు, మానవహారాలు నిర్వహించాలని, ఈ నెల 16న స్టూడెంట్స్​ ర్యాలీలు, 17న దిష్టిబొమ్మల దహనాలు, 18న బైక్‌ ర్యాలీలు నిర్వహించాలని కోరింది. బంద్ తర్వాత కూడా ప్రభుత్వం స్పందించకపోతే, ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలని ఆర్టీసీ జేఏసీ, అఖిలపక్షం నిర్ణయించింది.

నేడు మంత్రుల ఇండ్లు, బస్‌భవన్‌ ముట్టడి

లెఫ్ట్‌ స్టూడెంట్స్‌ యూనియన్స్‌తో పాటు ఓయూ స్టూడెంట్​ సంఘాల జేఏసీ వేర్వేరుగా ఉద్యమ కార్యాచరణను ప్రకటించాయి. సోమవారం మంత్రుల క్వార్టర్స్‌ ముట్టడికి ఓయూ జేఏసీ పిలుపునివ్వగా.. బస్‌భవన్‌ ముట్టడితోపాటు కలెక్టరేట్ల ముట్టడికి లెఫ్ట్‌ స్టూడెంట్స్‌ యూనియన్లు పిలుపునిచ్చాయి. 15న జిల్లా కేంద్రాల్లోని డిపోల ముందు ధర్నాలు, నిరసనలు చేపడుతున్నట్టు యూనియన్స్‌ ప్రకటించాయి. 16న ఓయూలో ర్యాలీ నిర్వహించాలని, 21న ప్రగతిభవన్‌ ముట్టడించాలని ఓయూ జేఏసీ పిలుపునిచ్చింది.

ప్రజాసంఘాల పోరుబాట

సమ్మెకు రైతులు, వ్యవసాయ కూలీల సంఘాలూ మద్దతు ప్రకటించాయి. 15న రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు, ధర్నాలు, సర్కారు దిష్టిబొమ్మల దహనానికి పిలుపునిచ్చాయి. ఇప్పటికే టీచర్లు ప్రత్యక్ష ఆందోళనలో పాల్గొంటున్నారు. టీచర్స్‌ జాక్టో, యూఎస్‌పీసీ నేడో, రేపో కార్యాచరణ ప్రకటించనున్నాయి. కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరవుతున్నారు. కార్మిక, ఉద్యోగ, ఉపాధ్యాయ, ప్రజాసంఘాల జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం బస్‌భవన్‌ ముట్టడిస్తామని, 19న సార్వత్రిక సమ్మె చేయాలని  ట్రేడ్‌ యూనియన్స్ అండ్‌ ఎంప్లాయీస్‌ యూనియన్స్‌ ప్రకటించాయి.

ఉప ఎన్నికపై ఎఫెక్ట్

ఆర్టీసీ కార్మికుల సమ్మె ఉధృత రూపం దాల్చడంతో అధికార పార్టీ నేతలు కలవరపడుతున్నారు. ఈ నెల 21న జరుగనున్న హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికపై సమ్మె ఎఫెక్ట్​ పడవచ్చని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గంలోని ఆర్టీసీ కార్మికులు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు హోరెత్తిస్తున్నారు.

Latest Updates